Telangana | హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడం.. ప్రభుత్వ ప్రభ క్రమంగా మసకబారుతుండటం.. అసెంబ్లీ వేదికగా ఇరుకున పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఫార్ములా-ఈ రేస్‌ను తెరమీదికి తెచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేటీఆర్ ఆధ్వర్యంలో ఫార్ములా-ఈ రేస్‌ను నిర్వహించి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచి, హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరాల సరసన నిలిపితే.. రేవంత్ ప్రభుత్వం కక్షతో రేస్‌ను రద్దు చేసి హైదరాబాద్ పరువు తీసిందని విమర్శలు వస్తున్నాయి. ఒకరు తెలంగాణ మేలెంచితే.. మరొకరు కీడెంచారంటూ విశ్లేషకులు మండిపడుతున్నారు.
పర్యావరణాన్ని కాపాడాలన్న లక్ష్యంతో మోటారు వాహనాలు వెదజల్లే కర్బన ఉద్గారాలను తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఫార్ములా ఈ-రేస్ నిర్వహిస్తుంటారు. ఎలక్ట్రిక్ కార్లు కూడా వందల కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలవని నిరూపించడమే ఫార్ములా-ఈ రేస్ లక్ష్యం! అంతర్జాతీయ సంస్థ ‘ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ (ఎఫ్ఐఏ)’ ఈ రేసులను నిర్వహిస్తుంటుంది.
2023 ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు ఈ-రేస్ 9వ సీజన్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యమిచ్చింది. హుస్సేన్‌సాగర్ ఒడ్డున అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మొత్తం 11 జట్లు పాల్గొన్నాయి. ప్రపంచంలోనే అత్యంత క్రేజ్ ఉండే 22 బ్రాండ్ల ఎలక్ట్రిక్ కార్లు పాల్గొన్నాయి. రేస్‌ను చూసేందుకు 35 వేల మంది వచ్చారు. 150 దేశాల్లోని కార్ల ప్రేమికులు ప్రత్యక్ష ప్రసారాలు, వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించారు. ఎలక్ట్రిక్ కార్లు గంటకు 322 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలవని ఈ-రేస్ నిరూపించింది.
ఫార్ములా ఈ-రేస్‌తో రాష్ర్టానికి బహుళ ప్రయోజనాలు కలిగాయి. టోక్యో, షాంఘై, బెర్లిన్ , మొనాకో, లండన్ వంటి నగరాల సరసన హైదరాబాద్ చేరింది. టాప్ -25 నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచినట్టు అనేక సంస్థలు ప్రకటించాయి. ఈ-రేస్ తర్వాత నీల్సన్ స్పోర్ట్స్ అనాలసిస్ సంస్థ ‘తెలంగాణకు సుమారు రూ.700 కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరింది’ అని స్పష్టంచేసింది. ఆతిథ్య నగరంగా హైదరాబాద్ పరపతి పెరిగిందని తెలిపింది.
తొలి రేస్‌కు గ్రీన్కో సహా పలు సంస్థలు స్పాన్సర్ షిప్ ఇచ్చాయి. 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన రేస్ విషయంలో స్పాన్సర్ల సమస్య వచ్చింది. తాము నిర్వహించలేమని ఎఫ్ఐఏ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి గతేడాది జూన్ -జూలై మధ్య తేల్చిచెప్పారు. దీంతో నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కొత్త ప్రతిపాదన తెచ్చారు. 2024 ఫిబ్రవరి నాటికి తాము స్పాన్సర్లను తీసుకొస్తామని, అప్పటివరకు రేస్ నిర్వహణ కోసం హెచ్ఎండీఏ నుంచి దాదాపు రూ.55 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి హోదాలో ఆదేశాలు జారీ చేయగా, శాఖ కార్యదర్శి అర్వింద్ కుమార్ నిధులు విడుదల చేశారు. హెచ్ఎండీఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించి, ఈ నిధులను నిర్వహణ సంస్థ ఖాతాకు పంపింది.
రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్లు జరగడం కొత్తేమీ కాదు. తమిళనాడు ప్రభుత్వం ‘ఫార్ములా-4 నైట్ స్ట్రీట్ రేసింగ్’ నిర్వహించింది. రూ.30 కోట్లు ఖర్చు చేసింది. నొయిడాలో మోటో జీపీ రేసుకు యూపీ ప్రభుత్వం రూ.80 కోట్లు చెల్లించింది. ఒడిశా రూ.260 కోట్లు ఖర్చు చేసి 2023 హాకీ ప్రపంచ కప్ నిర్వహించింది. మహారాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్ల చొప్పున ఖర్చు చేసి హీరో ఇంటర్ కాంటినెంటల్ ఫుట్ బాల్ కప్- 2019, 2023ను ముంబై, భువనేశ్వర్‌లో, రూ.100 కోట్ల చొప్పున ఖర్చు చేసి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్-2020, 2022ను ముంబై, రాయ్‌పూర్‌లో నిర్వహించింది. అంతేకాదు.. ఫార్ములా ఈ-రేస్‌ను తమ రాష్ట్రంలో నిర్వహించాలని సాక్షాత్తూ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ రేసులో భాగంగా గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ కౌంట్ డౌన్లో ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాము కూడా పోటీ పడతామని ప్రకటించారు.
ప్రభత్వం రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టినట్టు నిపుణులు చెప్తున్నారు. వాస్తవానికి తాము రేస్ నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్ఐఏ గతేడాది చెప్పే సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది. అయినా ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులకు భరోసా కల్పించేందుకు కేటీఆర్ ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ నిధులు విడుదల చేసింది. ఆ నిధులతో ఈ ఏడాది ఫిబ్రవరిలో రేసు నిర్వహిస్తే అసలు ఈ కేసే ఉండేది కాదు. అలాకాకుండా రేసు రద్దు చేయడంతో నిర్వహణ సంస్థ రూ.55 కోట్లను వెనక్కి ఇవ్వలేదు. ఈ డబ్బులో రూపాయి కూడా కేటీఆర్‌కో, బీఆర్ఎస్కో వెళ్లలేదు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫార్ములా ఈ-రేస్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన రేసు ఆగిపోయింది. ఈ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని నిపుణులు చెప్తున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ ఈవెంట్లు నిర్వహించాల్సి వస్తే పేరు మోసిన బ్రాండ్లు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలకు వెనుకాడుతాయంటున్నారు. అంతర్జాతీయ సంస్థను కోర్టుకు ఈడ్చడం ద్వారా పెట్టుబడిదారుల్లో భయానక వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉన్నదని స్పష్టంచేస్తున్నారు.
ఈ రేసులు నగరంలో నిర్వహించి అంతర్జాతీయంగా హైదరాబాద్ బ్రాండ్‌ను పెంచాలని పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ తపన పడ్డారు. నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్‌తో కలిసి కసరత్తు చేసి, హైదరాబాద్‌కు ఉన్న అనుకూలతలను వివరించారు. పర్యావరణ పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, హైదరాబాద్ వరుసగా ఐదుసార్లు మోస్ట్ లివెబుల్ సిటీగా గుర్తింపు పొందడం, వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్-2022 గెలుచుకోవడం, హరితహారం ద్వారా 6.5 కోట్ల మొకలు నాటడం, తెలంగాణ వ్యాప్తంగా గ్రీన్ కవర్‌ను పెంచడం వంటివి వివరించారు. దీంతో హైదరాబాద్‌లో ఈ-రేస్ నిర్వాహణకు ఎఫ్ఐఏ ఒప్పుకొన్నది.