
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయాణంలో మురుగునీటిశుద్ధి మైలురాయిలా నిలుస్తుందని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. రాజధానిని మహానగరంగా మార్చాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్తుంటారని తెలిపారు. హైదరాబాద్‌లో తొలివిడతగా రూ.1,280.87 కోట్లతో 17 మురుగునీటి శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ)లను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఫతేనగర్‌లో రూ.317 కోట్లతో 100 ఎల్ఎండీ సామర్థ్యంతో నిర్మిస్తున్న ఎస్టీపీకి శుక్రవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. హైదరాబాద్‌లో పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి కల్పన అవకాశాలతో వలసలు పెరుగుతున్నాయని చెప్పారు. ఓఆర్ఆర్ లోపల, వెలుపల కొత్త కాలనీలు ఏర్పాటవుతున్నాయని వివరించారు. నగరంలో రోజుకు 1,950 ఎంఎల్డీల మురుగునీరు వెలువడుతుండగా 772 ఎంఎల్డీలు (40 శాతం) శుద్ధి చేస్తున్నామని చెప్పారు. దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే మన దగ్గరే ఎక్కువశాతం మురుగునీటిని శుద్ధి చేస్తున్నామని తెలిపారు. దీనిని పెంచాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. గతంలో భోలక్‌పూర్‌లో పైప్లైన్లలో మంచినీరు, మురుగునీరు కలిసిపోయి తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారని.. ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఎస్టీపీల నిర్మాణంతో మురుగునీరు చెరువుల్లోకి చేరదని.. దీంతో వాటిచుట్టూ వాక్‌వేలు నిర్మించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. నాలాల మీద ఎన్ని ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టినా చెత్త, ప్లాక్టిక్ బాటిళ్లు, పాడైపోయిన ఫర్నిచర్‌ను వేయడం మానేస్తేనే ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కార్యక్రమంలో కార్మిక మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్, శంభీపూర్ రాజు పాల్గొన్నారు.