KTR | హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ఐరన్‌లెగ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి పోయి కాంగ్రెస్‌కు గుండుసున్నా తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ పతనాన్ని మహారాష్ట్రలో ప్రారంభించి ఢిల్లీలో ముగించారని, రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని కొనసాగిస్తారని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ దేశంలో బీజేపీని గెలిపిస్తూ వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ దేశంలో నరేంద్రమోదీకి, బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్‌గాంధీయేనని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి మోసగాళ్లంతా వెళ్లిపోయారని, ఇప్పుడు నికార్సైన కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఉన్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు వ్యాఖ్యానించారు.
అధికారం కోసం పార్టీలు మారే అవకాశవాదుల గురించి మాట్లాడాల్సిన, ఆలోచించాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా తమ పార్టీతో కలిసి నడిచేందుకు ముందుకొచ్చిన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అని పేర్కొన్నారు. తెలంగాణ సమాజం,అభివృద్ధి, భవిష్యత్తు గురించి తామిద్దరి ఆలోచనలు దాదాపు ఒకేరకంగా ఉన్నాయని అన్నారు. సంవత్సరంలోపే కాంగ్రెస్ పార్టీ దగాకోరు నైజాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారని చెప్పారు.
తెలంగాణ ప్రజలు తిడుతున్న తిట్లు రేవంత్‌రెడ్డి వింటే తట్టుకోలేరని, ప్రభుత్వంపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారని, కాంగ్రెస్ నేతలు నాయకులు ప్రజల్లోకి వెళ్తే కొడతారని అన్నారు. తమకు అధికారం లేకపోయినా, అర్ధ రూపాయి డబ్బులు ఇవ్వకపోయినా, 400 కిలోమీటర్లు కేసీఆర్ మీద ప్రేమతో హైదరాబాద్ వచ్చిన సోదర సోదరీమణులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమని అన్నారు.
అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బుల చాటుకు వెళ్తాడని.. కేసీఆర్ తప్పకుండా తిరిగి ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణభవన్‌లో శనివారం వేర్వేరుగా నిర్వహించిన సిర్పూర్ కాగజ్‌నగర్, వికారాబాద్ నియోజకవర్గాల పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, నాగేందర్‌గౌడ్, శుభప్రద్‌పటేల్‌తో కలిసి కేటీఆర్ మాట్లాడారు.
ప్రజలు తిడుతున్న తిట్లకి రేవంత్‌రెడ్డి కాకుండా మరొకరు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారని తెలిపారు. ఇంత దుర్మార్గమైన పాలన చేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఏమున్నదో ఆలోచించుకోవాలని అన్నారు. తెలంగాణ నలుమూలలా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని చెప్పారు.
కొడంగల్‌లోని ఒక ఊరికి 140 ఎకరాల భూముల కోసం 450 మంది పోలీసులను సీఎం రేవంత్‌రెడ్డి పంపించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో పేదవాళ్ల ఇండ్లను, ఉపాధి కల్పిస్తున్న దుకాణాలను ఈ ప్రభుత్వం కూల్చుతున్నదని మండిపడ్డారు. పదేండ్లపాటు తెలంగాణలో పేదవాళ్ల గురించి ఆలోచించి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ అమలుచేశారని గుర్తుచేశారు. ‘సిర్పూర్ కాగజ్‌నగర్‌తో నాకు వ్యక్తిగతంగా అనుబంధం ఉన్నది. 2009లో శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో పది సీట్లు మాత్రమే టీఆర్ఎస్ గెలవగా.. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో కూడా గులాబీ జెండా ఎగిరింది. కాగజ్‌నగర్ పేపర్ మిల్లును తెరిపించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేసిన. ముంబై, కలకత్తా వంటి అనేక ప్రాంతాల్లో పర్యటించి పలు కంపెనీలను కలిసి జేకేతో మాట్లాడి పేపర్ మిల్లును తిరిగి ప్రారంభించుకున్నం’ అని కేటీఆర్ గుర్తుచేశారు.
