KTR | హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ ): సుంకిశాల గోడ కూలిన ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్య లు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రమాదం జరిగి 10 రోజులు కావొస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కాంట్రాక్టు సంస్థే కారణమైతే దాన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి, ప్రమాదంపై జ్యుడీషియల్ విచారణ వేయాలని ఇప్పటికే కోరినట్టు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన కాంట్రాక్ట్ ఏజెన్సీ మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ సంస్థ పట్ల ఎందుకంత మెతక వైఖరి ప్రదర్శిస్తుందో సమాధానం చెప్పాలని నిలదీశారు.
ఇంజినీర్ల వివరణ కోరిన ఎండీ
సుంకిశాల ఘటనతో జలమండలి మేల్కొ న్నది. సంస్థ ఈడీ డాక్టర్ ఎం సత్యనారాయణ, ఈఎన్సీ వీఎల్ ప్రవీణ్‌కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్‌తో కమిటీ వేస్తూ ఎండీ అశోక్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.నిర్లక్ష్యంగా అధికారుల ను ప్రాథమికంగా గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఘటనకు తమదే బాధ్యత అని ఏజెన్సీ చెప్పినప్పటికీ.. కమిటీ నివేదిక అంటూ సదరు కాంట్రాక్టర్‌పై చర్యల విషయంలో తాత్సరం చేస్తుండడం విమర్శలకు తావిస్తున్నది.
సీసీ కెమెరాల ఏర్పాటుకు సన్నాహాలు
సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం, ప్రమాద ఘటన వెనుక అధికారుల లోపాలను ఎత్తిచూపుతూ ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. గతంలో జలమండలి చేపట్టిన హడ్కో తాగు, మురుగునీటి ప్రాజెక్టు, 21 చోట్ల ఎస్టీపీ పనులు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిగాయి. సీసీ కెమెరాలను ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ సర్వర్‌కు అనుసంధానం చేసి ప్రాజెక్టు డైరెక్టర్, ఎండీలు పర్యవేక్షించారు. సుంకిశాల ప్రాజెక్టు పనుల్లో మాత్రం అధికారులు ఇవేవీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఘటన జరిగిన తర్వాత మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలకు జలమండలి ఉపక్రమించింది. త్వరలోనే సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు.