11 ఏండ్ల కిందట కేంద్ర ఎన్నికల సంఘం రోడ్డు రోలర్ గుర్తును తొలగించింది. ఇప్పుడు మళ్లీ మునుగోడుకు పంపింది. మీ నిబంధనలను మీరే ఎలా అధిగమిస్తారు. ఎలక్షన్ కమిషన్ నడుపుతున్నారా? సర్కస్ కంపెనీ నడుపుతున్నారా? గతంలో ఇదే జిల్లాలోని భువనగిరి లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం 5 వేల ఓట్లతో ఓడిపోయింది. రోడ్డు రోలర్ సింబల్‌కు 29వేల ఓట్లు వచ్చాయి. అందుకే రోడ్డురోలర్ వద్దని రిటర్నింగ్ ఆఫీసర్‌ను కోరితే అంగీకరించారు. ఎన్నికల సంఘం నుంచి ఆ గుర్తును పంపిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఇక్కడి రిటర్నింగ్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవడం ఏమిటి?.
కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి ఎవరో అవసరం లేదు. వాళ్లే నాశనం చేసుకొంటారు. రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేసినప్పుడే వాళ్లు మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకొన్నారు. ఆ పార్టీ ఎంపీ వెంకట్‌రెడ్డి మునుగోడులో ఇతర నేతలకు ఫోన్ చేసి బీజేపీకి ఓటేయమని అడుగుతున్నరు. అదో పార్టీయా? రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ఆ ఎంపీపై చర్యలు తీసుకోమనండి? వాళ్ల నాయకుడు రాహుల్‌గాంధీ భారత్ జోడో అంటడు.. నేతలేమో కాంగ్రెస్ చోడో అంటూ వెళ్లిపోతున్నారు. భారత్ జోడో యాత్ర గుజరాత్‌కు ఎందుకు వెళ్లడం లేదు? కాంగ్రెస్‌కు, బీజేపీకి ఒ ప్పందం ఏమిటి? గుజరాత్లో ఎన్నికలు ఉన్నా రాహుల్‌గాంధీ యాత్ర చేయకుండా ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నరు? లోపాయికారి ఒప్పందమా? ఈడీ బెదిరింపులా? ఇది కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ కాదా? కాంగ్రెస్ ఎంపీ బీజేపీకి ఓట్లు అడిగితే కోవర్ట్ రాజకీయం అనరా? ఆయన కోమటిరెడ్డి కాదు.. కోవర్ట్ రెడ్డి. కోట్లకు అమ్ముడుపోయిన రెడ్డి. నేను చెప్పేది వాస్తవమో కాదో మునుగోడు ప్రజలు ఆలోచించి తీర్పు చెప్పాలి. కోవర్ట్ రాజకీయాన్ని తిప్పికొట్టండి. కోట్లను నమ్ముకున్న వ్యక్తికి ఓట్లతో బుద్ధి చెప్పండి.
సీఎం ఫామ్‌హౌస్‌లో ఉంటేనే రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంటు వస్తున్నదా? కాళేశ్వరం మూడున్నరేండ్లలో పూర్తయిందా? అన్నివర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలన్నీ సక్రమంగా అమలవుతున్నాయా? ఒకవేళ అలాగే అనుకుంటే.. ప్రధాని మోదీ రోజుకు 18 గంటలు పనిచేస్తడని, 2 గంటలు మాత్రమే నిద్రపోతడని గప్పాలు కొడతారు కదా. మరి ఈ 8 ఏండ్లలో దేశానికి ఆయన ఏం చేశారు?
మోదీ ప్రభుత్వం రూ.400 ఉన్న సిలిండర్ ధరను రూ.1200కు పెంచి ఆడబిడ్డలకు పొగబెట్టింది. 2014లో పెట్రోల్ ధర రూ.70 ఉంటే.. ఇప్పుడు రూ.110 దాటింది. ముడిచమురు ధర పెరగలేదు.. కానీ మోదీ చమురు ధర మాత్రమే పెరిగింది.
