కాంగ్రెస్ మంత్రులు కూడా సీఎం రేవంత్‌నే అనుసరిస్తున్నరు..ఒకరేమో రుణమాఫీ మొత్తం అయ్యిందంటరు. మరొకరు కొంచెమే మిగిలి ఉన్నదంటరు. ఇంకొకాయన 70 శాతం చేసినమని చెప్తున్నరు. వారి మాటలు చూస్తుంటే రేవంత్‌రెడ్డి వారికి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వనట్టు తెలుస్తున్నది. ఇప్పటికైనా తప్పుడు మాటలు కట్టిపెట్టి వాస్తవాలు చెప్పాలె. -కేటీఆర్
KTR | హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఏ ఊరిలోనైనా 100 శాతం రైతు రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. కొండారెడ్డిపల్లి, కొడంగల్, పాలేరు సహా ఎక్కడికైనా వెళ్లి రైతులను అడుగుదామని, ఒక్క ఊరిలో అయినా వందశాతం రుణమాఫీ అయినట్టు నిరూపించాలని సవాల్ చేశారు. ‘అసెంబ్లీ ఎన్నికల ముందు రుణాలు తెచ్చుకోండి.. డిసెంబర్ 9న రుణమాఫీపై తొలి సంతకం చేస్తమన్నరు. ఏ ఒక్క ఊర్లో కూడా వందశాతం రుణమాఫీ కాలేదు’ అని సర్కార్‌ను కడిగిపారేశారు. శనివారం రైతు భరోసాపై అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ సందర్భంగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. పరస్పరం రాజీనామా సవాళ్లతో అసెంబ్లీ హీటెక్కింది. ముందు కేటీఆర్ మాట్లాడుతుండగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కల్పించుకున్నారు. దీంతో ఆయనకు కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు.
శాసనసభాపక్షం మొత్తం రాజీనామా
24 గంటల కరెంట్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వాదనను కేటీఆర్ తిప్పికొట్టారు.‘ఈ రోజు ఏ పత్రికచూసినా కా్రంగెస్ ప్రకటనలే కనబడుతున్నయి. దాంట్లో 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు ప్రకటనలిచ్చుకుంటున్నరు. 24 గంటల విద్యుత్తు ఇస్తున్నారన్నది అవాస్తవం. కావాలంటే సభ వాయిదా వేసి అందరం నల్లగొండకు పోదాం. ఈ రోజు ఒక లాగ్ బుకులో అయినా 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు చూపిస్తే బీఆర్ఎస్ శాసనసభా పక్షం మొత్తం రాజీనామా చేస్తం’ అని కోమటిరెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు. ‘గతంలో 24 గంటల విద్యుత్తు ఇవ్వలేదని కోమటిరెడ్డి సభను తప్పుదోవ పట్టించడం సరికాదు. బీఆర్ఎస్ పాలనలో 24 గంటల్లో సగటున 19.2 గంటల విద్యుత్తు ఇచ్చినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమారనే చెప్పారు. ఈ విషయాన్ని ఆయననే అడగండి’ అంటూ కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. ‘కావాలంటే సభను వాయిదా వేసి నల్లగొండ జిల్లాకు వెళ్లి విద్యుత్తు పరిస్థితులను ఇప్పుడు పరిశీలిద్దాం. మంత్రి కోమటిరెడ్డి కోరినట్టు ఎలక్ట్రిసిటీ, మిషన్ భగీరథపై చర్చ పెట్టండి. చర్చించేందుకు సిద్ధంగా ఉన్నం. నల్లగొండ జిల్లా అభివృద్ధిపై కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. మరో పది రోజులు సమావేశాలను పొడగించాలని స్పీకర్‌ను కోరారు.
నోటికి ఎంతొస్తే అంతేనా?
అప్పుల విషయంలో మంత్రులు తలో విధంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ‘ఆర్బీఐ లెక్కల ప్రకారం ఏడాదికి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 40 వేల కోట్లయితే మీ ప్రభుత్వం ఏడాదిలో చేసిన అప్పు 1.27 లక్షల కోట్లు. ఇది ఆర్బీఐ లెక్క. ఇక్కడ రేవంత్‌రెడ్డి లెక్కనో.. జూపల్లి లెక్కనో చెల్లదు’ అంటూ బదులిచ్చారు. ‘మంత్రులు పూర్తిగా తెలుసుకొని రావాలి. ఒకాయన 7, మరోకాయన 8. ఇంకోఆయన 10 లక్షల కోట్ల అప్పు అంటున్నరు. నోటికి ఎంతొస్తే అంతేనా?’ అంటూ మండిపడ్డారు. ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? అని తిప్పికొట్టారు.
వారికి సరిగ్గా ట్రెయినింగ్ ఇవ్వలేదా?
