KTR | ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలోని ఏదో ఒక జిల్లాకు ఆయన పేరును పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డులోని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బహుజన రాజ్యాంగం కోసం, తెలంగాణ ప్రాంతంలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న అని తెలిపారు. ఆయన ఆశయాలను సాధించే దిశగా గత కేసీఆర్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గౌడన్నలకు చెట్ల పన్నులను, అప్పటిదాకా ఉన్న బకాయిలను పూర్తిస్థాయిలో మాఫీ చేసిందని గుర్తు చేశారు.
ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఏదో ఒక జిల్లాకు నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అనంతరం సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న మార్కండేయ ఆలయ నిర్మాణంలో భాగంగా మహా చండీయాగంలో కేటీఆర్ పాల్గొన్నారు. మహా చండీయాగంలో కేటీఆర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు కేటీఆర్‌ను ఘనంగా సత్కరించారు. ఆలయ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యుడిగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సిరిసిల్లలో నెలకొన్న నేతన్నల వస్త్ర పరిశ్రమ సంక్షోభం అమ్మవారి ఆశీస్సులతో తీరాలని కోరుకున్నట్లు తెలిపారు.