గద్వాల, సెప్టెంబర్ 13: గద్వాల జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన గద్వాల గర్జన సభ సక్సెస్‌తో బీఆర్ఎస్లో జోష్ కనిపించింది. జిల్లా కేంద్రం ఫ్లెక్సీలు, బ్యానర్లతో గులాబీమయమైంది. సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కి నేడు హామీలను అమలు చేయకపోవడంతో జనం ఇదేం ప్రభుత్వమని ఛీ కొడుతున్నారని అన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు.
కేటీఆర్‌పై ఉన్న అభిమానంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. సభకు కేటీఆర్ వస్తుంటే అడుగడుగునా జనం నీరాజనం పలికారు. గద్వాలకు కేటీఆర్ చేరుకోగానే ముందుగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజయ్‌కుమార్ గజమాలతో స్వాగతం పలికారు. కేటీఆర్ ర్యాలీ రాఘవేంద్ర కాలనీ నుంచి ప్రారంభం కాగా శాట్ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాస్ హనుమంతునాయుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ కేశవ్ ముందుండి నడిపించారు.
ర్యాలీ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులతో రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. అర కిలోమీటర్‌కు పైగా ఉన్న మైదానానికి ర్యాలీ చేరడానికి దాదాపు గంటకుపైగా సమయం పట్టింది. మోటర్ సైకిళ్లు, వాహనాలు, ప్రజలు, కార్యకర్తలు, నాయకులతో పట్టణం కిక్కిరిసిపోయింది. కార్యకర్తలు అడుగడుగునా బీఆర్ఎస్, కేసీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ సభా ప్రాంగణానికి ర్యాలీగా చేరుకున్నారు. సభ నిర్వహించే తేరు మైదానం నాయకులు, అభిమానులతో కిక్కిరిసిపోయింది.
కేటీఆర్ రాకతో గద్వాలలోని అన్ని రహదారులు జనంతో కిక్కిరిసిపోయాయి. సభ కొంత ఆలస్యమైనా సమావేశానికి వచ్చిన ప్రజలు సభ ముగిసేంత వరకు అక్కడి నుంచి కదలలేదు. ఈ సభకు వచ్చిన ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చిన వారే తప్ప వారిని ఎవరూ సభకు తరలించకపోవడం గమనార్హం. కేటీఆర్ వచ్చే వరకు పార్టీ నాయకులు, అభిమానులను కళాకారులు ఆకట్టుకున్నారు. ఆటపాటలతో ప్రజలను ఉత్తేజపరిచారు.