హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ ప్రమాదంపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓవైపు సహాయ చర్యలను మరింత వేగవంతంగా కొనసాగిస్తూనే, జరిగిన ప్రమాదంపై విచారణ చేపట్టి, , బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళవారం తెలంగాణభవన్‌లో జాతీయ మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రాజెక్టుల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. తాజా సొరంగ ప్రమాదం వల్ల ప్రభుత్వానికి రూ.వందల కోట్ల ఆర్థిక నష్టం జరిగిందని విమర్శించారు.
ఇంతకుముందు సుంకిశాల, పెద్దవాగు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేయలేదని, బాధ్యులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. ఈ ప్రమాదాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి సహా, అనేక అంశాలపై న్యాయ కమిషన్ల ఏర్పాటు కోసం డిమాండ్ చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక న్యాయ కమిషన్లు ఏర్పాటు చేశారని చెప్పారు. ‘తాజా ప్రమాదాలపై న్యాయ విచారణ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నం. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆర్మీ, ఇతర సంస్థల సహాయంతో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చికుకున్న వారిని వెంటనే వెనకి తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం మరింత కృషి చేయాలి’ అని కేటీఆర్ కోరారు.
వ్యవసాయ ఎమర్జెన్సీని ప్రకటించాలి
రాష్ట్రంలో వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎండుతున్న పంటలను కాపాడుకోలేక రైతులు దిక్కుతోచనిస్థితిలోకి వెళ్లి చివరికి ఆత్మహత్య చేసుకుంటున్నారని ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తంచేశారు. వ్యవసాయ రంగంలో మోగుతున్న మరణమృదంగానికి రేవంత్‌రెడ్డి చేతగాని పాలనే ప్రధాన కారణమని దుయ్యబట్టారు. రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు. ప్రభుత్వం ధైర్యం చెప్పాల్సింది పోయి కరువుగా చిత్రీకరించే కుట్రలు చేస్తున్నందువల్లే రైతులు దిగులు చెందుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి తన అసమర్థతను ఒప్పుకొని ఇప్పటిదాకా జరిగిన రైతుల ఆత్మహత్యలకు పూర్తి బాధ్యత వహించాలని, బాధిత రైతు కుటుంబాలకు స్పెషల్ ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పదేండ్లు పండుగలా సాగిన వ్యవసాయాన్ని 14 నెలల్లోనే పాతాళానికి నెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్న ముఖ్యమంత్రి తన వైఫల్యంపై క్షమాపణలు చెప్పి ముకు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలపై రాహుల్ గాంధీ స్పందించాలన్నారు. రాజకీయ ప్రతీకారాల కోసం రైతులను బలిచేస్తూ ముఖ్యమంత్రి క్షమించరాని పాపం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.