Rythu Discom | హైదరాబాద్, మే 28 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేయనున్న రైతు డిస్కమ్ ఏర్పాటుపై బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున గళమెత్తనున్నది. కొత్త డిస్కమ్ వెనుక దాగి ఉన్న కుట్రలను బట్టబయలు చేసేందుకు సిద్ధమైంది. వాస్తవాలను తెలంగాణ ప్రజానీకానికి విడమరచి చెప్పాలని నిర్ణయించింది. ఇప్పటికే బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్‌కు బహిరంగలేఖ రాశారు. కొత్త డిస్కం మాటున దాగి ఉన్న చీకటి కోణాలను ఆ లేఖలో ప్రస్తావించారు. రైతు డిస్కమ్ దరఖాస్తును తిరస్కరించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని విద్యుత్తు, వ్యవసాయ శాఖల మాజీ మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఇతర సీనియర్ నేతలతో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈఆర్సీ చేపట్టనున్న ప్రజాభిప్రాయ సేకరణకు హాజరుకానున్నది. రైతు డిస్కమ్ ఏర్పాటుతో రాష్ట్ర రైతాంగానికి, విద్యుత్తు రంగానికి వాటిల్లే నష్టాలను, ప్రభుత్వ వైఖరిని కమిషన్ దృష్టికి ప్రతినిధి బృందం తీసుకెళ్లనున్నది.
రైతు డిస్కమ్ నెలకొల్పడంపై వాటిల్లే నష్టాలను ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణలో బీఆర్ఎస్ లేవనెత్తుతున్నది. రైతులు, సాధారణ వినియోగదారులకు భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు స్కీమ్‌కు పొంచి ఉన్న ప్రమాదాన్ని ప్రతినిధులు వివరించనున్నారు. ఆదాయం రాని వ్యవసాయ, గృహ కనెక్షన్ల ఆధారంగా డిస్కమ్ ఏర్పాటులో ప్రభుత్వ ఆంతర్యాన్ని ఈ సందర్భంగా వారు ప్రశ్నించనున్నారు. ఆర్థిక, సాంకేతిక, చట్టపరమైన లోపాలను ఎత్తిచూపనున్నారు. రైతు డిస్కమ్ పేరిట విద్యుత్తు రంగాన్ని ప్రైవేట్‌పరం చేసే ప్రభుత్వ పన్నాగాన్ని తెలంగాణ ప్రజలకు వివరించనున్నారు. ఉద్యోగుల కేటాయింపులో ఎదురయ్యే సమస్యలు, ఆర్థికంగా తలెత్తే ఇక్కట్లను కేటీఆర్, ఇతర ప్రతినిధులు ప్రస్తావించనున్నారు.