హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా డీలిమిటేషన్ జరిగితే, అది కేవలం రాజకీయ ప్రక్రియగానో, లేక చట్ట సవరణగానో మిగిలిపోదని, మొత్తం దక్షిణ భారతదేశం అంతటా బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, మూడేండ్ల్ల క్రితం తాము తీసుకున్న దృఢమైన స్టాండ్కే కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.
తామంతా గర్వించదగ్గ భారతీయులమని, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అత్యుత్తమ రాష్ట్రాల ప్రతినిధులమని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై బుధవారం ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. జనాభా నియంత్రణతోపాటు వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు, ఈ పునర్విభజన వల్ల రాజకీయంగా అన్యాయం జరుగడం సమంజసం కాదని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి, వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.
దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదికైన పార్లమెంటులో తమ ప్రజల స్వరాన్ని, ప్రాతినిధ్యాన్ని అణచివేయాలని చూస్తే తాము నిశ్శబ్దంగా చూస్తూ ఉండబోమని హెచ్చరించారు. దక్షిణాది భారతీయుల హకుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని, ఢిల్లీ పాలకులు తమ మాట వినాలని, బుద్ధి ప్రబలాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.