హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నీటి హక్కుల కోసం జీవితాన్ని ధారబోసిన ఆర్ విద్యాసాగర్‌రావు ‘నీళ్లసారు’ గా కిర్తీగడించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. శుక్రవారం ఆయన జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ఉమ్మడి పాలనలో జరిగిన జల దోపిడీ, తెలంగాణకు జరిగిన అపార నష్టం గురించి ప్రజలను చైతన్యవంతులను చేయడంలో కీలకభూమిక పోషించారని ప్రశంసించారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ పిలుపుమేరకు నీటిపారుదల సలహాదారుగా విలువైన సలహాలు, సూచనలందించారని గుర్తుచేసుకున్నారు. విద్యాసాగర్‌రావు సేవలను గుర్తించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. డిండి ఎత్తిపోతల పథకానికి ఆయన పేరు పెట్టి సమున్నతంగా గౌరవించారని పేర్కొన్నారు. ఆయన సొంతూరు జాజిరెడ్డిగూడెంలో ఆ మహనీయుడి పేరిట సబ్యార్డును నిర్మించారని గుర్తుచేశారు.
ఉమ్మడి పాలనలో నీటి దోపిడీపై, తెలంగాణకు జరిగిన అన్యాయంపై సామాన్యులకు సైతం అర్థమయ్యేలా విడమరిచి చెప్పిన ఆర్ విద్యాసాగర్‌రావు జల విజ్ఞాన నిధిగా ఖ్యాతి గడించారని మాజీ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. విద్యాసాగర్‌రావు సేవలను స్మరించుకున్నారు.