KTR | కేఆర్ఎంబీ ఆదేశాలు తెలంగాణకు గొడ్డలిపెట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని కేఆర్ఎంబీ ఆదేశాలు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు.
ఎల్నినో పేరు చెప్పి తెలంగాణ ప్రయోజనాలను కేఆర్ఎంబీ దెబ్బతీస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. ఏ నిబంధనల ప్రకారం, ఏ హక్కుల ప్రకారం వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తున్నారని ప్రశ్నించారు. కేఆర్ఎంబీకి ఏపీ నీటి దోపిడీ కానరావడం లేదా అని నిలదీశారు. అక్కడ ఏపీ దర్జాగా వెలిగొండకు సాగునీరు తరలిస్తుంటే, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు మూసుకుని సహకరిస్తున్నదని తెలిపారు. అక్కడ ఏపీ ప్రభుత్వం ఆంధ్రా ప్రయోజనాల కోసం పనిచేస్తుంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను, ప్రజలను గాలికి వదిలేసిందని విమర్శించారు.
విభజన చట్టంలోని 11వ షెడ్యూలు ఒక్క తెలంగాణకు మాత్రమే వర్తిస్తుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. అసమర్ధ పాలనతో రేవంత్ రెడ్డి శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లను ఏపీకి దారాధత్తం చేశాడని అన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు, కల్వకుర్తి ఎత్తిపోతల, జూరాల, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాల కింద రైతుల పొలాలను ఎండబెడుతున్నాడని అన్నారు. ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తే రైతులు బోర్ల కింద చేస్తున్న సాగుకు కరంటు అందే పరిస్థితి ఉండదని తెలిపారు. ఆగస్టు 21న శ్రీశైలం రిజర్వాయర్ లో 169 టీఎంసీలు ఉన్నాయి. నేడు 139 టీఎంసీలకు పడిపోయాయని అన్నారు. 15 రోజుల్లో 30 టీఎంసీలు మాయమయ్యాయన్నారు. కేఎల్ఐ ద్వారా అన్ని మోటార్లు నడిస్తే రోజుకు ఎత్తివేసేది 2400 క్యూసెక్కులు మాత్రమేనని చెప్పారు. అక్కడ ఇప్పుడు నడిచేది కేవలం మూడు మోటార్లు మాత్రమే అని అన్నారు.
కృష్ణా జలాలను ఏపీ యథేచ్ఛగా తరలిస్తున్నా కాంగ్రెస్ సర్కారులో చలనం శూన్యమని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు చేతగానితనమే ఈ దుస్థితికి కారణమని మండిపడ్డారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని.. ఈ అసమర్థ ప్రభుత్వానికి బుద్దిచెబుతామని స్పష్టం చేశారు.