KTR | హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అమెరికన్ కంపెనీ ‘టెస్లా’ త్వరలో భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఏదో ఒకచోట తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తుండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
టెస్లా యూనిట్ ఏర్పాటుకు తెలంగాణను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకపోవటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా సహా పలు ఇతర దేశాల్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టెస్లా సంస్థను తెలంగాణకు రప్పించేందుకు ఏమాత్రం ప్రయత్నించని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తుంటే తీవ్ర ఆవేదన కలుగుతున్నదని తెలిపారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన తెలంగాణను టెస్లా తన ప్లాంట్ ఏర్పాటు కోసం పరిగణనలోకి తీసుకోకపోవటం రాష్ట్రానికే తీవ్ర అవమానకరమని కేటీఆర్ పేర్కొన్నారు.