ఇదొక చిల్లర విమర్శ. వాళ్లు మంత్రులు, ఎమ్మెల్యేల కన్నా ముందు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రచారం చేయడం వాళ్ల బాధ్యత. కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్నికలను ఓ యుద్ధంలా చేయాలని అనుకొంటున్నది. కేంద్ర బలగాలను దింపుతున్నది. మేం ప్రజాస్వామికంగా ఎన్నిక జరగాలని కోరుకుంటున్నాం. బలగాలెన్ని దించినా బలం లేనప్పుడు చేయగలిగేది ఏమీ ఉండదు. ఓటు వేయాల్సింది ఓటరే.
ఎన్నికలు ఉంటే తాయిలాలు ప్రకటించడం బీజేపీకి అలవాటే. హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవలే కొన్ని కులాలను ఎస్టీల్లో చేర్చారు. అదే తెలంగాణలో వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాలని ఆరేండ్ల కిందట కోరినా.. ఇప్పటివరకు పట్టించుకోలేదు. కర్ణాటకలో ఎస్టీలకు రిజర్వేషన్ పెంచారు. ఆ వెసులుబాటు తెలంగాణకు ఇవ్వరు. గుజరాత్లో రెండు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. మేం రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తే.. తాయిలాలు దేశానికి ప్రమాదం అంటారు. యూపీ ఎన్నికల్లో ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారు. వాళ్ల రాష్ర్టాల్లో ఉచితంగా ఇస్తే మాత్రం తాయిలాలు అనరు. కొత్త పేరు పెడతారు. గుజరాత్‌కు, ఇతర రాష్ర్టాలకు ఒకే నిబంధనలు వర్తించవు. బీజేపీలో ఉంటే కుటుంబ పాలన కాదు.. అవినీతిపరుడు కాదు.. బీజేపీ ఇస్తే తాయిలాలు కావు. అందుకే అది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాదు.. డబుల్ స్టాండర్డ్ ప్రభుత్వం.
100 హామీలు ఇచ్చి 99 శాతం నెరవేర్చినా.. ఆ ఒక్క హామీ గురించే ప్రశ్నించడం సబబు కాదు. తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరాయో లేదో ప్రజలకు తెలుసు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని మేము ఎక్కడా చెప్పలేదు. ఎనిమిదేండ్ల కిందట మోదీ ఇచ్చిన రూ.15 లక్షల హామీ ఎక్కడకు పోయింది? 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది? ఇలా వాళ్లు చేయనివి, మేము చేసినవి గంటసేపు చెప్పగలను. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పాం. మొదటి విడుతలో రూ.17,750 కోట్లు, రుణమాఫీ చేశాం. రెండో విడుతలో రూ.50 వేల వరకు రుణమాఫీ చేశాం. మిగతాది త్వరలో చేస్తాం. కొవిడ్ విపత్తు వల్ల ప్రభుత్వానికి రూ.లక్ష కోట్ల మేర నష్టం వచ్చింది. పైగా కేంద్రం ఆర్థిక ఆంక్షలు విధించి తెలంగాణను శత్రుదేశంలా చూస్తున్నది. ఆర్థికంగా దెబ్బతీసి చేసి బదనాం చేయాలని చూస్తున్నది. ఏదైనా హామీ విషయంలో పూర్తిస్థాయిలో సక్సెస్ కాకపోతే ప్రత్యామ్నాయ పథకం తీసుకొచ్చాం. దళితులకు మూడెకరాల భూమికి ప్రత్యామ్నాయంగా దళితబంధు వచ్చింది. అలా కేంద్రం ఏదైనా ప్రత్యామ్నాయ పథకం తెచ్చిందా? దేశమంతటా కరెంటు ఇస్తున్నామని మోదీ ఆర్భాటంగా చెప్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గెలిచిన తర్వాతే ఆమె గ్రామానికి కరంటు కనెక్షన్ ఇచ్చారు. అంటే మోదీ ప్రచారం డొల్ల అని తేలిపోయింది కదా!
బ్రిటన్‌లో లిజ్ ట్రస్‌కు ఆత్మాభిమానం ఉంది కాబట్టి రాజీనామా చేశారు. ఇక్కడ మోదీకి ఆత్మ లేదు, అభిమానం లేదు. అధికారం యావ, ఫొటోల పిచ్చి తప్ప. మోదీ ప్రచార మంత్రి తప్ప ప్రధాన మంత్రి కాదు.
