ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 23 : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు మత్తడి దూకుతున్న తరుణంలో అక్కడి నుంచి సింగసముద్రానికి వచ్చే కాల్వ పూడికను రైతులే శ్రమదానం చేసితీశారు. సింగసముద్రం చెరువకు వచ్చే కాలువలో పూడిక పేరుకుపోవడంతో ఎగువమానేరు మత్తడి నుంచి దుంకిన నీళ్లు కాలువలోకి రావడంలేదని రైతులు అధికారులకు తెలిపారు.
ఎక్స్కవేటర్ పంపిస్తామని చెప్పి, పంపించకపోవడంతో గొల్లపల్లి, బొప్పాపూర్ గ్రామాల రైతులే శనివారం అక్కడికి వెళ్లి శ్రమదానంతో పూడికతీత పనులకు పూనుకున్నారు. 500 బ్యాగుల మట్టిని కాల్వ మత్తడిపై పోసి, నీటిని సింగ సముద్రం చెరువుకు మళ్లించారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ యువనేతలు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు.