కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు ఆడబిడ్డలకు రూ.2,500, రైతుబంధు రూ.15 వేలు ఇవ్వాలని అడిగితే పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటున్నడు రేవంత్‌రెడ్డి. అవ్వాతాతలకు రూ.4 వేలు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు అంటివి! ఆడబిడ్డలకు స్కూటీలంటివి! 2 లక్షల ఉద్యోగాలంటివి! నెలకు 4 వేల నిరుద్యోగ భృతి అంటివి! తులం బంగారం అంటివి! ఇప్పుడు ఆడబిడ్డల మెడలో పుస్తెలతాడు ఎత్తుకుపోయే పరిస్థితి తెస్తివి!
-కేటీఆర్
హనుమకొండ, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో మార్పు మొదలైందని, కాంగ్రెస్‌పై తెలంగాణ అంతటా తిరుగుబాటు ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, రెండేండ్లలోనే తిరగబడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. రెండేండ్లలో రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన దొంగ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాలు బయట పెట్టగానే కొందరు మొరుగుతున్నారని, ఒక మీడియా సమావేశానికే వణికిపోతున్నారని ఎద్దేవాచేశారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డిని, అన్ని భాషల్లో తిట్టగలిగే శక్తి తనకు ఉన్నదని చెప్పారు. ముఖ్యమంత్రి అనే పదవికి గౌరవం ఇచ్చి ఓపిక పడుతున్నామని చెప్పారు.
మహబూబాబాద్‌లో గెలిచిన బీఆర్ఎస్ మద్దతు సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లతో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ మాట్లాడారు. ‘72 ఏండ్ల పెద్దమనిషి, తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రజలు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న వ్యక్తి.. ఇలాంటి వ్యక్తి విషయంలో ఏం మాటలవి? దుర్మార్గం కాకపోతే.. ఓసారి కాలు విరిగిందని ఆనందం. ఇంకోసారి ఆయన చచ్చిపోవాలని శాపనార్థాలు.. ఇది మంచి పద్ధతేనా? మాకు మాటలు రావా? బూతులు రావా? రేవంత్‌రెడ్డీ.. నీకు ఒకటే భాష వచ్చు. నువ్వు ఒకటే భాషలో తిడుతవు. నేను గట్టిగా అనుకుంటే మూడు భాషల్లో తిడుతా. హిందీ, ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలో కూడా తిడుతా. ఇక్కడి లంబాడీ భాష కూడా నేర్చుకొని తిడుతా.

నీ కన్నా ఎక్కువ భాషలు, తిట్లు వచ్చు. కానీ మా అమ్మానాయిన మంచి సంస్కారంతో పెంచిండ్రు. నిన్ను ఎట్ల పెంచిండ్రో నాకు తెల్వది. ఏం మాటలవి? ఏం భాష అది? నేను గుంటూరులో చదువుకున్నా అంటడు. అవును.. నేను గుంటూరులో చదువుకున్న. ఇది తప్పయితే భీమవరం నుంచి అల్లుడిని తెచ్చుకున్నావని మేం ఏమన్నా అన్నమా? అది మీ వ్యక్తిగతం. మీ కుటుంబ సభ్యులను ఎన్నడూ ఏమీ అనం. అది మా సంస్కారం’ అని విరుచుకుపడ్డారు. ‘దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణను నంబర్‌వన్ రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్దిండ్రు. బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణను అప్పజెప్తే ప్రభుత్వం నడుప చేతగాక గుడ్లు పీకి గోటీలాడుతానంటవు.. పేగులు మెడలో వేసుకుంటానంటవు. ఇదేనా నీ సంస్కారం?’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండేండ్లుగా మోసపు పాలన చేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. ‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంట్, కాళేళ్వరం రూపంలో గోదావరి నీళ్లు తెచ్చిండు. కాంగ్రెస్ గతంలో తవ్వి వదిలిపెడితే తుమ్మచెట్లు మొలిచిన కాలువల్లో కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు పారించిండు. డోర్నకల్, తుంగతుర్తి, నెల్లికుదురు, కేసముద్రం ప్రాంతాలకు కాళేశ్వరం నీళ్లు అందించిండు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మీరు దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు పదకొండుసార్లు రైతుబంధు వేసిండు.
