మహబూబ్‌నగర్ : సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రూ.2 వేలు ఉన్న పెన్షన్‌ను రూ.4 వేలు చేస్తనని మాటతప్పిండని, ముసలోళ్ల నోట్లె మన్నుగొట్టిండని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ సర్పంచ్‌లతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే.. ‘కేసీఆర్ నెలకు రూ.2 వేల పెన్షన్ ఇచ్చేది. కానీ రేవంత్‌రెడ్డి ఏమన్నడు..? కేసీఆర్ రూ.2 వేలే ఇస్తున్నడు.. నేను గెలిస్తే రూ.4 వేలు ఇస్త అన్నడు. కేసీఆర్ ఇంట్లె ఇద్దరు ముసలోళ్లు ఉంటే ఒక్కరికే పెన్షన్ ఇస్తున్నడు.. నేను గెలిస్తే ఇద్దరు ముసలోళ్లకు పెన్షన్ ఇస్త అన్నడు. నూరు రోజుల్లో ఈ పెన్షన్ల పెంపు అమలు చేస్త అన్నడు. ఇచ్చిండా మరి..? 25 నెలలు పోయినయ్. నూరు రోజులు గంగలో కలిసినయ్. రూ.4 వేల పెన్షన్ లేదు.. రూ.2 వేలే దిక్కయినయ్. ఆ రూ.2 వేలు కూడా రెండుసార్లు ఎగ్గొంటిండు. ముసలోళ్ల నోట్లె మన్నుగొట్టిండు’ అని విమర్శించారు.
‘రేవంత్ రెడ్డి రైతులను కూడా ముంచిండు. ఆయన ఎప్పుడూ ఓ మాట అంటుంటడు. అదేందంటే ‘పండబెట్టి తొక్కుతా’ అని. అన్నట్టే చేసిండు. వ్యవసాయాన్ని పండబెట్టిండు, రైతాంగాన్ని తొక్కిండు. ఇగ రైతుబంధు సంగతికి వస్తే.. కేసీఆర్ రెండు పంటలకే ఇస్తున్నడు, నేను గెలిస్తే మూడు పంటలకు ఇస్త అన్నడు. కేసీఆర్ హయాంలో నాట్లేసేటప్పుడే రైతుబంధు పడేది. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు 11 సార్లు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు జమచేసిన నాయకుడు కేసీఆర్. కానీ ఈ మొనగాడు రెండు పంటలకే రైతుబంధు ఇస్తరా.. మూడో పంటకు ఇయ్యరా..? అన్నడు. ఎకరానికి రూ.10 వేలేనా.. రూ.15 వేలు ఇవ్వరా..? అన్నడు. మా సోనియమ్మ మీద ఒట్టు నేను రూ.15 వేలు ఇస్త అన్నడు. మరి సోనియమ్మ మీద ఒట్టేసిండు గదా.. ఇస్తున్నడా రూ.15 వేలు. వచ్చినయా..?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
‘రైతుబంధు రైతులకే ఇస్తరా.. కౌలు రైతులకు ఇయ్యరా..? అన్నడు. నేను గెలిస్తే కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇస్త అన్నడు. ఇస్తుండా..? రైతు కూలీలకు నెలకు రూ.1000 ఇస్త అన్నడు. రాహుల్‌గాంధీ మీద ఒట్టన్నడు. ఇస్తున్నడా..? కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పేర్లతో ఆడబిడ్డలకు రూ.లక్ష చొప్పున ఇచ్చి 15 లక్షల మందికి పెండ్లిళ్లు చేసిండు. కానీ రేవంత్‌రెడ్డి నేను రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్త అన్నడు. కేసీఆర్ పెండ్లయినంక ఆర్నెళ్లకు కల్యాణలక్ష్మి ఇస్తున్నడు. నేను పెండ్లి పత్రిక పెట్టిన వెంటనే ఇస్త అన్నడు. ఇస్తున్నడా..?’ అని నిలదీశారు.