KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) అంబర్‌పేట/చిక్కడపల్లి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కాన్వాయ్‌ని వెంబడించి మరీ దారికాచి అటకాయించి వీరంగం సృష్టించారు. ఏకంగా కేటీఆర్ ఉన్న కారుపైకి ఎక్కి అద్దాలను వెంటతెచ్చుకున్న ఆయుధాలతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు కేటీఆర్ భద్రతా సిబ్బంది.. బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించగా పలువురు గాయపడ్డారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై అనుమానాలు కలుగుతున్నాయి.
అంబర్‌పేట కాంగ్రెస్ లీడర్ల పనే!
అంబర్‌పేట నియోజకవర్గంలో మూ సీ నిర్వాసిత బాధితులకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంగళవారం గోల్నాకలోని న్యూతులసీరాంనగర్(లంక)కు కేటీఆర్ వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో అంబర్‌పేట కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కాన్వాయ్‌ని వెంబడించారు. అంబర్‌పేట ఛే నంబర్ నుంచి తిలక్‌నగర్, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, విద్యానగర్ .. హిందీ మహావిద్యాలయ కూడలి నుంచి వీఎస్టీ మీదుగా వెళ్తున్న క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్ తన గ్యాంగ్‌తో కాన్వాయ్‌ని అటకాయించారు. హిందీ మహావిద్యాలయ చౌరస్తాకు రాగానే మూకుమ్మడిగా కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు.
కేటీఆర్ ఉన్న కారుపైకి ఎక్కి అద్దాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా మరింత రెచ్చిపోయి ఏకంగా కాన్వాయ్ ధ్వంసానికి సిద్ధమయ్యారు. ఈ దాడిలో పలువురు బీఆర్ఎస్ నాయకులు గాయపడ్డారు. ముషీరాబాద్ బీఆర్ఎస్ నాయకుడు హుస్సేన్‌ను రౌండప్ చేసి కొట్టడంతో అతడి చేతికి గాయాలయ్యాయి. భదత్ర కల్పించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా దా డికి తెగబడ్డారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఈ ఘటనలో పోలీసుల తీరు పలు అనుమానాలకు తావిస్తున్నది. కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తలు గుంపులుగా వస్తున్నా ఎందుకు అడ్డుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు
కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ హుస్సేన్, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం సాయంత్రం నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడికి తెగబడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పక్కా ప్లాన్ ప్రకారమే!
దాడికి వెనుక అంబర్‌పేటకు చెందిన కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉన్నదని.. పక్కా ప్లాన్ ప్రకారం చేశారని బీఆర్ఎస్ నాయకులు స్పష్టంచేస్తున్నారు. కేటీఆర్ మంగళవారం గోల్నాకకు వస్తున్నాడని తెలిసి మోత రోహిత్ అడ్డుకోవాలని ప్లాన్ చేశాడని, మొదట బర్కత్‌పుర, తర్వాత ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో ప్రయత్నించినా కుదరలేదని, గోల్నాక నుంచి తిరిగి ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఇంటికి వెళ్తున్న సమయంలో అడ్డుపడి దాడికి దిగారని చెప్తున్నారు.