కేటీఆర్కు కృతజ్ఞతలుగంభీరావుపేట, ఆగస్టు 30: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు మత్తడి నుంచి బోదర్ కాలువ ద్వారా నమాజ్ చెరువుకు నీళ్లొస్తున్నాయి. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సొంత ఖర్చులతో కాలువ మరమ్మతులు చేయించి సాగునీరు అందించడంతో ఆయకట్టు రైతులు సంబురపడుతున్నారు. కేటీఆర్కు రుణపడి ఉంటామంటూ ప్రత్యేక కృజ్ఞతలు తెలుపుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ వాగు ద్వారా వానకాలంలో నర్మాల ఎగువ ప్రాజెక్టుకు వరద వచ్చేది. ప్రాజెక్టు మత్తడి దుంకిన క్రమంలో గొలుసుకట్టు చెరువులకు బోదర్ కాలువ ద్వారా నీరు వచ్చేది. కాలువలో పెద్దఎత్తున చెత్తాచెదారం, పూడిక పేరుకుపోవడంతోపాటు అడ్డుగా పైపులు ఉండటంతో మండల కేంద్రంలోని నమాజ్ చెరువుకు సాగునీరు రావడం లేదు.
సమస్యను పరిష్కరించి సాగునీరందించాలని ఆయకట్టు రైతులు పలుమార్లు ఇరిగేషన్ అధికాలను విన్నవించినా పట్టించుకోలేదు. ఇటీవల నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు ఈ విషయం మాజీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కేటీఆర్ సొంత ఖర్చులతో ఎక్స్కవేటర్ను పంపించి బోదర్ కాలువలో చెత్తాచెదారం, అడ్డుగా ఉన్న పైపులు, చెట్లు, పూడికను తీయించారు. దీంతో ఎగువమానేరు నుంచి కాలువ ద్వారా నమాజ్ చెరువుకు వరద నీరు చేరడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం కాలువ మరమ్మతు పనులను నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.