హైదరాబాద్, మార్చి 22 (నమస్తేతెలంగాణ): ‘ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లీ (బీ) గ్రామానికి చెందిన గణపతిది ఆత్మహత్య కాదు..ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కార్ హత్యే’నని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులుచెరిగారు. రైతుభరోసా రాక, పంట రుణం మాఫీకాక, పం డించిన పంట కొనే దిక్కులేక, అప్పులు పెరిగి, తీర్చే దారిలేక గణపతి బలవన్మరణానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.
నిరుడు నవంబర్ 17న గణపతి మీడియాతో తన కష్టాలు చెప్పుకొని కన్నీటిపర్యంతమయ్యాడని గుర్తుచేశారు. నవంబర్ 18న ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ సందర్శన సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నేతలు తన దృష్టికి తెచ్చారని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేటీఆర్ ఆదివారం ఎక్స్‌లో పోస్ట్‌చేశారు. కౌలుకు తీసుకొని, అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి సోయాబీన్ పండిస్తే కొనేదిక్కులేదని చెప్తూ గణపతి వెక్కివెక్కి ఏడుస్తూ తనకు చావు తప్ప మరో మార్గంలేదని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.
నాడు చెప్పినట్టే నాలుగు రోజుల క్రితం ప్రాణాలు విడువడం కలిచివేసిందని వాపోయారు. సర్కార్ వైఫల్యమే ఆయన మరణానికి కారణమని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ రైతుబంధు పాలన పోయి కాంగ్రెస్ రాబందుల పాలన వచ్చిందని విరుచుకుపడ్డారు. పంటల సమయానికి పెట్టుబడి సాయం అందక మళ్లీ అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, యూరియా దొరక్క అష్టకష్టాలు పడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి గణపతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.