KTR | ఓ కాంట్రాక్టర్ మంత్రి, ఓ బ్రోకర్ ముఖ్యమంత్రి అని.. వాళ్లకు మాటలు గిట్లే వస్తయ్.. వాళ్లకు తెలిసిన రాజకీయం ఇదే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. నందినగర్‌లోని నివాసం వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇక్కడ బీజేపీ రక్షణకవచంలా కాంగ్రెస్‌కు పని చేస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ ఏ టీమ్, బీ టీమ్. ఏవరో ఏ టీమ్ మాకు తెలియదు. ఇవాళ ఒకరినొకరు పెనవేసుకున్న బంధంతో కలిసి పని చేస్తున్నారు. ఆయన కేసు పెడుతడు.. ఇక్కడికేలి వీళ్లు కాకిరిబీకిరి లొల్లి స్టార్ట్ చేస్తరు. ఇవన్నీ మాకు కొత్త కాదు. గతంలోనూ చూశాం.. భవిష్యత్‌లోనూ చూస్తాం. ఇద్దరినీ గతంలో చిత్తుచేసి రెండుసార్లు అధికారంలోకి వచ్చాం. భవిష్యత్‌లో ప్రజల ఆశీర్వాదంతో ప్రజల దయతో అధికారంలోకి వస్తాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘కేసులను న్యాయవ్యవస్థ ద్వారా.. ప్రజాక్షేత్రంలో ఈ రెండు పార్టీలను ఎదుర్కొంటాం. మంత్రి బాంబులేటికి ఒకటే విషయం చెబుతున్నా. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో పొంగులేటిని సూటిగా ప్రశ్నిస్తున్నా. పొంగులేటి, మెగా కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి రూ.4600 కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేక్ కేసుకోసుకున్నట్లు ఇద్దరు చెరో ప్యాకేజీ పంచుకున్నరు. మెగా ఇంజినీరింగ్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి 2022-23లో వందకోట్లు బాండ్ల రూపంలో ఇచ్చింది. ఇది క్విడ్‌ప్రోకో. మెగా డబ్బులు ఇచ్చింది. అందుకే రేవంత్‌రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు. మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి.. రాఘవ ఇంజినీరింగ్‌కు కూడా ఆయన పని ఇచ్చిండు అంటే మీకు సమ్మతమేనా? గ్రీన్ కో అనే సంస్థ ద్వారా ఎలక్టోరల్ బాండ్లు అందుకోని రాజకీయ పార్టీ తెలంగాణలో ఉందా? కేవలం బీఆర్ఎస్కే ఇచ్చిందా? కాంగ్రెస్‌కు ఇవ్వలేదా? బీజేపీకి ఇవ్వలేదా? టీడీపీకి ఇవ్వలేదా? వైఎస్సార్సీపీకి ఇవ్వలేదా? అందరికీ ఇచ్చారు కదా.. మామీదనే ఏడుపు ఎందుకు’ అంటూ ప్రశ్నించారు.
‘క్విడ్‌ప్రోకో అంటే ఏందీ? ఆ మాటకు అర్థం తెలుసా? క్విడ్‌ప్రో కో అంటే నీకు ఇంతా.. నాకు ఇంత. ఆయన నాకు ఇచ్చిండు అనుకుందాం.. ఆయనకు నేను ఏం ఇచ్చాను? అది రుజువు చేస్తవా? దానికి అర్థం వుందా? దాన్ని రాసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి కదా? దాని అర్థం ఏంటీ? ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. ఎవడో మంత్రి చెప్పిండు.. ముఖ్యమంత్రి లీకు ఇచ్చిండు.. లీకు వీరుడు చెప్పంగానే మేం రాసేస్తాం.. ప్రకటనల కోసం గిట్లనా? మీడియాను నేను కోరేది ఒకటే. ఒకటికి రెండుసార్లు ఫ్యాక్ట్ చెక్ చేయండి. మీడియా ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం. ఒక స్తంభం అబద్ధాలు ఆడుతుంటే.. దాగుడు మూతలు ఆడుతుంటే.. సగం.. సగం సమాచారం ఇచ్చి.. అర్ధ సత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంటే.. దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయకపోతే తప్పు కదా? సూటిగా ప్రశ్నిస్తున్నాను’ అన్నారు.
‘మెగా ఇంజినీరింగ్ సంస్థ మాకు కూడా బాండ్లు ఇచ్చింది అది కూడా చెబుతున్నాను. ఆయన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్కు ఇచ్చిండు. మెగా ఇంజినీరింగ్ ఆ రోజు కాంగ్రెస్ పైసలు ఇచ్చింది.. తర్వాత రేవంత్‌రెడ్డి లిఫ్ట్ ఇచ్చిండు. మది క్విడ్ ప్రోకోనేనా? రేపు మల్లన్నసాగర్ నుంచి రూ.4వేలకోట్ల ప్రాజెక్టు మెగా ఇంజినీరింగ్ రాబోతుందని నాకున్న సమాచారం. అది కూడా క్విడ్ప్రోకోనేనా? మూసి ప్రాజెక్టు అని మాట్లాడుతున్నారు. మెగా ఇంజినీరింగ్‌ను బ్యాన్ చేయాలని చెప్పారు. సుంకిశాలలో రిటైన్వాల్ కూలిపోయిన తర్వాత హెచ్ఎండబ్ల్యూఎస్ రిపోర్ట్ ఇచ్చింది బ్లాక్ చేయాలని. మరి ఎందుకు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టలేదు? మరి క్విడ్ప్రోకోనా? ఆయన ఇచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్లకు ప్రతిఫలమేనా? దానికి సమాధానం చెబుతావా? మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి. ఓ కాంట్రాక్టర్ మంత్రి.. ఓ బ్రోకర్ ముఖ్యమంత్రి. వాళ్లకు మాటలు గిట్లే వస్తయ్. వాళ్లకు తెలిసిన రాజకీయం ఇది’ అంటూ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.