తెలంగాణలో అదానీ వ్యాపార విస్తరణ జరుగుతుంటే కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలియదా? చిన్న కార్పొరేషన్ పదవికి కూడా ఢిల్లీ పర్మిషన్ కావాలె. అలాంటిది అదానీతో ఒప్పందాలకు అధిష్ఠానం పర్మిషన్ లేదని భావించాలా? రోజూ అదానీని విమర్శించే రాహుల్‌గాంధీ ఈ ఒప్పందాలకు మద్దతిస్తున్నారా? లేదా? చెప్పాలి.
– కేటీఆర్
KTR | హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో అదానీని గజదొంగగా అభివర్ణించిన రేవంత్‌రెడ్డి, తెలంగాణలో మాత్రం ఆయనతో దోస్తీ ఎందుకు కట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. అదానీ అవినీతిపరుడు, దుర్మార్గుడు అని రాహుల్‌గాంధీ విమర్శిస్తుంటే అదే పార్టీకి చెందిన సీఎం రేవంత్‌రెడ్డి అదానీ సంస్థలతో రూ.12,400 కోట్ల ఒప్పందాలు కుదుర్చు కోవడంలో మతలబు ఏమిటి? అని ప్రశ్నించారు. కేసీఆర్ పదేండ్లలో సృష్టించిన తెలంగాణ సంపదను క్రోనీ క్యాపిటలిస్టులు దోచుకునేలా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదానీపై అమెరికా కోర్టు అరెస్టు వారెంట్ జారీచేయగానే, చిన్న దేశమైన కెన్యా అదానీతో జరిగిన ఒప్పందాలన్నీ రద్దు చేసుకున్నదని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అదానీ సంస్థల ఒప్పందాలను రద్దు చేసుకోవడంతోపాటు అదానీ స్కిల్ వర్సిటీకి ఇచ్చిన రూ.100 కోట్లను కూడా వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదానీ విషయంలో కాంగ్రెస్, బీజేపీ విధానం ఒక్కటే అన్నట్టు అనిపిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, డాక్టర్ కే సంజయ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
అంతర్జాతీయంగా మసకబారిన దేశ ప్రతిష్ఠ
అదానీ బండారం అంతర్జాతీయంగా మళ్లీ బయటపడిందని, అమెరికా నుంచి ఆఫ్రికా వరకు అదానీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తున్నదని కేటీఆర్ చెప్పారు. అదానీ వ్యవహారాలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేయాలని, జా యింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని, ఆయనపై కేసు పెట్టాలని, తాము ఎన్నిసార్లు కోరినా ప్రధాని మోదీ పట్టించుకోలేదని విమర్శించారు. అదానీ కంపెనీల అవకతవకలు మరోసారి బయపడ్డాయని, ఇప్పుడు సీబీఐ కాదు ఎఫ్‌బీఐ రంగంలోకి దిగిందని తెలిపారు. గతంలో హిండెన్‌బర్గ్ అనే సంస్థ కూడా అవకతవకలు జరిగినట్టు తేల్చిందని తెలిపారు. అదానీని ప్రధాని వెనకేసుకు రావడం వల్ల భారతదేశ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా మసకబారిందని వాపోయారు. అదానీ ఎన్నిసార్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నించినా తాము రానివ్వలేదని గుర్తుచేశారు. ‘దేశంలోని అనేక రాష్ర్టాల్లో కేంద్రం సహకారంతోనే అదానీ కోరలు విస్తరించాయి’ అని ధ్వజమెత్తారు. దేశం గర్వపడే బడాబడా పారిశ్రామికవేత్తలను బెదిరించి బలవంతంగా పోర్టులను లాగేసుకున్న చీకటి చరి త్ర అదానీదని విమర్శించారు. అలాంటి అదా నీ సామ్రాజ్యాన్ని తెలంగాణలో అడుగుపెట్టకుండా పదేండ్లపాటు నిలువరించామని చెప్పా