సూర్యాపేట, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఆత్మగౌరవాన్ని ప్రధాని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, శంకర్‌నాయక్, గాదరి కిశోర్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో కలిసి భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి అమ్ముడుపోతే ఉప ఎన్నిక వచ్చిందని అన్నారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం అమ్ముడుపోయి ఆ డబ్బు మదం, అహంకారంతో జనాన్ని తులం బంగారం, 20 వేలకు ఒక ఓటు చొప్పున గొర్రెల మాదిరి కొనుక్కోవచ్చుననే ఉపఎన్నిక తెచ్చాడని మండిపడ్డారు. టీఆర్ఎస్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని పెండింగ్ పనులను పూర్తిచేయించడమే కాకుండా అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానన్నారు. ‘నాలుగేండ్లు మునుగోడుకు వెళ్లలే.. ఒక్క పని చేయలే. కానీ డబ్బులు ఉన్నయి.. తులం బంగారం ఇచ్చైనా ఓటు కొంట అని రాజగోపాల్‌రెడ్డి అనుకొంటున్నడు’ అని విమర్శించారు.
గ్యాస్ సిలిండర్ ధర రూ.400 నుంచి రూ.1200 అయిందని గుర్తుచేశారు. పెట్రోలు ధర రూ.110 అయిందని, డీజిల్ ధర పెంపుతో నిత్యావసరాల ధరలు పెరిగాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. మనిషికి ఇంత అని పడేస్తే తనకే ఓట్లు గుద్దుతరనే అహంభావంతో ఉప ఎన్నిక తెచ్చిన వారికి బుద్ధి చెప్పాలా? వద్దా? అని ప్రశ్నించారు. డబ్బుకో, మందుకో ఓటు వేస్తే సిలిండర్ ధర 4 వేలు అవుతుందని హెచ్చరించారు. ‘ఆ గట్టుమీద సిలిండర్‌ను 4 వేల చేసే మోదీ ఉన్నడు. ఈ గట్టు మీద కల్యాణ లక్ష్మి ఇచ్చి ఆదుకొన్న కేసీఆర్ ఉన్నడు. ఆ గట్టుమీద చేనేతకు 5% జీఎస్టీ తెచ్చిన మోదీ ఉన్నడు. ఈ గట్టుమీద నేత కార్మికులను కడుపులో పెట్టుకొని, నేతన్నమిత్ర, చేనేతకు చేయూ త పథకాలు తెచ్చిన కేసీఆర్ ఉన్నడు. ఆ గట్టుమీద బీజేపీ, కాంగ్రెస్ బేకార్‌గాళ్లు ఉన్నరు. ఈ గట్టు మీద కారు గుర్తు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఉన్నరు. ఎవరు పెద్దోళ్ల కోసమున్నరు.. ఎవరు పేదోళ్ల కోసం ఉన్నరో ఆలోచించుకోవాలి’ అని మంత్రి కేటీఆర్ ప్రజలకు సూచించారు. ‘ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదు.. రెండు భావజాలాల మధ్య, రెండు పార్టీల మధ్యన పోటీ. రాజగోపాల్‌రెడ్డి దగ్గర పాపపు డబ్బున్నది. ఇంటికి తులం బం గారం ఇస్తడట తీసుకోండి. ఓటేసేటప్పుడు మాత్రం తస్మాత్ జాగ్రత్త. నాడు మోదీ జన్‌ధన్ అకౌంట్లు తెరిస్తే రూ.15 లక్షలు ఇస్తనన్నడు. ఆ డబ్బులన్నీ రాజగోపాల్‌రెడ్డి ఖాతాలో పడ్డాయి. వాటిని ఉపఎన్నికలో ఖర్చు చేస్తున్నడు. బీజేపీకి ఓటు వేస్తే ధరలు ఆకాశాన్ని అంటుతాయి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
మునుగోడులో జరుగుతున్నది ధర్మ యుద్ధమని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. 18వేల కోట్లకు అమ్ముడుపోయినోడు మనల్ని కూడా అమ్మేస్తాడని హెచ్చరించారు. అరవై ఏండ్ల బీజేపీ, కాంగ్రెస్ పాలనలో ఆగమైన మునుగోడు.. 2014 తరువాతే అభివృద్ధి రుచి చూసిందని చెప్పారు. నాడు గెలిచిన ప్రభాకర్‌రెడ్డి ప్రతి నిత్యం అందుబాటులో ఉండి పని చేశారని, ఫ్లోరోసిస్ మహమ్మారిని ఆరేండ్లలో రూపుమాపారని వెల్లడించారు. ఇవాళ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మునుగోడులో భూములు కొంటున్నరంటే అందుకు కారణం సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు పెంచడం, స్వచ్ఛమైన తాగునీరు అందించడం, హరితహారంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడమే కారణమని తెలిపారు.