హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): పదేండ్లలో అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసుకొని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ పాలన కావాలో? ఇందిరమ్మ రాజ్యం పేరుతో పేదల ఇండ్లను కూల్చేవారు కావాలో? జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి ఓటేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి రెండేండ్లలో ఒక మాట కూడా నిలబెట్టుకోని రేవంత్‌రెడ్డి ఇప్పుడు జూబ్లీహిల్స్‌ని అభివృద్ధి చేస్తామంటే ఎవరూ నమ్మబోరని స్పష్టం చేశారు. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే రేవంత్‌రెడ్డి నిధులు ఇవ్వట్లేదని, అమ్మకు అన్నం పెట్టనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడా? అని ప్రశ్నించారు. ‘కత్తి కాంగ్రెస్‌కు ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎలా చేయాలి. కత్తి మాకు ఇవ్వండి బుల్డోజర్కు అడ్డంగా వెళ్లి ఆపే బాధ్యత మాది. బుల్డోజర్ను ఆపాలంటే కారు గుర్తుకు ఓటేయాలి. మాగంటి సునీతమ్మను గెలిపించుకుంటే మళ్లీ కేసీఆర్ వస్తారు’ అని పిలుపునిచ్చారు. మూడో నంబర్‌పై ఉన్న కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడలో ఆదివారం మధ్యాహ్నం కేటీఆర్ భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి అమరావతి పబ్లిక్ స్కూల్లో తాను చదువుకున్నానని, ఇక్కడి పరిస్థితులు తెలుసని అన్నారు.
గుండె మీద చేయివేసుకొని ఓటేయండి
జూబ్లీహిల్స్ ప్రజలు గుండె మీద చేయివేసుకొని ఓటేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ‘గత 15-20 రోజులుగా కాంగ్రెసోళ్లు, బీఆర్ఎస్ నాయకులు మీ ఇంటికి వస్తున్నారు. దడ్డం పెట్టి ఓటు అడుగుతున్నారు. గుండె మీద చేయివేసుకొని చెప్పండి. పదేండ్ల బీఆర్ఎస్ పాలన బాగుండెనా? రెండేండ్ల కాంగ్రెస్ పాలన బాగున్నదా? ఆలోచించి ఓటు వేయండి. పదేండ్లు హాయిగా ఉన్నాం. ఈ క్రమంలో భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు కోసం ప్లాటు కొనుక్కున్నరు. బీఆర్ఎస్ పాలనలో భూముల రేట్లు ఎట్ల ఉన్నయి? ఆ ప్లాట్ల ధరలు ఇప్పుడు ఎలా ఉన్నాయో అందరూ ఆలోచించాలి. మనం పెట్టిన పెట్టుబడులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి’ అని ఆవేదన వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్‌లోని నాలుగు లక్షల మంది ఇచ్చే తీర్పుతో తెలంగాణలోని నాలుగుకోట్ల మందికి న్యాయం జరుగుతుందని అన్నారు.
రెండేండ్లలో ఏమీ చేయనోడిని మళ్లీ నమ్ముదమా?
అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేండ్లు అయినా ఏమీ చేయని రేవంత్‌రెడ్డి, ఇప్పుడొచ్చి జూబ్లీహిల్స్‌ని అభివృద్ధి చేస్తామంటే నమ్ముదామా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్ని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అందరినీ మోసం చేసిందని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతున్నారని, రెండేండ్లలో వేల ఇండ్ల్లు కూలగొట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం, ఆదివారం వచ్చిందంటే పేదల ఇండ్లపైకి బుల్డోజర్ వస్తున్నది. ఇందిరమ్మ రాజ్యం పేరుతో ఇండ్లు కూలగొట్టే వాళ్లకు ఎవరైనా ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు.
బుల్డోజర్ను ఆపాలంటే కారు గుర్తుకు ఓటేయాలి
హైడ్రా బుల్డోజర్ వచ్చి పేదల ఇండ్లు కూల్చుతుంటే, అన్నా.. కేసీఆర్ ఎక్కడున్నవ్! అని ఓ బాధితురాలు ఏడుస్తున్నదని కేటీఆర్ గుర్తుచేశారు.‘మాగంటి సునీతమ్మను గెలిపించుకుంటే మళ్లీ కేసీఆర్ వస్తారు. 500 రోజుల్లో కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందాం. రేవంత్‌రెడ్డి మూడేండ్లు ఉంటా అంటున్నరు. మూడేండ్లు ఉంటరో, మూడు నెలలు ఉంటడో తేలిపోతుంది. ఢిల్లీలో రేవంత్‌పై కత్తులు నూరుతున్నరంట. నల్లగొండ, ఖమ్మం జిల్లా నేతలు కొందరు సీఎం కుర్చీ కోసం రెడీ అవుతున్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసిన కానీ, ఇంత దివాలాకోరు ముఖ్యమంత్రిని చూసినమా?’ అని ఎద్దేవా చేశారు.
సినీ కార్మికులను కాపాడుకుంటాం
తన పేరు మరిచిపోయారనే కారణంతో సినీనటులను జైలులో పెట్టిన నీచపు చరిత్ర రేవంత్‌రెడ్డి సొంతమని కేటీఆర్ దుమ్మెత్తిపోశారు. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం బలవంతంగా సన్మానం చేయించుకుంటున్నారని మండిపడ్డారు. సెలవులు ఇవ్వాలని, వేతనాలు పెంచాలని, హక్కులు కాపాడాలని అడిగిన పాపానికి పోలీసులతో పోలీసులనే కొట్టించిన ముఖ్యమంత్రి ఇప్పుడు వారిని నమ్మించేందుకు కొత్త నాటకాలకు తెరలేపారని కేటీఆర్ ధ్వజమెత్తారు. వారి అండ చూసుకొని దొడ్డిదారిలో గెలిచేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తిరిగి కేసీఆర్ వస్తేనే పోలీసులకు న్యాయం జరుగుతుందని, వారి వేతనాలు పెరుగుతాయని స్పష్టంచేశారు.
సునీతమ్మ కుటుంబంపై కుట్రలు
భర్త అకాల మరణంతో ప్రజల ముందుకు వచ్చిన మాగంటి సునీతాగోపీనాథ్ కుటుంబంపై కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఆమెపై, పిల్లలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వాపోయారు. కాంగ్రెస్ లేకుంటే ముస్లింలు లేరంటూ సీఎం రేవంత్‌రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మైనార్టీలను అవమానించడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. మాయమాటలు నమ్మి కాంగ్రెస్‌కు మోకా ఇస్తే కేసీఆర్ తెచ్చిన షాదీముబారక్, రంజాన్ తోఫా, కేసీఆర్ కిట్ స్కీంలను నిలిపి వేయించి ధోకా చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. మైనార్టీలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వంతపాడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలిచ్చే చరిత్రాత్మక తీర్పుతో నవంబర్ 14 తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి కుర్చీ ఊడటం ఖాయమని జోస్యం చెప్పారు. రేవంత్‌రెడ్డి ఓటమి భయంతో కాలికిబలపం కట్టుకొని గల్లీగల్లీ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కుక్కర్లు, చీరలు పంచుతూ ప్రజాస్వామ్యానికి తలవంపులు తెస్తున్నారని తూర్పారబట్టారు. జూబ్లీహిల్స్‌లోని ఆకు రౌడీల పిట్ట బెదిరింపులకు భయపడవద్దని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. వారి చిల్లర ప్రయత్నాలను ఓటుతో తిప్పికొట్టాలని కోరారు. ఈ నెల 11న ఓటున్న ప్రతిఒక్కరూ పోలింగ్ బూత్‌లకు వెళ్లి నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. సునీతమ్మ గెలిచిన వెంటనే బెదిరించిన ఆకురౌడీల అంతుచూస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ఇంత చిల్లర సీఎంను చూడలేదు
ఎన్టీఆర్, వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్.. ఇలా ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశామని, ఏ ఒక ముఖ్యమంత్రి రేవంత్ తరహాలో చిల్లరగా మాట్లాడలేదని కేటీఆర్ విమర్శించారు. ‘పెన్షన్ అడిగితే గుడ్లు పీకి గోటీలు అడుతామంటారు. తులం బంగారం అడిగితే పేగులు పీకి మెడలో వేసుకుంటా అంటారు. గెలిచిన ఎమ్మెల్యేలకే రేవంత్‌రెడ్డి ఏమీ ఇవ్వట్లేదు. మాకే దికులేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. పెండ్లిళ్లు, పేరంటాలకు వెళ్లడం తప్ప పనులు చేయడానికి డబ్బులు లేవని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మరో ఎమ్మెల్యే డబ్బులు కావాలంటూ ఏకంగా వరల్డ్ బ్యాంక్‌కే లెటర్ రాశారు’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బండారు లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, రసమయి బాలకిషన్, అనిల్‌జాదవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, నాయకులు రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఓడిపోతామనే అజార్‌కు మంత్రి పదవి
జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని సర్వేల్లో తేలడంతోనే మైనార్టీకి చెందిన అజారుద్దీన్‌కు రేవంత్‌రెడ్డి మంత్రి పదవి కట్టబెట్డారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘మోసపూరిత కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధిచెప్తే ఆరు గ్యారెంటీలు నడుచుకుంటూ వస్తాయి. అక్కాచెల్లెళ్లకు ప్రతినెలా రూ. 2,500 ఖాతాలో పడతాయి. అవ్వాతాతల పింఛన్లు నాలుగువేలకు పెరుగుతాయి. విద్యార్థినులకు స్కూటీలు అందుతాయి’అని గుర్తుచేశారు. ఇరవై ఏండ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ స్కీంను ఎత్తేసేందుకు రేవంత్ సర్కారు కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. పెండింగ్ బకాయిలు అడిగిన కాలేజీల యజమానులపై ముఖ్యమంత్రి బెదిరింపులకు దిగడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రీయింబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థులను, బెనిఫిట్స్ ఇవ్వకుండా విరమణ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
రెండేండ్లలో ఒక మాట కూడా నిలబెట్టుకోని రేవంత్‌రెడ్డి ఇప్పుడు జూబ్లీహిల్స్‌ని అభివృద్ధి చేస్తామంటే ఎవరూ నమ్మరు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తమన్నరు, ఇస్తున్నరా? హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతున్నరు. రెండేండ్లలో వేల ఇండ్ల్లు కూలగొట్టారు. శని, ఆదివారాలు వచ్చాయంటే పేదల ఇండ్లపైకి బుల్డోజర్ వస్తున్నది. -కేటీఆర్
తన పేరు మరిచిపోయారనే కారణంతో సినీనటులను జైలులో పెట్టిన నీచపు చరిత్ర రేవంత్‌రెడ్డి సొంతం. అసెంబ్లీ ఎన్నికల ముందు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం బలవంతంగా సన్మానం చేయించుకుంటున్నారు. సినీ కార్మికులు అప్రమత్తంగా ఉండాలి. ఓటేస్తే మరో మూడేండ్లు అరిగోసపడాల్సి వస్తుందనే విషయాన్ని విస్మరించవద్దు. -కేటీఆర్