70 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.73 వేల కోట్ల రైతు బంధు జమ చేసిన ఘనత కేసీఆర్‌ది. నాటువేసే టైమ్ వచ్చిందంటే రైతుల ఫోన్లలో టింగ్టింగ్ మంటూ రైతుబంధు పడేది. ఈ రోజు ఆ పరిస్థితి ఉన్నదా? ఈసారి ఏస్తడో, ఎయ్యడో, ఏమైతదోనని రైతులు ఆందోళన చెందుతున్నరు. రెండేండ్లలో రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన దొంగ రేవంత్‌రెడ్డి. కేసీఆర్ రైతుబంధు కింద రూ.10 వేలు ఇస్తే.. రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది. కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకోవడం లేదని, వారికి కూడా రైతుబంధు ఇస్తామని రేవంత్ మాయమాటలు చెప్పిండు. అన్ని హామీలను వంద రోజుల్లోనే అమలు చేస్తానన్నడు. కేసీఆర్ రైతు కూలీలను పట్టించుకోలేదని, జాబ్‌కార్డు ఉంటే ఒక్కొక్కరికి నెలకు రూ.వెయ్యి ఆత్మీయ భరోసా ఇస్తానని మాటిచ్చిండు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు అదనంగా తులం బంగారం ఇస్తానని మోసపు మాటలు చెప్పిండు. కేసీఆర్ 2 వేల ఆసరా పింఛను ఇస్తున్నారని.. కాంగ్రెస్ వస్తే ఇంట్లో ఉండే ఇద్దరికి రూ.4 వేల చొప్పున పింఛన్ ఇస్తామన్నడు. ఒకదానికి సోనియమ్మ మీద ఒట్టు, ఇంకోదానికి ప్రియాంకగాంధీ మీద ఒట్టు, మరో కార్యక్రమానికి రాహుల్‌గాంధీ మీద ఒట్టు పెట్టిండు. కాంగ్రెసోళ్లు అడ్డమైన మాటలు చెప్పి అరచేతిలో వైకుంఠాన్ని చూపించి గద్దెనెక్కిండ్రు. రెండేండ్లయింది. హామీల అమలు చేయకుండా ఏం చేశారని అడుగుతున్నా? మన ధనమంతా ఎక్కడికి పోతున్నది? ఢిల్లీకి పోతున్నది’ అని దుయ్యబట్టారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని, కాంగ్రెస్ వచ్చాక అన్ని రకాలుగా వెనుకబడ్డాయని కేటీఆర్ వాపోయారు. ‘సర్పంచ్‌లపై స్థానిక ఎమ్మెల్యేల ఒత్తిడి ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వం, పంచాయతీలకు పైసలివ్వమని బెదిరిస్తరు. పంచాయతీలకు వచ్చే నిధులు ఎవరబ్బ, ఎవరి అత్త సొమ్మో కాదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా రాష్ర్టానికి ముఖ్యమంత్రి ఎట్లనో పంచాయతీలకు సర్పంచులూ అంతే. సర్పంచ్‌లను కాదని ఎవరూ ఏం చేయలేదు. ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ అడ్డువచ్చే ప్రయత్నం చేసినా చెల్లదు.
ఫైనాన్స్ కమిషన్ ఢిల్లీలో రూపాయి విడుదల చేస్తే 85 పైసలు నేరుగా పంచాయతీ అకౌంట్లోకి వస్తయి. 85 పైసలు డైరెక్ట్‌గా మీ ఖాతాలకు రావాలి. 10 పైసలు మండల పరిషత్‌కు, 5 పైసలు జిల్లా పరిషత్‌కు పోవాలి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే మరో రూపాయి పల్లెప్రగతి నిధుల రూపంలో నెలనెలా జీతం వచ్చినట్టు మంజూరు చేసిండ్రు. కొత్తగా గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఇక్కడి బంజారాబిడ్డలు ఆలోచించాలి. మా తండాల్లో మా రాజ్యం ఉండాలనే నినాదాన్ని కేసీఆర్ సాకారం చేసిండ్రు. 3,400 గిరిజన గూడేలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిండ్రు. ఎస్టీల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిండ్రు.
