హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో ఆఖరి మజిలీకి కూడా అగౌరవమే దక్కుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. భద్రాచలంలో వడదెబ్బతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కుటుంబీకులు మోసుకెళ్లిన ఘటనపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిందో ఈ ఒక ఘటనే అద్దంపడుతున్నదని పేర్కొన్నారు. బతికున్నప్పుడు అండ దొరుకలేదని, చనిపోయిన తర్వాత కనీస గౌరవం కూడా దకని పరిస్థితికి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో పేదవాడి ఆఖరి ప్రయాణం కూడా గౌరవంగా సాగాలనే ఆలోచనతో ప్రత్యేకంగా పార్థివ దేహాల తరలింపు వాహనాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.
కేసీఆర్‌ది మానవత్వం, ప్రజల గౌరవాన్ని కాపాడే సంకల్పమైతే.. నేడు కాంగ్రెస్ పాలనలో కుటుంబ సభ్యులే మృతదేహాలను భుజాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి రావడం బాధాకరమని, ఇది తెలంగాణ ఆత్మగౌరవానికే మాయని మచ్చ అని అభివర్ణించారు. ప్రచారాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం, పోస్టర్లు, సభలు, యాత్రలు, హెలికాప్టర్ల కోసం ప్రజల డబ్బు వెచ్చించే ప్రభుత్వం.. అదే ప్రజలకు అవసరమైన కనీస అత్యవసర సేవలు అందించలేకపోవడం సిగ్గుచేటు కాదా? అని ప్రశ్నించారు. రాజకీయ ప్రతీకారాలు, విమర్శలు, ప్రచార హడావుడి తప్ప ప్రజల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని నిలదీశారు. తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ అని, ప్రతి పేద కుటుంబం గౌరవంగా జీవించేలా పాలన సాగించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలు మళ్లీ అవస్థల తెలంగాణను చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.