రు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ బంగా రు గనిలా తయారైందన్నారు. అందుకే అదానీ కన్ను తెలంగాణపై మరోసారి పడిందని తెలిపారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే బడేభాయ్ ఆదేశాలమేరకు చోటేభాయ్ అదానీతో డీల్ కుదుర్చుకున్నారని మండిపడ్డారు. రాహుల్ అవినీతిపరుడు అన్న వ్యక్తికే రేవంత్ రెడ్‌కార్పెట్ పరిచారని విమర్శించారు. కాంగ్రెస్ ద్వం ద్వ ప్రమాణాలు పాటించిందని, కాంగ్రెస్‌కు బీఆర్ఎస్కు ఉన్న తేడా ఇదేనని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ రాగానే అదానీ వ్యాపార విస్తరణ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అదానీ సంస్థలతో రూ.12,400 కోట్ల మేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ఘనంగా చెప్పుకున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘రూ.5,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, మరో రూ.5,000 కోట్లతో రెండు డాటా సెంటర్లు, రూ.1,400 కోట్లతో అంబుజా సిమెంట్స్, రూ.1,000 కోట్ల్ల ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కోసం ఒప్పందాలు చేసుకున్నారు. వీటితోపాటు తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలను (డిసంలు) అదానీకి అప్పగించేందుకు ఓల్డ్ సిటీ బిల్లుల వసూళ్ల డ్రామా మొదలుపెట్టారు. వాటిని ప్రైవేటీకరించేందుకు కుట్ర చేశారు. యాదాద్రి భూవనగిరి జిల్లా రామన్నపేటలో అంబుజా సిమెంట్స్ కోసం బలవంతంగా అభిప్రాయ సేకరణ చేపట్టారు. సిమెంట్ పరిశ్రమ వద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఏ మూసీ శుద్ధి అంటున్నారో అదే మూసీ సిమెంట్ ఫ్యాక్టరీ కారణంగా మురికిమయం అవుతుందని చెప్పినా పట్టించుకోలేదు. ప్రజాభిప్రాయ సేకరణను మమ అనిపించి అదానీకి సహకరించే పని చేశారు. ఇలా తెలంగాణలో అదానీ సామ్రాజ్య విస్తరణకు ప్రయత్నించారు. రేవంత్‌రెడ్డి ఇంట్లో నాలుగు గంటలపాటు అదానీ సమావేశమయ్యారు. సిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ వ్యవహారాలన్నీ కుట్ర అని మేము భావిస్తున్నాం. ఇప్పుడు మేల్కొనకపోతే
స్వాతంత్య్రం రాకముందు దేశం ఈస్టిండియా కంపెనీ కబంధహస్తాల్లో చిక్కుకున్నట్టు స్వరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ వెస్ట్ ఇండి యా కంపెనీ చేతుల్లో విలవిలలాడబోతున్నది’ అని హెచ్చరించారు.
సామ్రాజ్య వ్యాప్తితో రాహుల్ వాటా ఎంత?
‘చిన్న కార్పొరేషన్ పదవికి కూడా కాంగ్రెస్‌లో హైకమాండ్ పర్మిషన్ కావాలె. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కూడా ఇప్పటివరకు అధిష్ఠానం అనుమతి ఇవ్వలేదు. అలాంటిది అదానీతో ఒప్పందాలకు కాంగ్రెస్ హైకమాండ్ పర్మిషన్ లేదని భావించాలా?’ అని కేటీఆర్ అనుమానం వ్యక్తంచేశారు. రోజూ అదానీని విమర్శించే రాహుల్‌గాంధీ ఈ ఒప్పందాలకు మద్దతిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ వ్యాపార సా మ్రాజ్య నిర్మాణంలో రాహుల్‌గాంధీ వాటా ఎం త? రాహుల్‌కి, ఢిల్లీకి అందుతున్న ఆర్ఆర్ ట్యా క్స్‌లో అదానీ వాటా ఎంత? అని ప్రశ్నించారు.
