KTR | కేసీఆర్ పాలనలో కరెంటు కోతలు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గత కాంగ్రెస్ పాలనలో వారానికి మూడు రోజులు పవర్ హాలీడేలు ప్రకటించిన పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. 65 ఏళ్లలో కాంగ్రెస్ చేయని పనిని 6 నెలల్లోనే బీఆర్ఎస్ చేసిందని.. 24 గంటల మెరుగైన కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అని కొనియాడారు. 79 ఏళ్ల దేశ చరిత్రలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు.
కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యేలు సాయన్న, లాస్య నందిత చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. వ్యవసాయానికి 24 గంటలు అక్కర్లేదు.. మూడు గంటలు చాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ తెలిపారు. 24 గంటల కరెంటు ఇచ్చేందుకు రైతు డిస్కం పెడుతున్నానని రేవంత్ రెడ్డి చెబుతున్నవన్నీ అవాస్తవాలని పేర్కొన్నారు. అది రైతు డిస్కం కాదని.. రైతులపాలిట యమపాశంగా మారే కాంగ్రెస్ డిస్కం అని వ్యాఖ్యానించారు. రేవంత్ చెప్పింది చేయడు.. చేసేది చెప్పడని ఎద్దేవా చేశారు.
రైతులకు యూరియా, కరెంట్ ఇచ్చే తెలివి లేదు.. కానీ రైతు డిస్కం పెడతాడట అని మండిపడ్డారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో.. రైతులపై రేవంత్ రెడ్డికి అంతే ప్రేమ ఉంటదని వ్యాఖ్యానించారు. రైతు డిస్కం పేరిట ఉచిత విద్యుత్ ఇస్తానంటే ఎవరు నమ్మరని అన్నారు. ఊళ్లలో కాంగ్రెస్‌ను నమ్మినందుకు గోసపడుతున్నారని తెలిపారు.
రైతుల కోసం రేవంత్ రెడ్డి 34 హామీలు ఇచ్చిండని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ రూ.10వేల రైతుబంధు ఇస్తే.. రేవంత్ రెడ్డి రూ.15వేలు ఇస్తామని అన్నారని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, రైతు, మహిళా డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చారని అన్నారు. కానీ ఏ ఒక్కటి అమలు చేయకుండా మోసం చేసిందని మండిపడ్డారు. దేశమంతా కాంగ్రెస్‌ను వదిలించుకుంటే.. మాయమాటలు విని ఇక్కడ నెత్తిమీదకు తెచ్చుకున్నామని అన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి వాగ్దానాల వరద.. ఇప్పుడు నోరు తెరిస్తే బురద అని ఎద్దేవా చేశారు.
తమ హయాంలో రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌కు 20 వేల లీటర్ల నీళ్లు ఉచితంగా ఇచ్చినామని పేర్కొన్నారు. కంటోన్మెంట్‌లోని డిఫెన్స్ భూమిలో తెలిసో తెలియకపో ఇళ్లు కట్టుకున్న 35 వేల మంది కోసం బీఆర్ఎస్ కొట్లాడిందని గుర్తుచేశారు.