హైదరాబాద్, జూలై 25(నమస్తే తెలంగాణ): రాజకీయ నాయకులు లేదా అధికారంలో ఉన్నవారి కంటే ప్రజాశక్తి, ముఖ్యంగా యువశక్తే అత్యంత శక్తివంతమైనదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా వేదికగా శనివారం కేటీఆర్ స్పందిస్తూ.. ‘అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తే ఎల్లప్పుడూ గొప్పది’ అని వ్యాఖ్యానించారు. దీనికి జెన్ జీ(నేటి తరం యువత) అని హ్యాష్‌ట్యాగ్ జతచేశారు.
తాజా సామాజిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశ యువత సాధిస్తున్న విజయాలు, చూపుతున్న చైతన్యాన్ని ఉద్దేశిస్తూ కేటీఆర్ చేసిన కామెంట్.. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రజాస్వామ్యంలో ఎంతటి శక్తివంతమైన నాయకులైనా లేదా ప్రభుత్వాలైనా ప్రజల ఆకాంక్షలకు, వారి నిర్ణయానికి లొంగాల్సిందేనని, ప్రజాశక్తి ముందు ఏ అధికారమూ నిలబడలేదని కేటీఆర్ ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టంచేశారు. కేటీఆర్ ట్వీట్‌కు నెటిజన్లు, ముఖ్యంగా యువత నుంచి విశేష స్పందన వస్తున్నది. ప్రజాస్వామ్యానికి అసలైన బలం ప్రజలే.. అని పేరొంటూ నెటిజన్లు ఈ పోస్ట్‌ను రీ ట్వీట్లతోపాటు కామెంట్లు పెడుతున్నారు.