రాహుల్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు
అదానీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం చేస్తున్న దందాలను రాహుల్ సమర్థిస్తున్నారా? సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘తెలంగాణ కన్నా తకువ తలసరి ఆదాయం ఉన్న కెన్యా ప్రభుత్వం ఆత్మగౌరవంతో వ్యవహరించింది. అదానీపై అమెరికా కోర్టు తీర్పు ఇవ్వగానే అదానీతో మొ త్తం వ్యాపార సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్టు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించారు. కెన్యా రవాణాశాఖ, ఇంధనశా ఖ, విద్యుత్తు, ఎయిర్ పోర్ట్ నిర్వహణతోపాటు వివిధ ఏజెన్సీల ఒప్పందాలు ఏవైనా ఉంటే వెంటనే రద్దు చేసుకోవాలని ఆదేశించారు. అదానీ దుర్మార్గుడని రాహుల్‌గాంధీ అంటుంటారు.. మరి కెన్యా ప్రభుత్వం ఒప్పందాలు రద్దు చేసుకుంటే మీరెందుకు అదానీతో ఒప్పందాలు రద్దు చేయటం లేదు? అదానీ నుంచి ఎంత ఆశించి మీరు రూ.12,400 కోట్ల వ్యా పార ఒప్పందాలు చేసుకున్నారు? ప్రధానితో అదానీ దోస్తీని విమర్శించే రాహుల్‌గాంధీ.. అదానీతో రేవంత్‌రెడ్డి దోస్తీచేస్తే ఎందుకు ఊరుకుంటున్నారు? అదానీతో దేశానికి నష్టమనే రాహుల్‌గాంధీ.. తెలంగాణకు ఏ విధంగా మేలో చెప్పాలి. కాంగ్రెస్ హైకమాండ్‌ను కాదని తెలంగాణలో అదానీకి రెడ్ కార్పెట్ వేశారా? అలాగైతే కాంగ్రెస్ పరంగా అది చాలా నష్టం చేసేపనే. వెంటనే రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. సిల్ యూనివర్సిటీకి విరాళం సరైనదేనని రాహుల్‌గాంధీ భావిస్తున్నారా? అదానీతో ప్రధాని వ్యాపారం చేస్తున్నాడని ఆయన అవినీతిపరుడని చెప్తున్న రాహుల్‌గాంధీ.. అదే అదానీతో రేవంత్‌రెడ్డి వ్యాపారం చేస్తే నీతిపరుడు ఎలా అవుతారు? రాహుల్‌గాంధీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్‌రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
బీజేపీ ఎందుకు స్పందించదు?
అదానీ సంస్థలతో రేవంత్‌రెడ్డి ఒప్పందాలు చేసుకొని దేశ ప్రతిష్ఠను మంటగలుపుతుంటే బీజేపీ ఎందుకు స్పందించటం లేదని కేటీఆర్ నిలదీశారు. ‘అదానీతో ఒప్పందాలు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో అదానీ పెట్టుబడులపై బీజేపీ విధానం స్పష్టంచేయాలి. రాష్ట్రంలో అదానీకి కాంగ్రెస్ రెడ్ కార్పెట్ వేస్తున్నది. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా అదానీకి రెడ్ కార్పెట్ వేస్తున్నది. జాతీయస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మీ విధానం ఏమిటి? అదానీ విషయంలో రేవంత్‌రెడ్డి చేస్తున్నది బీజేపీకి సమ్మతమేనా? రామన్నపేటలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణను అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు వ్యతిరేకించాయి. కానీ కాంగ్రెస్, బీజేపీ మాత్రమే నోరు విప్పలేదు. అదానీ వ్యవహారంలో వీరి బంధం ఏ విధంగా ఉన్నదో తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. అదానీ గండం నుంచి తెలంగాణ గట్టెక్కే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఏనాడైనా తెలంగాణను కాపాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.
మీడియా ఎందుకు అడగదు?
