హైదరాబాద్ : 25 వసంతాల గులాబీ జాతరకు ఊరువాడా సిద్ధమైంది. పోరాటాల గడ్డ ఓరుగల్లుకు తెలంగాణ నుంచి నలుదిక్కులా జనం తమ ఇంటి పండుగలా భావించి వెల్లువలా కదిలివస్తున్నారు. కాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఉదయం 9 గంటలకు పార్టీ జెండా ఎగరవేయనున్నారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అలాగే పార్టీ ఏర్పాటైన జలదృశ్యం వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పిస్తారు.
మరోవైపు కేసీఆర్‌పై గౌరవం, ఇంటిపార్టీపై అభిమానంతో రైతులు, సాధారణ ప్రజలు ఎందరో ఎల్కతుర్తిలో జరగనున్న సభకు ముందుగానే బయలుదేరారు. సూర్యాపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఎండ్లబండ్లపై ఎల్కతుర్తికి వెళ్తున్నారు. సిద్దిపేటకు చెందిన యువకులు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఎందరో పార్టీ అభిమానులు సై కిల్ యాత్రగా వెళ్లారు.
సిరిసిల్ల, గజ్వేల్, బాల్కొండ, నిర్మల్ తదితర నియోజవర్గాల నుంచి ప్రత్యేక వాహనాల్లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక కంట్రోల్ కమాండ్ సెంటర్లో హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే 9014206465 నంబర్‌కు ఫోన్ చేయాలని పార్టీ బాధ్యులు సూచించారు.