రాజన్న సిరిసిల్ల, మే 29 (నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 27వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్కు చెందిన కాసర్ల పద్మ (56) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మూడు రోజుల క్రితం ఛాతిలో నొప్పి రావడంతో కరీంనగర్‌లోని ఓ దవాఖానలో చేర్పించారు. అక్కడ బైపాస్ సర్జరీ చేయగా శుక్రవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి మృతిచెందారు. పద్మ మరణవార్త తెలుసుకున్న కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వెంటనే హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు చేరుకున్నారు. పద్మ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె పార్థివదేహంపై పార్టీ కండువా కప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. విషాద వదనంతో, చెమ్మగిల్లిన కండ్లతోనే వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
పద్మ అకాల మర ణం అత్యంత బాధాకరమని, ఆమె పవి త్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపా రు. వారి కుటుం బ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం పార్టీ శ్రేణులు, కౌన్సిలర్లు కూడా నివాళులర్పించారు. అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా, కౌన్సిలర్ పద్మ భర్త పర్శరాములు పదేండ్ల క్రితమే మరణించారు. 2020లో పద్మ బీఆర్ఎస్లో చేరారు. అప్పటి ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అంతిమయాత్రలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ దార్ల సందీప్, బొల్లి రామ్మోహన్, శ్రీనివాస్, పార్టీశ్రేణులు పాల్గొన్నారు.