హైదరాబాద్ / కోయంబత్తూరు: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) మరో జాతీయ స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అక్టోబర్ 11న కోయంబత్తూరులోని కుమారగురు ఇన్స్టిట్యూషన్స్లో జరగనున్న 10వ ఎఫ్ఎంఏఈ (FMAE – Fraternity of Mechanical and Automotive Engineers) నేషనల్ స్టూడెంట్ మోటార్‌స్పోర్ట్స్ కాంపిటీషన్ 2025 ప్రారంభోత్సవానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.
ఫ్రాటర్నిటీ ఆఫ్ మెకానికల్ అండ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ (FMAE) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీలో దేశవ్యాప్తంగా 101 కాలేజీల నుంచి 70కి పైగా విద్యార్థి బృందాలు, మొత్తం 1300 మందికి పైగా యువ ఇంజనీర్లు పాల్గొననున్నారు. విద్యార్థులు తమ స్వయంగా రూపొందించిన వాహనాలు, వినూత్న ఆవిష్కరణలను ఈ వేదికపై ప్రదర్శిస్తారు. ఈ ప్రాజెక్టులను అంతర్జాతీయ స్థాయిలోని అగ్రగామి ఆటోమోటివ్ కంపెనీలకు చెందిన 25 మంది నిపుణుల జ్యూరీ సభ్యులు మూల్యాంకనం చేయనున్నారు.
కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో ఎఫ్ఎంఏఈ సంస్థ… ఆయన నాయకత్వాన్ని, మోటార్‌స్పోర్ట్స్ పట్ల ఆయనకున్న నిబద్ధతను ప్రత్యేకంగా ప్రశంసించింది. ముఖ్యంగా హైదరాబాద్‌కు ఫార్ములా-ఈ (Formula E) రేసింగ్‌ను తీసుకురావడం ద్వారా తెలంగాణను గ్లోబల్ మోటార్‌స్పోర్ట్ మ్యాప్‌పై నిలబెట్టడంలో కేటీఆర్ పోషించిన పాత్ర అభినందనీయమని కొనియాడింది. సుస్థిరమైన మొబిలిటీ, అడ్వాన్స్డ్ మానుఫ్యాక్చరింగ్ (తయారీ), మరియు ఆవిష్కరణల వ్యవస్థను (ఇన్నోవేషన్ ఎకోసిస్టం) ప్రోత్సహించడంలో ఆయన చూపిన చొరవ దేశవ్యాప్తంగా వేలాది మంది యువ ఇంజనీర్లకు స్ఫూర్తిని ఇచ్చిందని ఎఫ్ఎంఏఈ పేర్కొంది.
ఈ పోటీ భారత దేశంలోని అత్యున్నత విద్యార్థి-కేంద్రీకృత ఇంజనీరింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఇది పరిశ్రమ, విద్యా రంగాల మధ్య అంతరాన్ని తగ్గించడంతో పాటు, భవిష్యత్తు ఆటోమోటివ్ టెక్నాలజీలకు భారతదేశాన్ని ఒక కేంద్రంగా నిలబెట్టే లక్ష్యంతో కృషి చేస్తోంది.