రాబందు రాజ్యంలో అన్నీ బంద్.. కాంగ్రెస్ సర్కార్‌పై గర్జించిన రామన్న.. కదంతొక్కిన రైతన్న
కాంగ్రెస్ మూడేండ్ల పాలనలో రాష్ట్రంలో నీళ్లు బంద్, కరెంట్ బంద్, పరిశ్రమలు బంద్, చివరికి వ్యవసాయం కూడా బంద్ అయ్యే పరిస్థితి దాపురించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
- దివానాగాళ్లకు ఓట్లేస్తే దివాలాతీసే రోజులొచ్చినయ్
- ఆదిలాబాద్ రైతు గర్జనలో నిప్పులు చెరిగిన కేటీఆర్
- కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరంపై రేవంత్ కుట్రలు
- నీళ్లెత్తకుండా రైతుల పొలాలను పడావు పెట్టిండు
- రైతు డిక్లరేషనని.. సెల్ఫ్ డిక్లరేషన్ అడుగుతున్నడు
- ఎవుసం బంద్ పెట్టాలని ఫర్మానా జారీ చేసిండు
- రైతుబంధు ఆపి.. ‘రాహుల్ బంధు’ కడుతున్నడు
- మంచి చేసినోళ్లను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకోవాలె
- దగా చేసినోళ్లను వంద ఫీట్ల బొందతోడి పాతిపెట్టాలె
- ఇండస్ట్రియల్కారిడార్ పేరుతో పాయల్‌శంకర్ దోపిడీ
- ఆ దొంగకు రేవంత్ తోడుదొంగ: ధ్వజమెత్తిన కేటీఆర్
తెలంగాణలో నీళ్లు బంద్, పరిశ్రమలు బంద్, కరెంట్ బంద్, చివరికి వ్యవసాయం కూడా బంద్ పెట్టే పరిస్థితిని కాంగ్రెస్ సర్కార్ తెచ్చింది. రాష్ట్రంలో అన్ని రంగాలకు హాలిడే ప్రకటించినట్టుగా పాలన సాగుతున్నది. మంచిగా ఉన్న విద్యుత్తు వ్యవస్థను రేవంత్ ప్రభుత్వం ఆగం చేసింది. పరిశ్రమలు మూతపడే దుస్థితి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో సంక్షోభం తాండవిస్తున్నది.
రేవంత్‌రెడ్డీ.. నేను అడుగుతున్నా.. మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిందెవరు? ఎకరాకు పదిహేను వేలు ఇస్తానని మోసం చేసిందెవరు? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12 వేలు ఇస్తామని లక్షలాది మంది రైతు కూలీలను దగా చేసిన దుర్మార్గుడెవరు? కౌలు రైతులకు 12 వేలు ఇస్తామని ఎగ్గొట్టిందెవరు?
-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ మూడేండ్ల పాలనలో రాష్ట్రంలో నీళ్లు బంద్, కరెంట్ బంద్, పరిశ్రమలు బంద్, చివరికి వ్యవసాయం కూడా బంద్ అయ్యే పరిస్థితి దాపురించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుబంధు బంద్ అయింది కానీ రాహుల్‌గాంధీ బంధు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నదని ఎద్దేవా చేశారు. ‘దివానాగాళ్లకు ఓట్లేస్తే దివాలాతీసే రోజులు వచ్చినయ్.. నాడు రాహుల్‌గాంధీని తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ ఇచ్చిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు సాగుచేసే పంటలకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రైతులకు ఫర్మానా జారీ చేసి మరణశాసనం రాస్తున్నడు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్ సర్కార్ వైఫల్యంతో రాష్ట్రంలో అన్ని రంగాల్లో సంక్షోభం తాండవిస్తున్నదని తూర్పారబట్టారు. ‘కేసీఆర్‌పై కక్షతో కల్పతరువులాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన్రు.. నీళ్లెత్తకుండా రైతుల పొలాలను ఎండబెట్టిన్రు’ అంటూ నిప్పులు చెరిగారు. ఆదిలాబాద్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన రైతుగర్జన సభకు హాజరైన కేటీఆర్.. అశేషంగా తరలివచ్చిన రైతులనుద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి మాట్లాడిన వీడియోలను చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
అదే విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గొప్పలు చెబుతున్న బీజేపీపై దుమ్మెత్తిపోశారు. ఢిల్లీలో హమ్లా ప్రభుత్వం ఉంటే, తెలంగాణలో జుమ్లా సర్కార్ నడుస్తున్నదని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఆదిలాబాద్‌లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నా జిల్లాకు ఒరిగిందేందని సూటిగా ప్రశ్నించారు. ఆదిలాబాద్ కవుల రచనలు, గాయకుల పాటలను గుర్తుచేస్తూ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిన మూడు విడతల రైతుబంధుతో పాటు యాసంగి పంటకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని కలిపి ఎకరానికి రూ.60 వేల చొప్పున వెంటనే చెల్లించాలని, ప్రతి రైతు ఖాతాలో ఆ మొత్తం జమ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
‘కేసీఆర్ పాలనలో రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉండేది. రైతులు పుట్లకొద్దీ వడ్లు పండించారు. ఇప్పుడు మాత్రం రైతులు పంటలు వేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 108 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం’
– కేటీఆర్
రైతు డిక్లరేషన్ పేరుతో దగా
రైతు డిక్లరేషన్ పేరిట అడ్డగోలుగా హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లయినా చేసిందేమీ లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఎకరాకు రూ.15వేల రైతుబంధు అందిందా? రూ.2లక్షల రుణమాఫీ జరిగిందా? రూ.500 బోనస్ దక్కిందా? 34 హామీల్లో ఒక్కటైనా అమలైందా? అని సభికులను ప్రశ్నించగా ‘లేదు.. లేదు’ అని గట్టిగా సమాధానాలిచ్చారు. రూ.15వేల రైతుబంధు దేవుడెరుగు కనీసం రైతుకు యూరియా బస్తా ఇచ్చే దిక్కులేకుండా పోయిందని ఆయన దుయ్యబట్టారు. నాడు రేవంత్‌రెడ్డి రైతుబంధుపై ‘మేమేమన్నా దివానగాళ్లమా’ అని మాట్లాడిన వీడియోను చూపుతూ విమర్శలు కురిపించారు. స్వయంగా ముఖ్యమంత్రే క్రాప్ హాలిడే ప్రకటించి పంటలు వేస్తే జుర్మానా వేస్తానని ఫర్మానా జారీ చేయడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. రైతు బాగుండాలని కేసీఆర్ 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు వేసి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.