బీజేపీ ఒక నీటి బుడగలాంటి పార్టీ. అది ఎప్పుడు పేలిపోతుందో ఎవరికీ తెలియదు. ఆ పార్టీలో ఉన్నదంతా గ్యాస్. ఆది పార్టీలోకి పోయిన రెండు రోజుల్లోనే అందరికీ తెలిసి వస్తున్నది. సీఎం కేసీఆర్‌తో పనిచేసినవారికి ఆయన నిబద్ధత, చిత్తశుద్ధి, ఏకాగ్రత తెలుసు. అందుకే వారు తిరిగి వస్తున్నారు.
నో డౌట్. మేం అద్భుతమైన మెజార్టీతో విజయం సాధించబోతున్నాం. ఫలితాలు మాకే అనుకూలం. కాంగ్రెస్ పార్టీ నంబర్ 2, బీజేపీ 3వ స్థానంలో ఉంటాయి. ప్రజలు మా వైపే ఉన్నారు. సర్వేలన్నీ ఇదే చెప్తున్నాయి.
ముమ్మాటికీ టీఆర్ఎస్సే విజయం సాధిస్తుంది. 2023లో సీఎం కేసీఆర్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయం. తద్వారా దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డులను సృష్టిస్తారు. సీఎం కేసీఆర్‌కు రికార్డులు సృష్టించడం అలవాటే. ఎవరూ రాదన్న తెలంగాణను సాధ్యం చేశారు. అసాధ్యమన్న ప్రపంచంలోనే అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్‌ను మూడున్నరేండ్లలో కట్టి చూపించారు. 24 గంటల కరెంటును సుసాధ్యం చేశారు. విద్యుత్తులోటు ఉన్న రాష్ర్టాన్ని మిగులు రాష్ట్రంగా మార్చారు. అతితక్కువ సమయంలో దేశంలోనే వేగంగా పురోగమిస్తున్న రాష్ర్టాల్లో ఒకటిగా తెలంగాణను తీర్చిదిద్దారు. అందుకే స్వాతంత్య్ర అనంతర భారతదేశంలో అత్యంత విజయవంతమైన స్టార్టప్‌గా తెలంగాణను పిలుస్తున్నారు. ఇలాంటి సక్సెస్‌ను సొంతం చేసుకున్న సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. 75 ఏండ్లలో దక్షిణ భారతదేశంలో కరుణానిధి, నంబూద్రిపాద్, చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, జయలలిత వంటి నేతలు కూడా వరుసగా మూడోసారి సీఎంగా గెలువలేదు. మొదటి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టిస్తారు.
ఢిల్లీలో మోదీ ఉన్నారు.. ఇక్కడ రాష్ట్రంలో బోడి ఉన్నాడు.. వాళ్లకు తోడు ఈడీ ఉన్నది. ఏం చేస్తారో చేసుకోమనండి. ఈ రోజు దేశంలో మోదీ మీద కేసీఆర్ మాట్లాడినంత గట్టిగా ఎవరూ మాట్లాడటం లేదు. తప్పు చేయలేదు కాబట్టే ఆ ధైర్యం. మేం తప్పు చేయలేదు.. చేయబోం.
2009 ఎన్నికల తర్వాత నాటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ నన్ను పిలిచి ఫ్లోరోసిస్ అంశంపై అధ్యయనం చేయాలని ఉన్నదని చెప్పారు. స్పీకర్ నేతృత్వంలో అఖిల పక్ష నేతలను తీసుకొని మునుగోడు, దేవరకొండ, మర్రిగూడ మండలం శివన్నగూడెం, ఖుదాభక్ష్ పల్లికి పోయాం. అక్కడ ఫ్లోరోసిస్ బాధితుల పరిస్థితిని చూసి అందరి హృదయం ద్రవించింది. దశాబ్దాలపాటు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల జీవచ్ఛవాలుగా మారిన పరిస్థితి నల్లగొండ బిడ్డలది. కేసీఆర్ 2006, 2007లో ఆ ప్రాంతంలో తిరిగి.. ‘చూడు చూడు నల్లగొండ, గుండె నిండా ఫ్లోరైడ్ బండ’ అని పాటలు రాశారు. ఆనాడు కన్నీళ్లు చూశాం కాబట్టే మిషన్ భగీరథ తీసుకొచ్చాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను అర్థం చేసుకున్నాం.. అధికారంలోకి వచ్చాక పరిష్కరించాం. అందుకే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు.
