హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): లగచర్ల కుట్ర కేసులో అరస్టై చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డితో శనివారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ములాఖత్ కానున్నారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మాజీ మంత్రులు వీ శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి కూడా పాల్గొననున్నారు.
పోలీస్ పహారాలో ఫోర్త్‌సిటీ భూసర్వే ; రైతుల అభ్యంతరాలు బేఖాతరు
కందుకూరు, నవంబర్ 22: రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫోర్త్‌సిటీ కోసం పోలీస్ పహారా నడుమ భూసర్వే కొనసాగుతున్నది. రైతులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నా రెవెన్యూ అధికారులు పెడచెవిన పెడుతున్నారు. కొంగర కలాన్ ఓఆర్ఆర్ నుంచి కందుకూరు మం డలం అగర్మియాగూడ, లేమూరు, తిమ్మాపూరు, రాచులూరు, గాజుల బుర్జుతండ, గుమ్మడవెల్లి, ఆకులమైలారం, మీర్ఖాస్పేట్ మీదుగా 330 అడుగుల వెడల్పుతో రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయా గ్రామాల రైతుల భూములు పోతున్నాయి. బాధిత రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పోలీస్ బలగాలతో వచ్చి అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నా వారు పట్టించుకోవడం లేదు.