నేను 2009లో కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఎండకాలంలో గ్రామాల్లోకి వెళ్లాలంటే భయపడేది. జనం నీళ్ల కోసం బిందెలు, కుండలు అడ్డం పెట్టేది. మాకు బోరు కావాలె, మోటరు కావాలె, నీళ్లు కావాలె అని నిరసనలు ఎదురయ్యేవి. కేసీఆర్ అన్ని గ్రామాలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దిండ్రు. పంచాయతీరాజ్ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్‌రావు, మున్సిపల్ మంత్రిగా నేను పని చేసినం. దేశంలోని 3 శాతం జనాభా ఉండే తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో 30 శాతానికిపైగా వచ్చినయి. కేసీఆర్ మార్గదర్శనంలోనే ఇదంతా సాధ్యమైంది. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో అంతా ఆగమైంది. ట్రాక్టర్లలో డీజిల్ పోసే నాథుడే లేడు. ట్యాంకర్లలో నీళ్లు పోసేవాడు లేడు.. బుగ్గ తీసేవాడు లేడు. ఎక్కడికక్కడే పిచ్చిచెట్లు మొలిచి పారిశుధ్యం ఆగమైంది. బీఆర్ఎస్ సర్పంచ్‌లు కథానాయకులై మిగతా సర్పంచ్‌లు, కాంగ్రెసోళ్లు, ముఖ్యమంత్రికి బుద్ధి వచ్చేలా పని చేయాలి’ అని సూచించారు.
తెలంగాణలోని మహానుభావుడు నూకల రామచంద్రారెడ్డిని కాంగ్రెస్ మరిచిపోయిందని కేటీఆర్ విమర్శించారు. నూకల రామచంద్రారెడ్డి నికార్సయిన తెలంగాణవాది అని, ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. 1970లోనే ముఖ్యమంత్రి కావాల్సిన స్థాయిలో ఉండేవారని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి డబ్బులు ఇవ్వకపోవడం వల్లే ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయారని తెలిపారు. ‘మహబాబాబాద్ జిల్లా కలెక్టరేట్ పెట్టి ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు రామచంద్రారెడ్డి విగ్రహం ఏర్పాటు చేసేలా కేసీఆర్ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈరోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్టు తెలిసింది. ఆవిష్కరించే వారిలో రామసహాయం సురేందర్‌రెడ్డి మంచోడే.. ఢిల్లీకి మూటలు మోసే కాంగ్రెస్ సన్నాసులు కొందరు వచ్చి ఈ రోజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నరు.
రామచంద్రారెడ్డి ఎక్కడ.. ఇక్కడ ఉన్న సన్నాసి రేవంత్‌రెడ్డి ఎక్కడ? ఢిల్లీకి సంచులు, చెప్పులు మోసే గులాంగాళ్లు ఈ రోజు రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే ఆయన ఆత్మ క్షోభిస్తది’ అని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, డీఎస్ రెడ్యానాయక్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ శంకర్‌నాయక్, హరిప్రియానాయక్, జడ్పీ మాజీ చైర్మన్ బిందు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, నవీన్‌రావు, ఎర్రం తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో 45 శాతం మంది సర్పంచులుగా గెలిచారని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ మద్దతుతో వీరోచితంగా పోరాడి గెలిచిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులకు అభినందనలు తెలిపారు. ‘ఊరిలో వంద, రెండొందల మంది గట్టిగా పట్టుబడితే తప్ప సర్పంచ్‌గా, ఉప సర్పంచ్‌గా గెలువలేరు. గెలిచేది ఒక్కరే కానీ గెలిపించేది ఎంతోమంది. సర్పంచ్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తయి. మూడు, నాలుగేండ్లు ఉంది కదా అని, వారికే ఓట్లు వేస్తే ఏమైనా పనులు జరుగుతాయన్న ఆలోచన ప్రజల్లో ఉంటది. తెలంగాణలో అందుకు భిన్నంగా ఎన్నికలు జరిగినయ్. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తిమ్మిని బమ్మిని చేసేందుకు ప్రయత్నించినా మనం ఎన్నో సీట్లు గెలిచినం.. రాష్ట్రంలో 45 శాతం సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది’ అని చెప్పారు.
