హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): పేదల ఇండ్లకు పింఛన్ చేరడం లేదు కానీ, బుల్డోజర్లు మాత్రం వస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పేదలకు రూ.4,000 పెన్షన్ రాదు. ఆడబిడ్డలకు రూ.2,500 మహాలక్ష్మి పథకం రాదు. అన్నదాతలకు రుణమాఫీ కాదు, రైతన్నలకు రూ.15,000 రైతుభరోసా రాదు. మరణించిన రైతు కుటుంబాలకు రైతుబీమా రాదు, పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం రాదు. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ సూటీలు రావు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రావు. అయినా, ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ బుల్డోజర్ వస్తది. మహానగరం హైదరాబాద్ నుంచి మారుమూల పల్లెల వరకు, జనారణ్యం నుంచి వనారణ్యం వరకు బుల్డోజర్ రాజ్యం, ఆరు గ్యారెంటీలు గాలికి, అడగని గ్యారెంటీలు ముందుకు.. జాగో తెలంగాణ జాగో..’ అని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఫైరయ్యారు.
గురుపౌర్ణమి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళోజీ నారాయణరావును స్మరించుకున్నారు. ఈ పవిత్ర సందర్భాన్ని పురసరించుకొని, జ్ఞానం, మేధస్సు, అంతర్గత ఆలోచనలను వెలిగించే మార్గదర్శకులకు వందనాలు తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన మహానుభావుల్లో కాళోజీ నారాయణరావు ఒకరని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం పట్ల ఆయన చూపిన కృషికి గుర్తుగా వరంగల్లో ‘కాళోజీ కళాక్షేత్రం’ ఏర్పాటుచేశామని, రాష్ట్ర ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కూడా ఆయన పేరు పెట్టామని పేర్కొన్నారు. గురుపౌర్ణమి సందర్భంగా కాళోజీకి కేటీఆర్ ఎక్స్ వేదికగా వినమ్ర నివాళి అర్పించారు. కాళోజీ కళాక్షేత్రం వీడియోను పోస్టు చేశారు.