KTR | నాంపల్లి కోర్టులు, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు వాంగ్మూలాన్ని శుక్రవారం ప్రజాప్రతినిధుల కోర్టు నమోదు చేయనుంది.
మేజిస్ట్రేట్ శ్రీదేవి జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ కేసులో సాక్షులుగా ఉన్న తుల ఉమ, బాల్కసుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్కుమార్ల వాంగ్మూలాలను సైతం కోర్టు నమోదు చేయనుంది. సెక్షన్ 356 బీఎన్ఎస్ ప్రకారం కేటీఆర్ వాంగ్మూలం కీలకంగా మారనుంది.
ఇటీవల గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ సినీ నటి సమంత విడాకులపై నిరాధార ఆరోపణలు చేసిన వీడియో క్లిప్పింగ్లు, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు, పత్రికల్లో వచ్చిన వార్తలను నిక్షిప్తం చేసిన పెన్డ్రైవ్ను, ఫొటోలను సాక్ష్యాధారాలుగా కోర్టుకు సమర్పించారు.