ప్రజల్లో మార్పు వచ్చిందని, రాష్ట్ర వ్యాప్తంగా మార్పు ఆనే ఆలోచన మొదలైందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేండ్లలోనే ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని హెచ్చరించారు. ‘పాలిచ్చే బర్రెను కాదనుకొని తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నరు. ఇదర్ హై కార్.. ఉదర్ సబ్ బేకార్. మన కార్యకర్తలు పోయిన శాసనసభ ఎన్నికల్లో కొద్దిగా డీలా పడ్డరు. ఇక్కడ పోతే ఒక్క సీటు పోతది.. మా కేసీఆర్ ఉంటడు అని మహబూబాబాద్, డోర్నకల్ ప్రజలు అనుకున్నరు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తు మీద ఎవరు వచ్చినా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ మళ్లీ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో అందరం పని చేద్దాం. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్లలోనే కేసీఆర్‌ను చూడాలె. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే కారు గుర్తుతో ఎవరు మీ ముందుకు వస్తారో వారిని గెలిపించాలి’ అని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అందరినీ ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు తిరుగబడుతున్నారని, లగచర్ల స్ఫూర్తితోనే ఇది మొదలైందని కేటీఆర్ చెప్పారు. ‘పెద్దపెద్ద నాయకులు కొంతమంది భయపడి పార్టీలు మారిండ్రు. గెలిచిన తర్వాత కడియం శ్రీహరి పార్టీ మారిండ్రు. గ్రామస్థాయిలో ఉండే నాయకులు కథానాయకులై ఒక్కొక్కరూ ఒక కేసీఆర్ తరహాలో రెండేండ్లుగా అద్భుతంగా కొట్లాడుతున్నరు. లగచర్ల గురించి రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్ పెడుదామని ఆలోచన చేస్తే సత్యవతిరాథోడ్, కవిత, శంకర్‌నాయక్ గిరిజనుల అడ్డా ఇది.. మీరు ఇక్కడికే రావాలని అంటే మహబూబాబాద్ దద్దరిల్లిపోయేలా అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నం. ప్రజల పోరాటం దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేసింది. జైళ్లలో పెట్టిన గిరిజన బిడ్డలను వదిలి పెట్టింది. ఇప్పటి ఎన్నికల తర్వాత మున్సిపాలిటీ, జిల్లా, మండల పరిషత్‌లు సెమీఫైనల్.. 2028 అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్. తెలంగాణకు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నరు’ అని తెలిపారు.

బీఆర్ఎస్ మద్దతుతో వీరోచితంగా పోరాడి గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు అభినందనలు. అధికార పార్టీ కుట్రలు, ఆగడాలు, అరాచకాలు, మంత్రులు, ముఖ్యమంత్రి.. డబ్బులు, ఇవన్నీ ఎదుర్కొని వీరోచితంగా పోరాడి గెలిచిండ్రు. గెలిచినవారికి, గెలిపించినవారికి.. ఒకట్రెండు, పది, యాభై ఓట్లతో ఓడిపోయినవారికీ అభినందనలు.
-కేటీఆర్
రేవంత్‌రెడ్డి అడ్డిమార్ గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయిండు. సీఎం అయినంక సంతోషంగా ఉండొచ్చు. కానీ, తెల్లారిలేస్తే కేసీఆర్‌ను తిట్టుడు తప్ప చేసిందేమీ లేదు. రెండేండ్ల నుంచి రేవంత్‌రెడ్డి టైంపాస్ ప్రోగ్రాంలు చేస్తున్నడు. హామీలు అమలు చేయడం చేతగాక కొన్నిరోజులు కాళేశ్వరం, కొన్నిరోజులు ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా-ఈ రేస్ అనుకుంట డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నడు.
-కేటీఆర్
సర్పంచ్ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ తిమ్మిని బమ్మిని చేసేందుకు ప్రయత్నించింది. మనం ఎన్నో సీట్లు గెలిచినం. ఒక్క ఓటు, పది ఓట్లు.. ఇలా తక్కువ ఓట్ల తేడా ఉన్న చోట్ల ఫలితాలను మార్చి కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినట్టు ప్రకటించుకున్నరు. ఒకట్రెండు కాదు తెలంగాణ మొత్తం వెయ్యి, 1500 గ్రామాల్లో ఇట్లనే చేసిండ్రు. కాంగ్రెస్ ఇట్ల చేసినవి కలుపుకొంటే రాష్ట్రంలో 45 శాతం సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది.
-కేటీఆర్
ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తు మీద ఎవరు వచ్చినా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలె. కేసీఆర్ మళ్లీ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో అందరం పనిచేద్దాం. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్లలోనే కేసీఆర్‌ను చూడాలె. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే కారు గుర్తుతో ఎవరు మీ ముందుకు వస్తారో వారినే గెలిపించాలె.
-కేటీఆర్