అదానీ అవినీతిలో బీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డిని మీడియా ప్రశ్నించాలని కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. బాంబుల శాఖ మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్స్ జరిగి ఆరు వారాలు అవుతున్నా ఇ ప్పటి వరకు బీజేపీ నుంచి, ఈడీ నుంచి ఒక మాట కూడా ఎందుకు బయటరాలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో రీజనబుల్ పీరియడ్లోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. అంటే మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి ఎంత మొరిగినా తాము మా త్రం సబ్జెక్టే మాట్లాడతామని స్పష్టంచేశారు.
రేవంత్‌రెడ్డీ.. ప్రజలకు జవాబివ్వు..
కెన్యా వంటి దేశం అదానీతో ఒప్పందాలు రద్దుచేసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు వెనుకాడుతున్నారో ప్రజలకు సమాధానం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇది తెలంగాణ ప్రయోజనాలను ఫణంగా పెట్టడం కాదా? అని నిలదీశారు. ‘అదానీ సంస్థతో రేవంత్ సర్కారు చేసుకున్న ఒప్పందాల పూర్తి వివరాలు తెలంగాణ ప్రజల ముందు పెట్టాలి. మహారాష్ట్రలో ఎన్సీపీ చీలికలో అదానీ హస్తం ఉందంటారు. ఆయన రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారని వింటున్నాం. కోహినూర్ హోటల్లో అదానీతో మంత్రి పొంగులేటి సమావేశంపై కూడా వివరణ ఇవ్వాలి. బీజేపీ వాషింగ్ మెషిన్లో పునీతులయ్యేందుకు అదానీతో సమావేశమయ్యారా?’ అని కేటీఆర్ నిలదీశారు.
రేవంత్‌రెడ్డి మహారాష్ట్రకు వెళ్లి అదానీ గజదొంగ అంటారు. హైదరాబాద్ రాగానే గజమాల వేసి స్వాగతం పలుకుతారు. కేసీఆర్ పదేండ్లలో సృష్టించిన తెలంగాణ సంపదను క్రోనీ క్యాపిటలిస్టులు దోచుకునేలా చేస్తారా? అదానీపై కేసులు పెట్టాలా వద్దా? అరెస్టు చేయాలా వద్దా? రాహుల్ చెప్పినట్టు అదానీది అవినీతి సంస్థనా కాదా? మరి ఏ కారణం చేత అదానీతో దోస్తీ కట్టారో రేవంత్‌రెడ్డి ప్రజలకు చెప్పాలి.
-కేటీఆర్
రాహుల్‌తో జాతీయ స్థాయిలో ఢీ అంటే ఢీ అనే బీజేపీ నేతలు రాష్ట్రంలో రేవంత్‌తో మాత్రం దోస్త్ మేరా దోస్త్ అన్నట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అదానీ అవినీతి సామ్రాజ్యానికి సీఎం రేవంత్‌రెడ్డి సహకరిస్తున్నారు కాబట్టే మూసీ అవినీతి ప్రాజెక్టుకు బీజేపీ సహకరిస్తున్నదా? అదానీ అవినీతి పెట్టుబడులు తెస్తున్న రాష్ర్టాలన్నీ కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలే అంటున్నారు. తెలంగాణలో అదానీ పెట్టుబడులపై బీజేపీ విధానం స్పష్టంచేయాలి.
-కేటీఆర్
పారిశ్రామికవేత్తలు ఎవరూ ఊరికే విరాళాలివ్వరని మహారాష్ట్ర ఎన్నికల సభల్లో రాహుల్‌గాంధీ చెప్పారు. నీకిది నాకది అని ఏదో పెద్దదే ఆశించి ఇస్తారన్నారు. మరికడి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.100 కోట్లు అదానీ నుంచి విరాళం తీసుకున్నది. రాహుల్‌గాంధీకి తెలిసి తీసుకున్నారా? తెలియకుండానా
-కేటీఆర్