మొయినాబాద్, ఫిబ్రవరి10 : ధర్మరక్షణ కోసం పని చేస్తున్న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి దుర్మార్గమైన చర్య అని, ఇది రాజ్యాంగంపై జరిగిన దాడిగానే భావిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం మాజీ మంత్రులు సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ రాష్ట్ర యువనాయకుడు కార్తిక్‌రెడ్డితో కలిసి రంగరాజన్‌ను కేటీఆర్ పరామర్శించారు. ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్‌ను కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తర్వాత దాడి గురించి రంగరాజన్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రంగరాజన్‌పై దాడి ఎవరు చేసినా ఏ పేరిట చేసినా ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని చెప్పారు.
ఇది హేయమైన చర్య : ఆర్ఎస్పీ
భారత రాజ్యాంగం ప్రకారం ధర్మ ప్రచారం చేస్తున్న చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై అల్లరి మూకలు దాడి చేయడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. రాజ్యాంగ విలువలకు బీఆర్ఎస్ కట్టుబడి ఉన్నదని, ధర్మంపై దాడి చేస్తే రాజ్యాంగ రక్షకులు అడ్డుకుని తీరుతారని చెప్పారు. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైఫల్యం వల్లే జరిగిందని విమర్శించారు. అల్లరి మూకలు ఎవరి ధైర్యం చూసుకొని రంగరాజన్‌పై దాడి చేశారని నిలదీశారు. శాంతి భద్రతలను నియంత్రించడంలో అనర్హుడైన రేవంత్‌రెడ్డి హోంశాఖకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.