హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తేతెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్నపురెడ్డిపల్లి మాజీ జడ్పీటీసీ లావణ్య, రాంబాబు దంపతుల కుమారుడికి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సూర్యాంశ్ అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఆ దంపతులు మురిసిపోయారు. ఈ అపురూపమైన క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయని తెలిపారు. సోమవారం తమ కుమారుడి నామకరణ మహోత్సవానికి అభిమాననేత కేటీఆర్ హాజరు కావడం, పేరు పెట్టడంపై హర్షం వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా చిన్నారిని కేటీఆర్ ఎత్తుకుని ముద్దుచేశారు. ఏ అక్షరంతో పేరు పెట్టాలని లావణ్య, రాంబాబు దంపతులను అడిగారు. పండితుల సూచనల మేరకు ‘సు’ అక్షరంతో పేరు పెట్టాలని కోరారు. కేటీఆర్ తన కుమారుడు హిమాన్ష్ పేరును గుర్తుచేసుకుంటూ ఆ బాబుకు సూర్యాంశ్ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా లావణ్య, రాంబాబు దంపతులు భావోద్వేగానికి గురయ్యారు. గతంలో జడ్పీటీసీ టికెట్ ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహించిన కేటీఆర్, ఇప్పుడు తమ కుమారుడికి పేరు పెట్టడంపై సంతోషం వ్యక్తంచేశారు. అడిగిన వెంటనే వేడుకకు హాజరు కావడాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని చెప్పారు.