డాలస్: అమెరికాలోని డాలస్‌లో (Dallas) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వైదికైన డాక్టర్ పెప్పర్ ఎరినా ప్రాంగణం గులాబీమయమైంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఒకవైపు బీఆర్ఎస్ (BRS) రజతోత్సవాలు, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను సంబురంగా జరుపుకోనున్నారు. ఆయా వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఇందులో భాగంగా తన రెండు రోజుల లండన్ పర్యటనను ముగించుకున్న కేటీఆర్.. డాలస్ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రాయంలో బీఆర్ఎస్ శ్రేణులు, ఎన్ఆర్ఐలు ఘనంగా స్వాగతం పలికారు. జై కేటీఆర్, జై తెలంగాణ నినాదాలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం మారుమ్రోగింది. పార్టీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డితోటు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శ్రేణులు కేటీఆర్‌కు సాదర స్వాగతం పలికారు. పటిష్ట భద్రత నడుమ ప్రత్యేక కాన్వాయ్‌లో తన విడిదికి చేరుకున్నారు. కాగా, బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా సంయుక్త రాష్ర్టాల్లోని వివిధ నగరాల నుంచి తెలంగాణవాదులు ఇప్పటికే డాలస్ చేరుకున్నారు.
యూఎస్ఏలో అన్ని ప్రాంతాల నుంచి రాక
అమెరికా సంయుక్త రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న తెలంగాణవాదులు డాలస్ నగరానికి చేరుకుంటున్నారు. న్యూజెర్సీ, డెలావేర్, హోస్టన్, టెక్సాస్, కొలంబస్, ఆస్టిన్, ఫ్లోరిడా, శాన్ఫ్రాన్సిస్కో, లాస్ఏంజెల్స్, అష్బుర్మ్, చికాగో, కెంటకీ తదితర నగరాల నుంచి తెలంగాణవాదులు పెద్ద ఎత్తున డాలస్ చేరుకున్నారు. వీరితోపాటు బ్రిటన్, కెనడా, గల్ఫ్ తదితర దేశాల నుంచీ సైతం బీఆర్ఎస్ ఎన్నారై సెల్ ప్రతినిధులు తరలిరానున్నారు. బీఆర్ఎస్ ఎన్నారై విభాగంతోపాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎన్నారైలు, తానా, ఆటా సంస్థల ప్రతినిధులు వేడుకలకు హాజరయ్యేందుకు ఇప్పటికే సంసిద్ధతను ప్రకటించారు. ఈ నేపథ్యంలో సభకు ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేని తెలుగువాళ్లు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఆహ్వానితులకు, వేడుకల్లో భాగస్వాములకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మళ్లీ రగిలిన ఉద్యమస్ఫూర్తి
యూఎస్ఏలోని వివిధ రాష్ర్టాలు, నగరాల్లో మరోసారి తెలంగాణ ఉద్యమస్ఫూర్తి తొణకిసలాడుతున్నది. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ అధినేత కేసీఆర్‌తో మమేకమై ప్రత్యేక రాష్ట్రం కోసం యూఎస్ఏలోని ఆయా ప్రాంతాల్లో పోరాటాల సందర్భంగా నెలకొన్న వాతావరణం పునరావిష్కరణ అవుతున్నది. 2001 నుంచి 2014 దాకా కేసీఆర్ నాయకత్వంలో ఎన్నారైలు తమ స్థాయిల్లో పోరాటంలో భాగస్వాములయ్యారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ జరుగుతున్న పోరాటాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు ఉద్యమించారు. నాడు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై యూఎస్ఏలో బీఆర్ఎస్ ఎన్నారైలు టీడీఎఫ్ ప్రతినిధులతో కలిసి అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, నాటి ప్రధాని మన్మోహన్సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు అమెరికాలో పర్యటించిన సందర్భంలో తెలంగాణవాదులు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తంచేశారు.
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో పాల్గొనేందుకు యూఎస్ వచ్చిన నాటి ప్రధాని మన్మోహన్సింగ్ సహా పలువురిని నిలదీసిన సందర్భాన్ని తెలంగాణ ఎన్నారైలు డాలస్ సభ నేపథ్యంగా గుర్తుచేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పురోభివృద్ధికి పడిన అడుగులు, పదేండ్లు తెలంగాణ సాధించిన ప్రగతిని ఎన్నారైలు నెమరువేసుకుంటున్నారు. అదే సమయంలో ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ పాలనతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అదే స్థాయిలో చర్చించుకోవడం గమనార్హం. తెలంగాణలో దురదృష్టవశాత్తు మళ్లీ ఉమ్మడిపాలన నాటి దుర్భర పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయన్న భావన ఎన్నారైల్లో కనిపిస్తున్నది.