కాటారం, జూలై 27: తండ్రి అనారోగ్యంతో వైద్య విద్యను మధ్యలోనే మానేస్తానని విద్యార్థిని గంట జ్యోత్స్న సోషల్మీడియా ద్వారా తన పరిస్థితిని వివరించగా, మేమున్నామంటూ ఆర్థిక సహాయం అందజేసేందుకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ముందుకొచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా జ్యోత్స్న మెడిసిన్ పూర్తయ్యేంత వరకు ఏటా రూ.రెండు లక్షల సాయం అందిస్తామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సింపేట గ్రామంలోని శ్రీలక్ష్మీసాయి గార్డెన్లో జ్యోత్స్నకు కేటీఆర్ చేతుల మీదుగా రూ.2 లక్షల మొదటి చెక్కును పుట్ట మధు అందజేశారు. తన చదువు ఎక్కడ ఆగిపోతుందోనని బెంగ పెట్టుకున్న తనకు పుట్ట మధు దేవుడిలా వచ్చి సాయం అందించారని జ్యోత్స్న కృతజ్ఞతలు తెలియజేసింది. అనంతరం పుట్ట మధు, జక్కు శ్రీహర్షిణిరాకేశ్, పార్టీ శ్రేణులను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.