హైదరాబాద్, జులై 15 (నమస్తే తెలంగాణ) : రూ. 2 వేల కోట్ల పెట్టుబడితో ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పునరుద్ధరణకు కేంద్రమంత్రి సానుకూలత వ్యక్తం చేసినట్టు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. పదేండ్లుగా బీఆర్ఎస్ చేస్తున్న కృషికి ఫలితమే ఇదని అన్నారు. కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ముఖ్యనేతల బృందం బుధవారం కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామితో సమావేశమైంది. అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ 1980వ దశకంలో స్థాపించిన ఈ ప్లాంట్ ప్రత్యక్షంగా, పరోక్షంగా 6 వేల మందికి ఉపాధి కల్పించిందని గుర్తుచేశారు. అకడ వందేండ్లకు సరిపడా మైన్స్టోన్ నిల్వలు ఉన్నాయని, 4 లక్షల టన్నుల సామర్థ్యం గల ఈ ప్లాంట్‌ను నడపడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని కేంద్రమంత్రికి వివరించామని తెలిపారు. సీసీఐని మూసివేయడం లేదా విక్రయించే ఆలోచనలను విరమించుకుని, మళ్లీ ఉత్పత్తిని ప్రారంభించాలని కుమారస్వామి ని కోరామని చెప్పారు.
సీసీఐని పునరుద్ధరించడంపై కేంద్రం సానుకూలంగానే ఉన్నదని కేంద్రమంత్రి కుమారస్వామి వెల్లడించారని కేటీఆర్ చెప్పారు. ‘సీసీఐ సాధన సమితి చేస్తున్న పోరాటం అభినందనీయం. మేం కూడా దీన్ని మళ్లీ నడపాలన్న కోరికతోనే ఉన్నాం’ అని కేంద్రమంత్రి అన్నారని తెలిపారు. ‘సీసీఐని పునరుద్ధరించాలని మేమూ అనుకుంటున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఏడాది కాలంగా ప్రయత్నిస్తున్నా మైనింగ్ లీజును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, జీఎస్టీ మినహాయింపులు, ఇతర ప్యాకేజీల వివరాలు వెల్లడించడం లేదు’ అని కేంద్రమంత్రి చెప్పినట్టు కేటీఆర్ పేరొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీరుపట్ల బీఆర్ఎస్ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ పవర్, క్యాపిటల్ సబ్సిడీ, జీఎస్టీ మినహాయింపులు, మైనింగ్ లీజు పెంపు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రతిపాదనలు కేంద్రం కోరుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మైనింగ్ లీజును పొడిగించి, కేంద్రంతో కలిసి సంయుక్తంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. అకడ వందేండ్లకు సరిపడా సున్నపురాయి నిల్వలు ఉన్నాయని, అటువంటి విలువైన ఆస్తిని తుకు కింద అమ్మేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సిర్పూర్ పేపర్ మిల్లును తాము అధికారంలో ఉన్నప్పుడు ఎలా తెరిపించామో అలానే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే సీసీఐ పునరుద్ధరణ సాధ్యమేనని పేరొన్నారు.

ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొత్త ప్లాంట్ కోసం రూ.2,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసినట్టు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదని స్వయంగా కేంద్ర మంత్రి చెప్పినట్టు వివరించారు. ప్లాంట్ విషయంపై బుధవారం ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామితో మాట్లాడుతున్న కేటీఆర్.. చిత్రంలో వద్దిరాజు రవిచంద్ర, జోగు రామన్న
మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్ఏను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి శిఖండి రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు, రైతుల ఆవేదనపై స్పందించని కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఆయన ఢిల్లీలో బుధవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా తెలంగాణ బిడ్డల రక్తాన్ని కండ్లజూస్తున్న కాంగ్రెస్, ఇప్పటికైనా కండ్లు తెరిచి అన్నదాతల కష్టాలను గుర్తించాలని డిమాండ్ చేశారు. సీఎం బేషజాలను పకనపెట్టి, రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. ఎన్డీఎస్ఏ అనేది కేవలం ఒక అడ్వైజరీ రెగ్యులేటరీ బాడీ మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను శాసించే సంపూర్ణ అధికారాలు దానికి లేవని స్పష్టం చేశారు.మేడిగడ్డను తాకకుండానే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని తరలించవచ్చని ఇరిగేషన్ శాఖకు చెందిన ప్రస్తుత, రిటైర్డ్ ఇంజనీర్లు స్పష్టమైన సాంకేతిక నివేదికలు ఇస్తున్నా, ప్రభుత్వం కావాలనే వాటిని విస్మరిస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల్లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ చేస్తున్న ఈ ఆలస్యం క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకు వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం ప్రభుత్వం ఎటువంటి జాప్యం చేయకుండా, కన్నెపల్లి పంపులను ఆన్ చేసి పంటలకు నీటిని విడుదల చేయాలని, క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించి, సాంకేతిక నిపుణుల సలహాలను స్వీకరించాలని ముఖ్యమంత్రిని కోరారు. కరువు బారి నుంచి తెలంగాణ పంటలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని, ఆ దిశగా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తం వ్యవహారాన్ని ముఖ్యమంత్రి విజ్ఞతకే వదులుతున్నామని, భవిష్యత్తులో రైతుల పట్ల ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే వారి చిత్తశుద్ధిని తెలియజేస్తాయని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మా రక్తం కావాలని అడిగితే.. సూర్యాపేటలోని మారుమూల గిరిజన తండాల్లో రైతులు పంట పొలాల మీద రక్తం చల్లుతూ నిరసన తెలుపుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మా రక్తం తీసుకోండి.. కానీ పొలాలకు నీళ్లు ఇవ్వండి’ అని రైతులు రక్తతర్పణం చేస్తుంటే, రక్తపిశాచిలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. హిట్లర్ని ఆదర్శంగా తీసుకునే ఈ బట్లర్ ముఖ్యమంత్రి ఇప్పటికైనా కండ్లు తెరిచి రైతుల ఆవేదనపై స్పందించాలని, దాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పేరొన్నారు. ఆదిలాబాద్ సీసీఐ ప్లాంట్ ప్రారంభమయ్యేవరకు బీఆర్ఎస్ తన పోరాటాన్ని ఆపదని, అవసరమైతే పెద్దఎత్తున నిరసనలు చేపట్టి ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి జోగురామన్న, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, సీసీఐ సాధన సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.