ఎనిమిది మంది చొప్పున కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచారని, కానీ వారు రాష్ర్టానికి తెచ్చింది శూన్యమని కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పినా.. ఒక కాంగ్రెస్, బీజేపీ కూడా ఎంపీ నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్‌సభలో గులాబీ దండు ఉండుంటే కేంద్రంతో కొట్లాడేదని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గురుకులబాట పట్టడంతో ప్రభుత్వం వాటి పరిస్థితులపై స్పందించిందని చెప్పారు. కానీ, గురుకులాల పరిస్థితులు ఇంకా మారలేదని, విద్యార్థుల ఆత్మహత్యలు, అధ్వాన పరిస్థితులు అట్లాగే కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు కృషిచేయాలని పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్‌రెడ్డి సూచనలతోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ సభ నడిపిస్తున్నారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఫుట్‌బాల్ ఆడుతున్నామని తెలిపారు. 100శాతం రుణమాఫీ జరిగిందని ఏ ఒక ఊర్లోనైనా రైతులు చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీలోనే చెప్పానని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నానని, 25 శాతం కూడా రాష్ట్రంలో రుణమాఫీ కాలేదని స్పష్టంచేశారు. అందుకే తెలంగాణ వ్యాప్తంగా రైతులంతా రేవంత్‌రెడ్డిని పొట్టుపొట్టు తిడుతున్నారని, సెక్యూరిటీ లేకుండా ఆయన గ్రామాలకు పోతే రైతులు దంచి కొట్టేలాగా ఉన్నారని చెప్పారు.
పట్నం మహేందర్‌రెడ్డి వెన్నుపోటు కారణంగానే వికారాబాద్‌లో ఎమ్మెల్యేగా మెతుకు ఆనంద్ ఓడిపోయారని కేటీఆర్ పేర్కొన్నారు. మోసగాళ్లంతా పార్టీ నుంచి వెళ్లిపోయారని, ఇప్పుడు నికార్సైన కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఉన్నారని చెప్పారు. మెతుకు ఆనంద్ నిజాయితీగల వ్యక్తి అని, అవినీతి మురికి అంటనివారని అన్నారు. రెండుసార్లు గెలిపించిన వికారాబాద్ ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్న బీఆర్ఎస్ చేసిందని, వికారాబాద్ జిల్లా కావాలనే ఐదు దశాబ్దాల కలను నిజం చేశామని గుర్తుచేశారు. వికారాబాద్‌కు ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజ్ ఇచ్చింది కేసీఆరేనని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90 శాతం పూర్తయిందని, కాంగ్రెస్ నాయకుల వేసిన కేసుల వల్లే కొన్ని పనులు మిగిలిపోయాయని విమర్శించారు. నార్లాపూర్ దగ్గర ఒక పంపును కేసీఆర్ ప్రారంభించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వికారాబాద్ గ్రామాలకు సాగునీరు అందుతున్నదని, కాంగ్రెస్ నాయకులతో అది సాధ్యం కాదని, వాళ్లు కమిషన్ వచ్చే పనులు మాత్రమే చేస్తారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలోని మంత్రులు అందిన కాడికి దోచుకుంటూనే ఉన్నారని, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ని సమూలంగా నాశనం చేశారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్‌తో పెద్ద ఆసాములే కాదు సామాన్య జనం కూడా లాభపడతారని తెలిపారు.
ఆరు గ్యారెంటీలని అడ్డమైన హామీలు ఇచ్చి రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పుణ్యాన మరో 15 ఏండ్ల వరకు తెలంగాణలో ఓట్లు అడిగే పరిస్థితిలో కాంగ్రెస్‌కు ఉండదని చెప్పారు. మరో 10-15 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఆరు జెట్పీడీసీ స్థానాల్లో గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇస్తామని చెప్పారు. టికెట్ ఎవరికి వచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసే గులాబీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్కు అనుకూలమైన వాతావరణం ఉన్నదని చెప్పారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల గుండెల్లో ఉన్నదని చెప్పారు. వికారాబాద్ నియోజకవర్గంలోని ఆరు మండలాలు, ఒక మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరేసి మన సత్తా చూపించాలని సూచించారు. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని గెలుపు గుర్రాలకు టికెట్ ఇచ్చేలా మెతుకు ఆనంద్ చూడాలని, అసంతృప్తులను బుజ్జగించాలని దిశానిర్దేశం చేశారు. వికారాబాద్ జిల్లా పరిషత్, అన్ని మండల పరిషత్‌ల మీద గులాబీ జెండా ఎగరవేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.