హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై ప్రధాని మోదీ మొదటి నుంచే మనసులో ద్వేషం నింపుకున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ అంటూనే తెలంగాణను దూరం పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు నిధులు మంజూరుచేయాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఇతర రాష్ట్రాలపై ఎనలేని ప్రేమ ప్రదర్శించి తెలంగాణపై వివక్ష చూపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ మెట్రో కోసం నిధులు మంజూరుచేయాలని ఎన్నిసార్లు కోరినా పెడచెవినపెట్టారని మండిపడ్డారు. తాజా బడ్జెట్లోనూ మళ్లీ హైదరాబాద్ మెట్రోకు మొండిచెయ్యే చూపించారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచే తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ మోదీ తన తెలంగాణ వ్యతిరేకత బయపెట్టిన వైనాన్ని కేటీఆర్ గుర్తుచేశారు.
తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎమినిది ఎంపీ స్థానాలు ఇచ్చినా రాష్ర్టానికి ఫాయిదా లేకుండా పోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో కన్నా రాష్ర్టానికి నిధుల్లో కోతలు పెట్టారన్నారని ఉదహరించారు. రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీకి 8 సీట్లు ఇచ్చింది రాష్ట్రంపై ఇలా వివక్షను మరింత చూపేందుకేనా? అని నిప్పులుచెరిగారు. గత పదేండ్లలో దేశంలోని 20 మెట్రో ప్రాజెక్ట్‌ల కోసం మోదీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు భారీగానే నిధులు కేటాయించిందని వివరించారు. తెలంగాణకు మాత్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో విషయంలో జరిగిన అన్యాయాన్ని మోదీకి వివరించి రాష్ట్ర బీజేపీ ఎంపీలు నిధులు తేవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్ మెట్రోను విస్మరిస్తూ ఇతర రాష్ర్టాలకు కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించారు.