హైదరాబాద్ జూన్1 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూకే పర్యటన జయప్రదమైంది. ఐదురోజుల పాటు ఇంగ్లండ్‌లో పర్యటించిన ఆయన పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన విప్లవాత్మక విజయాలను వివరించారు. అధికారం లేకున్నా విదేశీగడ్డపై తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్తూ ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని, అందులో తెలంగాణను బెస్ట్ చాయిస్‌గా ఎంచుకోవాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఆదివారం డాలస్‌కు పయనమయ్యారు. అక్కడ సోమవారం నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ రజతోత్సవాల్లో పాల్గొననున్నారు.
లండన్‌లోని తెలంగాణ ప్రవాసులు, బీఆర్ఎస్ యూకే విభాగం నాయకులు, కార్యకర్తలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఐదురోజుల పాటు ఇంగ్లండ్‌లో కేటీఆర్ అనేక ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో సాధించిన ప్రగతిని గణాంకాలతో వివరించారు. బీఆర్ఎస్ ఎన్నారైలతో మమేకమయ్యారు. వారి సాధకబాధకాలను తెలుసుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో వారి కీలకపాత్రను గుర్తుచేస్తూ అప్పటి అనుభూతులను పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తిరోగమన విధానాలను ఎండగట్టాలని సూచించారు.
మే 27న యూకేలో అడుగుపెట్టిన కేటీఆర్‌ను వివిధ రంగాల ఎన్నారై ప్రముఖులు కలిశారు. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం సాగుతున్న పోరాటానికి అడుగడుగునా అండగా ఉంటామని ప్రకటించారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా గుండె సంబంధ ఆపరేషన్ తర్వాత కోలుకుంటున్న బీఆర్ఎస్ ఎన్నారై నేత, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కుర్మాచలం ఇంటికి వెళ్లి, ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటానని భరోసానిచ్చారు.
28న బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కార్యవర్గ సభ్యులు, సీనియర్ నేతలతో లండన్‌లో కేటీఆర్ సమావేశమయ్యారు. పార్టీ పటిష్టతకు చేస్తున్న కృషిని అభినందించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారని ప్రశంసించారు. అక్కడి నేతల విజ్ఞప్తి మేరకు లండన్‌లో రజతోత్సవాలను నిర్వహించేందుకు సుముఖత వ్యక్తంచేశారు. అనంతరం యూకే తెలుగు బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.
మే 30న బ్రిడ్జ్ ఇండియా వీక్-25 సదస్సులో కేటీఆర్ చేసిన కీలకోపన్యాసం దేశవిదేశాల ప్రతినిధులను ఆకట్టుకున్నది. సుస్థిరమైన ఆర్థికాభివృద్ధితో ప్రపంచానికి తెలంగాణ దిక్సూచిగా నిలిచిన తీరును తనదైన శైలిలో వివరించారు. సంపద సృష్టించి పేదలకు పంచేవిషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలను క్లుప్తంగా తెలియజెప్పారు. అనంతరం వార్విక్ యూనివర్సిటీలో మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ లాంటి దిగ్గజ సంస్థలకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సేవలు అందించే పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్‌ను ప్రారంభించారు. ప్రతిష్ఠాత్మక కంపెనీల్లో తెలంగాణ బిడ్డలు సేవలందించడం మనందరికీ గర్వకారణమని ప్రశంసించారు.
బీఆర్ఎస్ సర్కారు అనుసరించిన అత్యుత్తమ పాలసీలతో పుణె, చెన్నయ్ తర్వాత హైదరాబాద్ ఆటోమోటివ్ హబ్‌గా మారిన తీరును వివరించారు. పెట్టుబడులు వెల్లువెత్తి తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు లభించాలని ఆకాంక్షించారు. యూకే పర్యటన విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. లండన్‌లో కార్యక్రమాలను ముగించుకున్న కేటీఆర్ అక్కడి నుంచి అమెరికాలోని డాలస్‌లో పార్టీ సోమవారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) నిర్వహించనున్న రజతోత్సవ సంబురాల సభకు బయల్దేరి వెళ్లారు.