హైదరాబాద్: ప్రపంచంలోని టాప్ 30 నగరాల్లో హైదరాబాద్‌ను ఒకటిగా ఉంచడమే తమ లక్ష్యమని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పట్టణాలు, నగరాల్లో సమ్మిళిత, సమీకృత అభివృద్ధే ధ్యేయంగా ముందుకు పోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో పట్టణాలు, నగరాలకు ఆర్థిక వనరులు, మానవ వనరులను సమకూరుస్తున్నామని, మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. పట్టణాలకు ప్రతి నెలా పట్టణ ప్రగతి కింద నిధులను విడుదల చేస్తున్నామని తెలిపారు. నానక్‌రాంగూడలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, మున్సిపల్ శాఖలో సమ్మిళితమైన – సమీకృత అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని, రాష్ట్రంలో మరికొన్ని నగరాలను స్మార్ట్ సిటీల కింద చేర్చాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. హైదరాబాద్ నగరం రోడ్లు బాగుండాలనే ఉద్దేశంతో సీఆర్ఎంపీ కింద తీసుకున్నామని, హైదరాబాద్ నగర పరిస్థితి, ఇమేజ్ రోడ్ల నాణ్యత మీద ఆధారపడి ఉంటుందన్నారు.
50 వేల జనాభా ఉన్న పట్టణాల్లో రెండు వార్డులకు కలిపి ఒక అధికారి, 50వేలకు పైగా జనాభా ఉన్న పట్టణాలు, నగరాల్లో వార్డుకు ఒక అధికారిని నియమించనున్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. వచ్చే సంక్రాంతి కల్లా 100 శాతం మురుగు నీటి వ్యర్థాలను శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ దేశంలోనే గుర్తింపు పొందుతుందన్నారు. హైదరాబాద్‌లో భవిష్యత్ తరాలకు ఎలాంటి నీటి కొరత లేకుండా సుంకిశాల వద్ద రూ.1450కోట్ల వ్యయంతో ఇంటెక్వెల్ పనులను ప్రారంభించామని తెలిపారు.
టీయూఎఫ్ఐడీసీ ద్వారా పట్టణాలకు నాలుగు వేల కోట్లను కేటాయించామని పేర్కొన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని పది పట్టణాలను గుర్తించి రూ.2410 కోట్లతో 104 రోడ్లను వేయనున్నట్లు చెప్పారు. దీని ద్వారా హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లోనూ రోడ్లు మెరుగుపడుతాయని తెలిపారు. టీఎస్‌బీపాస్ ద్వారా 1.15 లక్షల కంటే ఎక్కువ దరఖాస్తులను పరిష్కరించామన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీలో రూ.3500కోట్ల విలువైన టీడీఆర్ ధృవపత్రాలను జారీ చేసిందన్నారు.
స్థిరాస్తి రంగంలో ముందుకు..
హైదరాబాద్ నగరం దేశంలో స్థిరాస్తి రంగంలో ఎంతో ముందుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 2021లో నివాస రంగంలో 142 శాతం క్రయ విక్రయాలు జరిగాయని వెల్లడించారు. నైట్ ఫ్రాంక్ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం దేశంలోని ఎనిమిది మెట్రో నగరాల్లో 2014 నుంచి వరుసగా ఒక్క ఏడాది కూడా స్థిరాస్తి ధర తగ్గని ఒకే ఒక్క మెట్రో నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందిందని ఆయన వెల్లడించారు. హౌసింగ్ ఇన్వెంటరీ ఓవర్హ్యాంగ్లో 2021లోని మొదటి త్రైమాసికంలో 53 నెలల నుంచి 2022 లో అదే కాలంలో 27 నెలలకు తగ్గిందన్నారు. అనరాక్ అనే మరో సంస్థ నివేదిక ప్రకారం దేశంలోని సర్వోన్నత ఏడు మెట్రో నగరాల్లో చదరపు అడుగుకు రూ.4,450 రేటుతో హైదరాబాద్ అత్యంత సరసమైన నివాస నగరంగా ఉందన్నారు. కమర్షియల్ స్పేస్‌లో గత సంవత్సరంలో బెంగళూరును వెనక్కి నెట్టి హైదరాబాద్ ముందు నిలిచిందన్నారు.
కేంద్రం పాదర్శకంగా ఉంటే మరిన్ని అవార్డులు
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో భాగంగా 2021 లో తెలంగాణకు 12 అవార్డులు వచ్చాయని, ప్రస్తుత సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి అవార్డులు ఇస్తే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ సంఖ్యలో అవార్డులు వస్తాయని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి స్వనిధిలో వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. పట్టణాలు, నగరాల, జనాభా వారీ కేటగిరీల్లో రాష్ట్ర పట్టణాల్లో టాప్ 10కి పది మనవే ఉన్నాయన్నారు. రాష్ట్రానికి దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా అవార్డులు లభిస్తున్నాయన్నారు. లివింగ్ , ఇన్ క్లూజివ్ శ్రేణి అవార్డు కింద స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్‌లో రెండు పడకల గృహ నిర్మాణ పథకం ఫైనలిస్ట్‌గా ఎంపికైందని వెల్లడించారు. అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ 21 కిలోమీటర్ల పరిధిలో సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటుచేస్తామని, దీనికి త్వరలోనే శంకుస్థాపన చేసి 9 నెలల్లో పూర్తి చేస్తామన్నారు.
మున్సిపల్ శాఖది థాంక్ లెస్ జాబ్…
ఐటీ శాఖ గ్లామరస్ జాబ్ అని, కానీ, మున్సిపల్ శాఖది మాత్రం థాంక్‌లెస్ జాబ్ అంటూ మంత్రి కే తారక రామారావు వ్యాఖ్యానించారు. మున్సిపల్ శాఖలో పనిచేయకుంటే అందరు విమర్శిస్తారని, పనిచేస్తే మాత్రం ఒక్కరు కూడా అభినందించరన్నారు. మున్సిపల్ శాఖలో అధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు నిత్యం పనిచేస్తున్నారని, వారందరినీ అభిందిస్తున్నానని చెప్పారు. వారందరూ పనిచేయడం వల్లే నగరాలు, పట్టణాలు బాగా ఉన్నాయన్నారు. పట్టణ ప్రగతి కింద పట్టణాలు, నగరాలకు రూ.3700కోట్లకు పైగా విడుదల చేశామన్నారు. రు.
2015-21 వరకు అత్యుత్తమ నగరం హైదరాబాద్
అంతర్జాతీయ సంస్థ మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో 2015 నుంచి 2021 వరకు భారతదేశంలోని అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ను నిర్ణయించిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మౌలిక వసతుల్లో హైదరాబాద్ దేశంలోనే ముందుందని తెలిపారు. దేశంలో పట్టణ జనాభాలో తమిళనాడు 48.45 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో కేరళ 47.23 శాతం, తెలంగాణ 46.8శాతంతో మూడో స్థానంలో ఉందని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన నాటికి రాష్ట్రంలో 68 పట్టణాలుండగా ప్రస్తుతం వాటి సంఖ్య 142కు చేరిందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో కేవలం మూడు శాతంలో మాత్రమే పట్టణాలు, నగరాలు ఉండగా, 46 శాతం జనాభా వీటిల్లో ఉంటుందన్నారు.
దీని ద్వారా పట్టణాలపై ఎంత ఒత్తిడి ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, శాఖ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, సీడీఎంఏ ఎన్.సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.