వ్యాక్సిన్ సర్టిఫికెట్ మీద మోదీ ఫొటో ఎందుకు?. దేశంలో వ్యాక్సిన్లు కొత్తగా ఇస్తున్నామా? స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ అనేక టీకాలు ఉచితంగా ఇస్తున్నాం. గతంలోని ప్రధానులు ఎందుకు వాళ్ల ఫొటోలు పెట్టుకోలేదు. మోదీ ప్రధానమంత్రి కాదు.. కేవలం ప్రచారమంత్రి.
ప్రజలు రెండుసార్లు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని ఒక పనికిమాలినవాడు జర్నలిస్ట్ ముసుగు వేసుకొని అడ్డమైన మాటలు మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ‘ఫ్రీడం ఆఫ్ స్పీచ్’ కాస్తా ‘రైట్ టు అబ్యూజ్’గా మారుతున్నది. మధ్యప్రదేశ్‌లో 25 మంది డిజిటల్ జర్నలిస్టులను పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోయి బట్టలూడదీశారు. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఇంత దిగజారుడు రాజకీయం నా జీవితంలో చూడలేదు.
ఇటీవల కేంద్ర ఐటీ మంత్రి నన్ను పిలిస్తే.. సోషల్ మీడియా హద్దులు దాటుతున్నది, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, రెగ్యులేట్ చేయండి అని కోరాను. సమాజంలో సభ్యతకూ హద్దులు ఉంటాయి. అవి దాటితే ప్రజల దృష్టిలో చులకన అవుతారు.
మసీదులు తవ్వుదాం అంటూ మీ దిక్కుమాలిన రాజకీయం కోసం రాష్ర్టాన్ని రావణకాష్టం చేస్తారా?. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి వాళ్ల ఎమ్మెల్యే ఒకరు జైల్లో పడ్డడు. రేపు ఇంకొకడు పడుతడు. అడ్డిమారి గుడ్డిదెబ్బలాగా ఎంపీ అయినోడివి. పొరపాటున పార్లమెంట్లో పడ్డవ్.. కరీంనగర్ ప్రజలు దాన్ని ఇప్పుడు గ్రహపాటు అనుకుంటున్నరు.
మోదీ అధికారంలోకి వచ్చాక స్విస్‌బ్యాంకుల నుంచి నల్లధనాన్ని వెనక్కి తీసుకురాలేదు. స్విస్ బ్యాంకు రిజర్వులు రెట్టింపు అయ్యాయి.
మునుగోడులో రెండు రోజుల్లో కొత్త డ్రామా మొదలు కాబోతున్నది. దుబ్బాకలో చెయ్యి విరిగినట్టు.. హుజూరాబాద్‌లో కాలు విరిగినట్టు.. కరీంనగర్లో గుండెపోటు వచ్చినట్టు డ్రామాలు ఆడారు. ఇప్పుడు మునుగోడులో అలాంటి నాటకమే రిపీట్ కాబోతున్నది. కోవర్ట్ రాజకీయం, డబ్బులు పనిచేయవని వారికి అర్థమైంది. అందుకే రాజగోపాల్‌రెడ్డి పట్టీతో దర్శనం ఇవ్వబోతున్నారు. సాదుకుంటరా? సంపుకుంటరా? అని కొత్త రాగం ఎత్తుకున్నరు. నియోజకవర్గాన్ని ఇన్నేండ్లు పట్టించుకోకుండా అనాధగా వదిలేసినవాడిని ప్రజలు ఎందుకు సాదుకోవాలి? సాధుజంతువునో, పనికొచ్చే జంతువునో సాదుకుంటరు గానీ డబ్బులున్న, ఖరీదైన వింత జంతువును, క్రూర మృగాలను, పనికిరాని జీవులను ఎవరూ పట్టించుకోరు.