హైదరాబాద్: తెలంగాణ తొలిపొద్దు కాళోజీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. నిరంకుశత్వం, అరాచక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తారని చెప్పారు. తెలంగాణ ప్రజల్లో చైతన్యం రగిల్చిన మహా మనిషి అని చెప్పారు. తెలంగాణ భాష.. బడి భాష కాదని, పలుకుబడుల భాష అని చాటారన్నారు. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు.
‘తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. తెలంగాణ ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ. ప్రజాకవిగా, ఉద్యమకారుడిగా భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణరావు. నిరంకుశత్వానికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తి తెలంగాణ ప్రజల్లో చైతన్యం రగిల్చిన మహా మనిషి కాళోజీ, పలు భాషల్లో రచనలు చేసి ప్రజల హక్కుల కోసం పోరాడాడు. తెలంగాణ వాడుక భాషలో రచనలను ప్రాచుర్యంలోకి తెచ్చి.. తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటాడు.
వారి సేవలను గౌరవిస్తూ.. కేసీఆర్ ప్రభుత్వం కాళోజీ జయంతిని (సెప్టెంబర్ 9) తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది, కాళోజీ అవార్డును నెలకొల్పింది. వరంగల్లోని వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ నారాయణరావు పేరు పెట్టడమే కాకుండా.. హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణాన్ని చేపట్టింది. కాళోజీ జయంతి సందర్భంగా.. వారి రచనలను తెలంగాణ యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఆశిస్తూ.. కాళోజీ గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. జోహార్ కాళన్న!’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.