కరువుకు కల్పతరువే కాళేశ్వరం
కేసీఆర్‌పై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కరువుకు కల్పతరువు అయిన కాళేశ్వరాన్ని వినియోగించుకోకుండా లక్ష క్యూసెక్కుల నీటిని వృథాగా వదిలేశారని ధ్వజమెత్తారు. ‘కాళేశ్వరం వాడుకోవాలని మేం చెప్పినా ఈ రేవంత్‌రెడ్డి వినకుండా.. వీళ్ల రక్తం పంట పొలాలల్లో చల్లాలె, చల్ల్లితే పంటలు పండుతయ్ అని పనికిమాలిన మాటలు మాట్లాడిండు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కార్ నిర్లక్ష్యం చేసి శ్రీశైలం, కన్నెపల్లి వద్ద నీళ్లెత్తకపోవడం వల్ల వానకాలంలో 35 లక్షల ఎకరాలు నష్టం జరిగి రైతులు రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సామల సదాశివ అనే కవి ‘యాది’ పుస్తకం రాశారు. మనిషికి యాది చాలా ముఖ్యం.. యాది లేకుంటే ఆగమైతం. మంచి చేసినోన్ని గుండెల్లో పెట్టుకోవాలె.. అట్లాగే చెడు చేసినోన్ని కూడా యాది పెట్టుకోవాలె. వాడిని వంద ఫీట్ల బొంద తీసి పాతి పెట్టాలె. కసితీరా బుసకొడుతుండాలె.. కాలంబు రాగానే కాటేసి తీరాలె’ అనే కాళోజీ మాటలను కూడా ప్రజలు యాది మరువొద్దు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. తెలంగాణ కంటే రెండింతల వర్షపాతం లోటు ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇలాంటి కరువు పరిస్థితులు లేవు. అన్ని వనరులు, సాగునీటి అవకాశాలు అందుబాటులో ఉన్న తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా రైతులు కరువు కోరల్లో చికుకున్నారు. ఎల్ నినో పేరు చెప్పి బాధ్యత నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు. రాష్ట్రంలో నెలకొన్న కరువుకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కౌలు రైతులకు రైతుబంధు ఏది?
‘కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధు ఇస్తానంటూ 21 లక్షల మంది కౌలు రైతులకు రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. రైతులకు ఇచ్చినట్టే కౌలు రైతులకు నాలుగు పంటల రైతుబంధును, ఎగ్గొట్టిన మూడు సీజన్ల మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నెలకు రూ.వెయ్యి ఇస్తామని హామీ ఇచ్చి దగా చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా రైతు కూలీల బ్యాంకు ఖాతాల్లో 36 నెలల పైసలు వేయాలని డిమాండ్ చేశారు.
పాయల్ శంకర్, రేవంత్ తోడు దొంగలు..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తోడు దొంగలని కేటీఆర్ విమర్శించారు. ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట పాయల్ శంకర్, ఆయన కుటుంబ సభ్యులు సిగ్గు లేకుండా దోపిడీ చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా ‘లచ్చులో లచ్చన్న ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే లచ్చులో లచ్చన్న’ అంటూ ఆదిలాబాద్ జిల్లా ముద్దు బిడ్డ మహాకవి గూడ అంజన్న రాసిన పాటను గుర్తు చేశారు. బీజేపీ మోసగాళ్ల ఉచ్చులో పడి ఆదిలాబాద్ గోస పడుతున్నదంటూ మండిపడ్డారు.
కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను సక్రమంగా వినియోగించుకుని ఉంటే తెలంగాణలో ఒక ఎకరం కూడా ఎండిపోయే పరిస్థితి ఉండేది కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు కరువుకు కల్పతరువు లాంటిది. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు.. కాంగ్రెస్ అంటే కరువు.
