KTR | మేడ్చల్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించే ధైర్యం గులాబీ జెండాకే ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. తల ఊపే బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ఆగం అవుతుందని హెచ్చరించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల సన్నాహాక సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడుతూ.. ఢిల్లీలో తెలంగాణ గురించి మాట్లాడే వారు ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలకు నోరుపెగలదని, ఢిల్లీ, గుజరాత్ బాస్‌లకు చెప్పినదానికే తల ఊపుతారని ఎద్దేవా చేశారు. డూడూ బసవన్నల్లాంటి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను కాకుండా తెలంగాణ ప్రజల హక్కుల కోసం ధైర్యంగా కొట్లాడే బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. తెలంగాణకు రావాల్సిన హక్కులు పొందేందుకు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలిపించుకునేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మోదీ రూపాయి ఇవ్వకున్నా కేసీఆర్ అభివృద్ధి చేయలేదా?
పదేండ్లలో కేంద్రం నుంచి ప్రధాని మొదీ ఒక్క రూపాయి ఇవ్వకున్నా తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ అభివృద్ధి చేయలేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. కేసీఆర్ హయాంలో 29 వేల లీటర్ల మంచినీటిని ఉచితంగా అందిస్తే, ఇప్పుడు మంచినీటికి చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు పరిచేలా ఒత్తిడి తేవాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక స్థానాల్లో గెలిపించాలని కోరారు. హామీల అమలుపై కాంగ్రెస్ చేతులు ఎత్తేస్తున్న పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు ప్రజలు తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ప్రజల తరపున పోరాడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం యాభై రోజుల్లోనే ప్రజలకు విసుగు తెప్పిస్తున్నదని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, హెల్త్‌సిటీ ఛైర్మన్ చామకూర భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మమత వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా
కాంగ్రెస్‌కు దమ్ముంటే వారణాసిలో పోటీచేసి గెలవాలని, ఆ పార్టీ 40 స్థానాలను కూడా ఈసారి నిలబెట్టుకునే అవకాశం లేదంటూ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. బీజేపీని ఆపగలిగే శక్తి బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉన్నదని పేర్కొన్నారు.
కేసీఆర్, మమతాబెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్ వంటి బలమైన నాయకులే బీజేపీని అడ్డుకోగలరని, కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం కాదని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. బీజేపీకి కాంగ్రెస్ ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని కాంగ్రెస్ వ్యవహారశైలి వల్లనే ఇండియా కూటమి చెల్లాచెదురు అవుతున్నదని, ఆ పార్టీ ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు చెప్పారు.
గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ర్టాల్లో బీజేపీతో నేరుగా పోటీపడాల్సివున్న కాంగ్రెస్, ఆ రాష్ర్టాలను వదిలిపెట్టి ఇంతర రాష్ర్టాల్లో, ఇతర పార్టీలతో పోటీ పడుతున్నదని ఎద్దేవా చేశారు. దీనివల్ల బీజేపీకి లాభం చేకూరుతున్నదని, ఇండియా కూటమిలోని పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు.