Minister KTR | తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే తమ ప్రధాన ప్రత్యర్థి అని భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. అయితే, చివరకు గెలిచేది మాత్రం బీఆర్ఎస్సే అని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు 70 నుంచి 82 సీట్ల మేర వస్తాయని చెప్పారు. తెలంగాణ సమాజం బీఆర్ఎస్ను కోరుకుంటోందని.. కేసీఆర్ మరోసారి సీఎం పదవి చేపట్టి హ్యాట్రిక్ కొడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీవీ9 నిర్వహించిన మెగా కాన్ క్లేవ్ (Tv9 Mega Political Conclave 2023)లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొరపాటున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ ఢమాల్ అవడం ఖాయమన్నారు. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రతి ఆరునెలలకో సీఎంను మారుస్తుంటారని, అలాంటి పరిస్థితుల్లో స్థిరమైన పాలన ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు. అదే సమయంలో పాలనాపరమైన నిర్ణయాలను సైతం త్వరితగతిన తీసుకోలేరని వ్యాఖ్యానించారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగళూరులో రియల్ ఎస్టేట్ రంగం 28 శాతం మేర పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. అదే సమయంలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా పెరుగుతోందని వెల్లడించారు.
Also Read..
Minister Ktr | కాంగ్రెస్కు ఇక్కడ బేస్ లేదు.. రెండో స్థానం కోసమే పాకులాట : మంత్రి కేటీఆర్
Minister KTR | తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై మంత్రి కేటీఆర్ ప్రజెంటేషన్.. LIVE