– కేటీఆర్

బడే భాయ్.. చోటే భాయ్ దొందూదొందే..
బడే భాయ్.. చోటే భాయ్ దొందూదొందేనని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘బడే భాయ్ చెప్పిన 15లక్షలు రాలే.. చోటే భాయ్ చెప్పిన 15వేలు రాలే. చోటే భాయ్ సోయా కొనడు. బడే భాయ్ పత్తి కొనడు. చోటే భాయ్ యూరియా యాప్ పెట్టిండు. బడే భాయ్ కిసాన్ కపాస్ యాప్ పెట్టిండు. ఇద్దరు ఝూటే మనుషులే. కాంగ్రెస్.. బీజేపీ దొందూదొందే’నని దుయ్యబట్టారు. మాట్లాడితే డబుల్ ఇంజిన్.. డబుల్ ఇంజిన్.. అంటరు. ఏం డబుల్ ఇంజిన్. అయితే జుమ్లా.. లేదంటే హమ్లా తప్ప డబుల్ ఇంజిన్ లేదు. మన్నూలేదు. ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే బీజేపీనే.. ఎంపీ బీజేపీనే. సీసీఐ ఫ్యాక్టరీని ఎందుకో తెరుస్తలేరు. సీసీఐ ఎందుకో తుక్కు కింద అమ్ముతున్నరు. మా జోగు రామన్నకున్న ఫికర్ ఎమ్మెల్యే శంకర్‌కు ఎందుకు లేదు’ అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ సీసీఐని అమ్ముతూ.. వైజాగ్ స్టీల్‌ను పునరుద్ధరిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉంటే.. సీసీఐని ఎలా అమ్ముతావంటూ గల్లా పట్టి ప్రశ్నించేవాళ్లమని చెప్పారు.
బీజేపీకి ఓటేస్తే ఏమైనా లాభం జరిగిందా?
బీజేపీకి ఓటు వేయడం వల్ల ఈ మూడేండ్లల్లో ఏమైనా లాభం జరిగిందా? అని ఆలోచించాలని రైతులకు కేటీఆర్ సూచించారు. ఎంపీని.. ఎమ్మెల్యేను గెలిపిస్తే ఏమైనా లాభం జరిగిందా? అన్నది రైతులు ఆలోచించాలని కోరారు. తెలంగాణకు మోదీ ఏం చేసిండని ప్రశ్నించారు. ‘మోదీ 13 ఏండ్ల నుంచి ప్రధాన మంత్రిగా ఉన్నడు. తెలంగాణకు ఏం చేసిండని.. ఏమిచ్చిండని నిలదీశారు. ‘ఒక్క మెడికల్ కాలేజీ ఇచ్చిండా? ఒక్క నర్సింగ్ కాలేజీ ఇచ్చిండా? నవోదయ పాఠశాల ఇచ్చిండా? ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిండా? ఒక్క జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? ఎందుకు నమ్మాలని నిలదీశారు.
రేవంత్‌రెడ్డికి హాలిడే చెప్పేద్దాం..
రాష్ట్రంలో హాలిడేల రాజ్యం నడుస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. ‘ఫీజు రీయింబర్స్మెంట్ హాలిడే.. పవర్ హాలిడే. కన్స్ట్రక్షన్ హాలిడే.. ఇండస్ట్రీ హాలిడే. ఐటీకి హాలిడే. రైతుబంధుకు హాలిడే. మొత్తం హాలిడే రాజ్యం నడుస్తున్నది. అసలు ఈ హాలిడేస్ ఏందుకు.. రేవంత్‌రెడ్డికే శాశ్వతంగా హాలిడే చెప్పే రోజులు ముందున్నాయి. మళ్లీ కేసీఆర్‌ను ఎత్తుకుంటే.. ముఖ్యమంత్రిని చేస్తే మళ్లీ ప్రశాంతత వస్తుంది. ఈ దిశగా రైతులు ఆలోచించాలి’ అని కేటీఆర్ కోరారు.
ఎలుకల వల్ల ఏడుగురు పిల్లలు చనిపోయిన్రట
ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏడుగురు పిల్లలు మృత్యువాతపడిన ఘటనను ప్రస్తావించిన కేటీఆర్ సర్కార్ వైఫల్యంపై నిప్పులుచెరిగారు. చిన్నారుల మరణానికి ఎలుకలు కారణమని ప్రభుత్వం చెప్పడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఎలుకల వల్ల ఏడుగురు పిల్లలు చనిపోయిన్రట. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? వాళ్ల ప్రాణాలను ఎవరు తెచ్చిస్తారని’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘రాష్ట్రాన్ని నల్లమల పిల్లి నడుపుతున్నది. ఆ నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం చాతనైతలేదా?’ అంటూ ప్రశ్నించారు. ఎలుకలు పట్టలేని వారు ముఖ్యమంత్రిగా ఉండి దేనికని నిలదీశారు. ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని జోగు రామన్న డిమాండ్ చేసినా సీఎం నోరెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

