హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తేతెలంగాణ)/ హనుమకొండ : ‘అన్నా’ అని పిలిస్తే.. ‘నేనున్నా’ నంటూ ఆపదలో ఉన్నవారికి భరోసానిచ్చే కల్వకుంట్ల తారక రామారావు మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. లక్ష్మీకటాక్షం లేని సరస్వతీ పుత్రుడికి అండగా నిలిచారు. మెడికల్ సీటు సాధించి చదువుకొనేందుకు ఆర్థిక స్థోమతలేక ఇబ్బందులు పడుతున్న ఓ అనాథ విద్యార్థికి ఆర్థిక భరోసానిచ్చారు. ‘ఎక్స్’లో చేసిన విజ్ఞప్తికి స్పందించి గణేశ్ ఎంబీబీఎస్ పూర్తిచేసేందుకు అయ్యే ఖర్చులు భరించేందుకు ముందుకొచ్చారు. తక్షణమే రూ.1.50 లక్షలు అందించి సోమవారం మెడికల్ కాలేజీలో అడ్మిషన్ ఇప్పించి ఔదార్యాన్ని చాటుకున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన ఆర్ముళ్ల గణేశ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను, తోబుట్టువును కోల్పోయాడు. అమ్మమ్మ ఇంటిలోనే పెరిగాడు. తనను పెంచి పెద్దచేసేందుకు అమ్మమ్మ పడ్డ కష్టాలను స్వయంగా చూశాడు. ఈ బాధలు, పేదరికం దూరం కావాలంటే ఉన్నత చదువే ఉత్తమ మార్గమని సంకల్పించాడు. ఓ వైపు అమ్మానాన్నలు దూరమైన మనోవేదన.. మరోవైపు కడు పేదరికం వెంటాడుతున్నా మొక్కవోని పట్టుదలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకున్నాడు. రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టి నీట్లో మెరుగైన ర్యాంకుతో ప్రతిమ రిలీఫ్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించాడు. అయితే ఈ నెల 6లోగా ట్యూషన్ ఫీజు, డిపాజిట్ కింద రూ. 1.50 లక్షలు చెల్లించాలి. కానీ చేతిలో చిల్లిగవ్వలేని దయనీయ పరిస్థితిలో చిక్కుకున్నాడు..
గడువులోగా ట్యూషన్ ఫీజు చెల్లించకుంటే సీటు కోల్పోయి వైద్యుడు కావాలనుకొనే గణేశ్ కల కల్లలయ్యే ప్రమాదం ఉన్నదని తెలుసుకున్న కొందరు సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు సాయం చేయాలని ఎక్స్ వేదిక ద్వారా కేటీఆర్‌ను అభ్యర్థించారు. వెంటనే స్పందించిన కేటీఆర్, వివరాలు తెలుసుకొని చలించిపోయారు. గణేశ్ ఎంబీబీఎస్ చదువు పూర్తి బాధ్యతను బీఆర్ఎస్ తరఫున తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం గణేశ్, అతడి మేనమామ దేవదాసును కలిశారు. తక్షణ సాయంగా రూ. 1.50 లక్షల చెక్కును అందజేశారు. నేరుగా ప్రతిమ రిలీఫ్ మెడికల్ కాలేజీకి వెళ్లి గణేశ్ అడ్మిషన్ ప్రక్రియ పూర్తిచేశారు. భవిష్యత్తులో గణేశ్ చదువుకు పూర్తి ఖర్చులను పార్టీ తరఫున కేటీఆర్ అందిస్తారని వినయ్ భాస్కర్ హామీ ఇచ్చారు. ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో బీఆర్ఎస్ యువనేత కేటీఆర్.. కష్టాల్లో ఉన్న పేదలకు అండగా నిలుస్తున్నారని వివరించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో పేద, మధ్య తరగతి వారికి విద్య, వైద్యం అందించేందుకు ఎంతగానో తపించారని గుర్తుచేశారు.
‘విద్యపై అవగాహన ఉన్న కేటీఆర్ ప్రతి ఒక్కరి సమస్యలపై స్పందిస్తారన్న నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం తోనే ఎక్స్‌లో ట్యాగ్ చేశా.. వెంటనే స్పందించి ధైర్యం ఇచ్చిన కేటీఆర్‌కు రుణపడి ఉంటా’ నని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆర్ముళ్ల గణేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ‘కేటీఆర్ ట్వీట్‌ను చూసి నేను ఆశ్చర్యపోయా.. నా చదువు పూర్తి బాధ్యత తీసుకుంటాననడంపై ఏం మాట్లాడాలో మాటలు రావడం లేదు. నన్ను ప్రోత్సహిస్తున్నందుకు కేటీఆర్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దాస్యం వినయ్‌భాస్కర్ చేతుల మీదుగా ఆర్థిక సాయం అందుకోవడం చాలా సంతోషంగా ఉన్నది’ అని భవోద్వేగానికి లోనయ్యారు. ‘ఆపద అని వస్తే కాపాడే ధైర్యం, కష్టం అని తెలిస్తే తీర్చే మంచితనం కేటీఆర్ అన్న సొంతం’ అని కొనియాడారు. గణేశ్ వెంట వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, మనోజ్, పోలపల్లి రామ్మూర్తి, కుటుంబ సభ్యులు ఉన్నారు.
కాంగ్రెస్ పాలనలో నగరం అస్తవ్యస్తంగా తయారైందని కేటీఆర్ విమర్శించారు. ఫ్యూచర్‌సిటీ పేరిట గొప్ప రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు నిర్మాణానికి బయల్దేరేముందు ప్రస్తుతం ఉన్న మహానగరాన్ని పట్టించుకోకపోవడం విడ్డూరమని సోమవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ధ్వంజమైన రోడ్లు, భయంకరమైన దోమల బెడద, పారిశుధ్య లోపంపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను ట్వీట్‌కు ట్యాగ్ చేసి సర్కారు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి పరిస్థితులను చక్కదిద్దాలని డిమాండ్ చేశారు.