నర్సంపేట, మే 5 : ఆర్టీసీ అమరుడు కోల శంకర్‌గౌడ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ గత నెల 23న వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో ఆత్మబలిదానం చేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం నర్సంపేటలోని ముత్తోజిపేటకు శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రు లు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, పార్టీ రాష్ట్ర నేత రాకేశ్‌రెడ్డితో కలిసి చేరుకున్న కేటీఆర్, తొలుత శంకర్‌గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
శంకర్‌గౌడ్ భార్య హేమలత, కుమారుడు హేమంత్, కుమార్తె షామిలి, అల్లు డు సుమన్‌ను ఓదార్చారు. అనంతరం హేమలతకు రూ.5లక్షల చెక్కు అందించారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆర్టీసీని విలీనం చేస్తామని, పీఆర్సీ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మాట తప్పడం వల్లే శంకర్‌గౌడ్ లాంటి కార్మికులు బలికావాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ హయాంలోనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తిస్తూ మాజీ సీఎం కేసీఆర్ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదని గుర్తుచేశారు. ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ ఆగిపోయిందని పేర్కొన్నారు. తాను శంకర్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నానని తెలిసి ఇన్ని రోజుల తర్వాత ప్రభుత్వం రూ.10 లక్షల చెక్కు ఇచ్చిందంటే వారి వైఫల్యం అర్థమవుతుందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని, న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.