KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ‘రేవంత్‌రెడ్డీ.. నువ్వేమైనా చక్రవర్తివా? నియంతవా? వెయ్యేండ్లు ఏమైనా బతకాడానికొచ్చినవా? సొంత ఊరు.. సొంత నియోజకవర్గమైతే ఆడిందే ఆట.. పాడిందే పాట అనుకుంటే కుదరదు.. రేవంత్లాంటోళ్లు చాలా మంది కొట్టుకుపోయిండ్రు.. రేవంత్‌రెడ్డి కూడా కొట్టుకుపోతరు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. శిశుపాలుడి తప్పులను లెక్కించినట్టు రేవంత్‌రెడ్డి పాపాలను ప్రజలు లెక్కిస్తున్నారని, రేవంత్‌కు రాజకీయ భవిష్యత్తు లేకుండా తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డి కక్ష పూరిత వైఖరి కారణంగా చేయని తప్పునకు చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. చర్లపల్లి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పట్నం నరేందర్‌రెడ్డితో కేటీఆర్ శనివారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, గిరిజన, బలహీనవర్గాల రైతుల తరపున పోరాటం చేసిన పాపానికి నరేందర్‌రెడ్డిని ఈ ప్రభుత్వం జైల్లో వేసిందని మండిపడ్డారు. ఆయన జైల్లో శిక్ష అనుభవిస్తున్నా.. ఆయన తన ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడని కేటీఆర్ చెప్పారు. ‘అన్నా నా గురించి ఆలోచించొద్దు
నేను ఎలా ఉన్నా పర్లేదు. చేయని తప్పునకు 30 మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టారు. వాళ్లను విడిపించండి. వాళ్లకోసం పోరాటం చేయండి. మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి. కొడంగల్ గిరిజనుల పక్షాన కొట్లాడండి. అక్కర్లేని ఫార్మా విలేజీని మా కొడంగల్ ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం రుద్దుతున్నది అని నాతో చెప్పి బాధపడ్డడు’ అని కేటీఆర్ వివరించారు. జైల్లో ఉన్నా నరేందర్‌రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారని.. మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ చేపట్టనున్న ధర్నాను విజయవంతంగా చేయాలని తమకు ఉత్సాహాన్నిచ్చారని కేటీఆర్ వివరించారు.
కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి వరకు అరాచకాలు చేస్తున్న దుర్మార్గులు గద్దెనెక్కి కూర్చున్నరు. అధికారం ఉన్నది కదా అని విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తూ సాయిరెడ్డి, గురువారెడ్డి లాంటి వ్యక్తుల ఆత్మహత్యలకు కారణమైండ్రు. వారి అరాచకాలు, పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉన్నది.
-కేటీఆర్
‘సంగారెడ్డి జైలు నుంచి మొదలుపెడితే చర్లపల్లి జైలు వరకు అమాయకులు జైల్లో ఉంటే కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి వరకు అరాచకాలు చేస్తున్న దుర్మార్గులు గద్దెనెక్కి కూర్చున్నారు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కొడంగల్‌లో పేద రైతులపై బందిపోట్ల మాదిరిగా మీదపడి వారి భూములను కాంగ్రెస్ నాయకులు గుంజుకుంటున్నారని ధ్వజమెత్తారు. తమ భూములు ఇచ్చేదిలేదని రైతులు చెప్తే అర్ధరాత్రి చిన్న పిల్లలు, ముసలివాళ్లు, ఆడవాళ్లని కూడా చూడకుండా రేవంత్‌రెడ్డి సర్కార్ అరాచకం సాగించిందని విమర్శించారు. ‘కొండారెడ్డిపల్లి రేవంత్‌రెడ్డి సొంత ఊరు. అక్కడ ఓ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి. ఆయనకు 85 ఏండ్లు. ఇదే రేవంత్‌రెడ్డి కోసం ఎన్నికల్లో పనిచేసిండు. ఓట్లు వేయించిండు. అట్లాంటి పెద్దాయన మీద కూడ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడ కట్టి తొవ్వలేకుండా చేస్తే ఆ క్షోభ భరించలేక సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.. నియంతల పాలన, దుర్మార్గుల పాలనలోనే ఇలాంటి ఆంక్షలు, వేధింపులు ఉంటయి’ అని మండిపడ్డారు. ‘మేము కూడా పదేండ్లు ప్రభుత్వంలో ఉన్నం.. ఇలాంటి వార్తలు ఎప్పుడైనా విన్నారా? ఇండ్లకు అడ్డంగా గోడలు కట్టే సంఘటనలు జరిగినయా?’ అని ప్రశ్నించారు.
‘జైల్లో మగ్గుతున్న రైతులు, వారి కుటుంబాలు భయపడాల్సిన అవసరం లేదు.. మీ వెనకాల కేసీఆర్ ఉంటారు’ అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. రైతులకు తప్పక న్యాయం జరుగుతుందని, న్యాయస్థానంలో న్యాయమే గెలుస్తుందని చెప్పారు. ‘నాలుగు రోజులు రేవంత్‌రెడ్డి జైల్లో పెడ్తాడేమోగాని భవిష్యత్తులో రేవంత్‌రెడ్డికి రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది’ అని సూచించారు. ములాఖత్‌లో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ హలీ, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే లక్ష్మణ్‌రెడ్డి ఉన్నారు.
పేద, గిరిజన, బలహీనవర్గాల రైతుల తరపున పోరాటం చేసిన పాపానికి నరేందర్‌రెడ్డిని ఈ ప్రభుత్వం జైల్లో వేసింది. జైల్లో శిక్ష అనుభవిస్తున్నా తన ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడు. చేయని తప్పునకు 30 మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టారు. వాళ్లను విడిపించండి.. వాళ్లకోసం పోరాటం చేయండని నరేందర్‌రెడ్డి కోరుకున్నడు. పట్నం నరేందర్‌రెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు.
-కేటీఆర్