‘కాంగ్రెస్ మంత్రులు కూడా సీఎం రేవంత్‌ను అనుసరిస్తున్నరు.. ఒకరేమో రుణమాఫీ మొత్తం అయ్యిందంటరు. మరొకరు కొంచెమే మిగిలి ఉన్నదంటరు. ఇంకొకాయన 70 శాతం చేసినమని చెప్తున్నరు. వారి మాటలు చూస్తుంటే రేవంత్‌రెడ్డి వారికి ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వలేదని అర్థమవుతున్నది’ అంటూ కేటీఆర్ ఎద్దేవాచేశారు. ఇప్పటికైనా తప్పుడు మాటలు కట్టిపెట్టి వాస్తవాలు చెప్పాలని హితవు పలికారు. నిజాయితీగా మాట్లాడాలన్న జూపల్లి వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘కేసీఆర్‌పై మీరు ఎంత గొప్పగా మాట్లాడారో వీడియోలు ప్లే చెయ్యిమంటరా?’ అంటూ కేటీఆర్ బదులిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బ్యాంకర్ల మీటింగ్‌లో రూ.49,500 కోట్ల మేర రైతు రుణమాఫీ అని చెప్పారని, ఆ తర్వాత రూ.40 వేల కోట్లు అని చెప్పారని, బడ్జెట్ సమావేశాల్లో రూ.26 వేలు కోట్లు అని పెట్టారని, ఇప్పుడు రూ.20 వేల కోట్లు మాత్రమే చేశామని చెప్పారని, వాస్తవానికి చెప్పినదాంట్లో 25 శాతం కూడా చేయలేదని ధ్వజమెత్తారు. ‘ఇదే విషయంపై అసెంబ్లీలో నిలదీస్తే శాపనార్థాలు పెడుతున్నారు. ఆయన పెట్టే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు’ అంటూ దెప్పిపొడిచారు. రుణమాఫీపై అవసరమైతే సీఎం రేవంత్‌రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో చర్చిందేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని, చారాణా రుణమాఫీ చేసి మొత్తం అయినట్టు పోజులు కొడుతూ రూ.550 కోట్లతో పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు.
గద్దర్, గోరటి పాటలు.. శ్రీశ్రీ కవితలు..
అసెంబ్లీలో చర్చ సందర్భంగా గద్దర్, గోరటి వెంకన్న పాటలు, శ్రీశ్రీ కవితలను కేటీఆర్ చదివి వినిపించారు. గోరటి వెంకన్న రాసిన ‘సేతామేడుందిరా.. తెలంగాణ చేలన్నీ బీళ్లాయెరా’, ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’ అనే పాటలను కేటీఆర్ ప్రస్తావించారు. ‘ఆనాడు పాలకుల కరషత్వం, నిరంకుశత్వంపై ‘దుకులు దున్నిన రైతు చేతుల బేడీలెందుకురోరన్న.. మొకలు నాటిన కూలీలనెందుకు జైల్లో పెట్టిండ్రోరన్న’ అని గద్దరన్న పాడిండు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చూస్తుం టే గద్దరన్న మన మధ్య ఉండుంటే మళ్లీ గజ్జెగట్టి ఈ కాంగ్రెస్ సరారుపై ఇదే పాట అందుకొని గర్జించేవాడు’ అని గుర్తుచేశారు. రైతన్నకు ఎంత ఇచ్చినా ఏమిచ్చిన తకువేననే భావనతో ‘పొలాలనన్నీ, హలాలదున్నీ, ఇలాతలంలో హేమం పిండగ – జగానికంతా సౌఖ్యం నిండగ – విరామ మెరుగక పరిశ్రమించే, బలం ధరిత్రికి బలి కావించే,కర్షక వీరుల కాయం నిండా’ అన్న శ్రీశ్రీ కవితను కేటీఆర్ ప్రస్తావించారు.
జూపల్లికి గట్టి కౌంటర్
పాలమూరులో ప్రాజెక్ట్‌లను పూర్తిచేయకుండా వదిలిపెట్టిందే కాంగ్రెస్ అని కేటీఆర్ విమర్శనాస్ర్తాలు సంధించారు. పాలమూరు వలసలు ఆపింది, సాగును పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమని స్పష్టంచేశారు. ఆ సమయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కల్పించుకున్నారు. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులకు మరో 50 వేల కోట్లు కావాలని, పూర్తి ఆయకట్టుకు నీళ్లు రాలేదని చెప్పారు. మెజార్టీ గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదన్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ ‘పాలమూరు జిల్లాలో పెండింగ్ కేఎల్ఐ, భీమా, నెట్టెంపాడులను 4 వేల కోట్లతో పూర్తిచేసి, ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన మాట వాస్తవం కాదా? మీ గుండెమీద చెయ్యి వేసుకొని చెప్పాలి’ అని మంత్రి జూపల్లికి సవాల్ విసిరారు. ‘మేము తొమ్మిదిన్నరేండ్లు ఉచితంగా సాగు, తాగు నీళ్లిచ్చినం. నీటి తీరువా రద్దుచేసినం.. భూమిశిస్తు రద్దుచేసినం. బకాయిలు మాఫీ చేసినం. భవిష్యత్తులోనూ ఇలాగే రైతన్నలకు ఉచితంగా ఇస్తం.. నిజాయితీగా చెప్తున్నం.. రైతుల మీద ఎలాంటి భారం మోపబోం’ అని గట్టిగా కౌంటరిచ్చారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే బ్యాంకర్ల మీటింగ్‌లో రూ.49,500 కోట్ల మేర రైతు రుణమాఫీ అని చెప్పిండ్రు. ఆ తర్వాత రూ.40 వేల కోట్లు అన్నరు. బడ్జెట్ సమావేశాల్లో రూ.26 వేలు కోట్లు అన్నరు. ఇప్పుడు రూ.20 వేల కోట్లే చేశామని చెప్తున్నరు. మీరు చెప్పినదాంట్లో 25 శాతం కూడా రుణమాఫీ చెయ్యలేదు. ఇదే విషయంపై అసెంబ్లీలో నిలదీస్తే శాపనార్థాలు పెడుత్నురు. -కేటీఆర్