హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు వారం రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం అమెరికాకు బయలుదేరి వెళ్లారు. న్యూయార్‌లోని ప్రముఖ కొలంబియా యూనివర్సిటీలో ఏప్రిల్ 4న జరిగే ‘ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్’లో ఆయన ప్రసంగించనున్నారు. కొలంబియా యూనివర్సిటీకి చెందిన సౌత్ ఏషియా బిజినెస్ అసోసియేషన్ (సబా) గత 21 ఏండ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ ఏడాది ‘ది న్యూ ఇండియా ప్లేబుక్’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సులో భారతీయ వ్యాపార వ్యూహాలు, సుస్థిరతపై అనేక రంగాలకు చెందిన ప్రముఖులు చర్చించి ప్రసంగించనున్నారు.
ఈ నెల 4న ‘భారత్ ఎదుగుదల: ప్రపంచ వ్యాపార గమనంలో సరికొత్త అధ్యాయం’ అనే అంశంపై కేటీఆర్ మాట్లాడనున్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ వ్యాపార రంగం, ఆర్థిక సంసరణలు, అభివృద్ధి వ్యూహాలపై ఆయన తన అనుభవాలను పంచుకోనున్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రిగా గతంలో ఆయన సాధించిన విజయాలు, రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చిన తీరును దృష్టిలో ఉంచుకుని కేటీఆర్‌కు ఈ ఆహ్వానం అందింది. వ్యాపార సదస్సుతోపాటు ఈ పర్యటనలో కేటీఆర్ తన కుమారుడు హిమాన్షును కూడా కలువనున్నారు. వృత్తిపరమైన బాధ్యతలతోపాటు, కొంత సమయాన్ని తన కుటుంబసభ్యులతో గడపనున్నట్టు ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా వెల్లడించారు.