హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ‘గల్ఫ్ యుద్ధ నేపథ్యంలో నెలకొన్న ఎల్పీజీ సిలిండర్ల కొరతపై తక్షణమే జోక్యం చేసుకోవాలి.. సమన్వయంతో ఎల్పీజీ సరఫరాను పునరుద్ధరించాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాణిజ్య, గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల తీవ్ర కొరత నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు గురువారం కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీకి కేటీఆర్ లేఖ రాశారు. గ్యాస్ కొరత వల్ల హోటళ్లు, హాస్టళ్లు, చిన్నతరహా ఆహార వ్యాపారులు ఎదురొంటున్న సంక్షోభ నివారణకు తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు.
గ్యాస్ సరఫరాను పునరుద్ధరించకపోతే హైదరాబాద్ సహా తెలంగాణవ్యాప్తంగా దాదాపు 90 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు 48 గంటల్లో మూతపడే ప్రమాదం ఉన్నదని తెలంగాణ హోటల్ అసోసియేషన్ హెచ్చరించినట్టు కేటీఆర్ గుర్తుచేశారు. ఐటీ కారిడార్‌లోని పీజీ హాస్టళ్లలో నివసించే లక్షలాది మంది విద్యార్థులు, వరింగ్ ప్రొఫెషనల్స్‌కు భోజనం దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. పీజీ హాస్టళ్లకు ప్రత్యేక రక్షణ క్యాటగిరీ కింద గ్యాస్ సరఫరా చేయాలని సూచించారు.
గ్యాస్ కేటాయింపుల్లో పెద్ద సంస్థల కంటే చిన్న వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల వారికి ప్రాధాన్యం ఇచ్చేలా వర్గీకరణ చేయాలని కోరారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులను రక్షించేలా స్థాయిలవారీ ఎల్పీజీ కేటాయింపు వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు. గ్యాస్ లభ్యతపై ప్రజల్లో ఉన్న అయోమయాన్ని తొలగించడానికి జిల్లాస్థాయి పంపిణీ వివరాలతో కూడిన పబ్లిక్ డాష్‌బోర్డ్‌ను అందుబాటులోకి తేవాలని కేంద్రమంత్రికి సూచించారు.
గ్యాస్ సంక్షోభం ముగిసే వరకు వాణిజ్య సిలిండర్ల ధరలు పెరుగకుండా నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. గృహావసరాల సిలిండర్లను అక్రమంగా మళ్లిస్తూ మూడు రెట్లు ఎకువ ధరకు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్యాస్ ఆధారిత శ్మశానవాటికలను అవసర సేవలుగా గుర్తించి, వాటికి నిరంతర సరఫరా అందించాలని సూచించారు.
హోటల్ రంగంపై ఆధారపడి బతుకుతున్న 80 లక్షల మంది దినసరి కూలీలకు ఉపాధి గ్యారెంటీ ఇవ్వాలని, అవసరమైతే సహాయక నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సంక్షోభం కేవలం ఆర్థిక నష్టమే కాకుండా, సామాన్యుల దైనందిన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని, లక్షలాది మంది ప్రజల జీవనోపాధిని ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం మాటలతో సరిపెట్టకుండా, తక్షణమే క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.